
World Cup 2023 Final : వన్డే వరల్డ్ కప్ 2023 ఫీవర్ దేశమంతా వ్యాపించింది. అందరిలో ఒకటే ఫైనల్ నామస్మరణ…అందరిలో టెన్షన్ మొదలైంది. ఎప్పుడు ఆదివారం అవుతుందా? ఎప్పుడు మధ్యాహ్నం అవుతుందా? అని అంతా కళ్లల్లో వత్తులు వేసుకుని చూస్తున్నారు.
ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్ కు ఆతిథ్యం ఇస్తున్న అహ్మదాబాద్ లోని మోదీ స్టేడియం ముస్తాబైంది. ఈ మ్యాచ్ చూసేందుకు ఏకంగా భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకావడంతో మొత్తం ప్రపంచం చూపు అంతా ఒక్కసారి మ్యాచ్ ఫైనల్ పై ఫోకస్ అయ్యింది.
ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని ఆలబెన్స్ కి ఆహ్వానం వెళ్లింది. ఇంకా దేశ విదేశాల్లోని ప్రముఖులకు ఆహ్వానాలు పంపిస్తున్నారు. ముఖ్యంగా బిగ్ బి అమితాబ్ కూడా ఫైనల్ మ్యాచ్ కి హాజరవుతున్నారు. వీరే కాకుండా కేంద్ర ప్రభుత్వంలోని కీలక శాఖలకు చెందిన మంత్రులు, అధికారులు కూడా హాజరవుతున్నారు.
వీరేకాకుండా చోటామోటా సెలబ్రిటీలు, మాజీ ప్రముఖ క్రికెటర్లు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ మరొక కీలక నిర్ణయం తీసుకుంది. ఇంతవరకు వరల్డ్ కప్ నెగ్గిన ఆ దేశాల కెప్టెన్లను ఆహ్వానిస్తోంది. వారికోసం ప్రత్యేకమైన బ్లేజర్లను తయారు చేస్తోంది.
లెజెండరీ కెప్టెన్లు అందరూ ఈ స్పెషల్ బ్లేజర్ వేసుకొంటారని, దాంతోనే మ్యాచ్ చూస్తారని అంటున్నారు. గతంలో వరల్డ్ కప్ నెగ్గిన జట్టు కెప్టెన్లు విండీస్ దిగ్గజం క్లైవ్ లాయిడ్, కపిల్ దేవ్, అలన్ బోర్డర్, అర్జున రణతుంగ, స్టీవ్ వా, రికీ పాంటింగ్, ఎంఎస్ ధోనీ, మైఖేల్ క్లార్క్, ఇయాన్ మోర్గాన్ తదితరులు ఈ మ్యాచ్ చూసేందుకు వస్తున్నట్లు సమాచారం.
ఆనాటి వరల్డ్ కప్ గెలిచిన పాక్ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ ఒక్కడే రావడం లేదు. ఎందుకంటే ప్రస్తుతం అతను పాకిస్తాన్‌లో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఇతను తప్ప అందరూ వస్తున్నారు.
ఇంతమంది వస్తూండటంతో అహ్మదాబాద్ లోని మోదీ స్టేడియం చుట్టూ సెక్యూరిటీల హడావుడి, సీసీ కెమెరాలు, పోలీస్ స్క్వాడ్స్ ఇలా ఒకటి కాదు పరిసరాలన్నీ కూడా సెక్యూరిటీ జోన్ లోకి వెళ్లిపోయాయి. రేపు మ్యాచ్ చూసేందుకు వచ్చే క్రౌడ్ ని ఎలా కంట్రోల్ చేస్తారనేది పెద్ద సవాల్ గా మారింది.
రేపు ఆదివారం మరేపనులు పెట్టుకోకుండా టీవీల దగ్గరే ఉండాలని ముందుగానే భారతీయులంతా డిసైడ్ అయ్యారు. మొన్న జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ ని ఒక్క హాట్ స్టార్ లోనే 5 కోట్ల మంది చూశారు.
ఇక మిగిలిన సామాజిక మాధ్యమాల్లో ఎంతమంది చూశారో తెలీదు. రేపు జరగబోయే ఫైనల్ మ్యాచ్ ని 140 కోట్ల మంది భారతీయుల్లో సగం మందిపైనే చూస్తారని అంటున్నారు.