
Heath Streak : జింబాబ్వే క్రికెట్ లో ఒక శకం ముగిసింది. దిగ్గజం క్రికెటర్ హీత్ స్ట్రీక్ కన్నుమూశాడు. 49 ఏళ్ల స్ట్రీక్ క్యాన్సర్‌తో పోరాడి ఓడాడు. ఆదివారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచాడని అతడి కుటుంబ సభ్యులు ప్రకటించారు.
జింబాబ్వే క్రికెట్ జట్టును బలంగా మార్చడంలో హీత్ స్ట్రీక్ ఎంతో కీ రోల్ పోషించాడు. ఆల్‌రౌండర్‌గా జింబాబ్వే జట్టుకు ఎన్నో ఘన విజయాలను అందించాడు. ఆటగాడిగా, కెప్టెన్ గా జింబాబ్వే జట్టుకు సుధీర్ఘ కాలం సేవలందించాడు.
జింబాబ్వే తరఫున 1993 నుంచి 2005 వరకు హీత్ స్ట్రీక్ ప్రాతినిధ్యం వహించాడు. ఆ జట్టు తరఫున 65 టెస్టులు ఆడి 1990 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 11 హాఫ్ సెంచరీలున్నాయి. అత్యుత్తమ వ్యక్తిగత స్కోర్ 127 నాటౌట్. టెస్టుల్లో 216 వికెట్లు స్ట్రీక్ పడగొట్టాడు. ఏడుసార్లు 5 వికెట్ల ప్రదర్శన చేశాడు.
ఇక వన్డేల్లో హీత్ స్ట్రీక్ అద్భుతంగా రాణించాడు. జింబాబ్వే తరఫున 189 వన్డేలు ఆడి.. 2942 పరుగులు చేశాడు. అందులో 13 హాఫ్ సెంచరీలున్నాయి. అత్యుత్తమ వ్యక్తిగత స్కోర్ 79 నాటౌట్. వన్డేల్లో 239 వికెట్లు తీశాడు. జింబాబ్వేకు కెప్టెన్‌గానూ వ్యవహరించిన స్ట్రీక్ రెండు ఫార్మాట్లలో కలిపి 4,932 పరుగులు చేయడంతోపాటు 455 వికెట్లు తీశాడు.
రిటైర్ అయిన తర్వాత స్ట్రీక్ క్రికెట్ కు తన సేవలు అందించాడు. 2016 నుంచి 2018 వరకు జింబాబ్వే జట్టుతోపాటు దేశవాళీ లీగ్‌లలోని జట్లకు కోచ్‌గా పనిచేశాడు. బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుకు బౌలింగ్ కోచ్‌గానూ హీత్ స్ట్రీక్ పనిచేశాడు.
కొన్ని రోజుల క్రితం హీత్ స్ట్రీక్ మరణించాడని సహచర ఆటగాడు హెన్రీ ఒలంగా ట్వీట్ చేసి కలవరం రేపాడు. అయితే ఆ తర్వాత స్ట్రీక్ బతికే ఉన్నాడని తెలుపుతూ మరో ట్వీట్ చేసి తన తప్పును సరిదిద్దుకున్నాడు. ఈ ఘటన జరిగిన కొన్ని రోజులకే స్ట్రీక్ నిజంగా కన్నుమూయడం విషాదంగా మారింది.