
BRS : తెలంగాణలో రాజకీయాలు హాట్ హాట్‌గా మారాయి. అందరికంటే ముందే అభ్యర్థులను ప్రకటించి ప్రచారం వైపు దూసుకెళ్తోంది బీఆర్‌ఎస్. ఈ క్రమంలోనే ప్రచారానికి ఒక్కో అభ్యర్థికి పార్టీ ఫండ్‌గా రూ. 10 కోట్లు ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. దీంతో బీఆర్‌ఎస్ టిక్కెట్ కోసం పోటీలో ఉన్న ఆశావాహుల ఆశలపై నీళ్లు పడినట్లైందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్ లోపు జరగనున్నాయి. ఇప్పటికే గులాబీ బాస్ కేసీఆర్ 105 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించారు. అయితే కొన్నిచోట్ల అభ్యర్థులను మారుస్తారనే వార్తలతో సిట్టింగ్ ఎమ్మెల్యేలు మరోవైపు అభ్యర్థులకు పార్టీ ఫండ్ పంపారనే ప్రచారంతో ఆశావాహులు అయోమయానికి గురవుతున్నారు. ఎన్నికలకు 3 నెలల ముందే ఒకేసారి 105 మంది అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించారు. అయితే చాలా చోట్ల సిటింగ్ లను మార్చాలంటూ టిక్కెట్ ఆశించిన నేతలు తిరుగుబాటు జెండా ఎగురవేశారు.
పార్టీ నేతల నుంచి వస్తున్న తీవ్ర వ్యతికేకత దృష్ట్యా కొన్నిచోట్ల అభ్యర్థులను మార్చక తప్పదనే ఆలోచనలో గులాబీ అధినేత ఉన్నట్లు తొలుత వార్తలు వచ్చాయి. అభ్యర్థుల ప్రకటన సమయంలో స్వయంగా కేసీఆర్ సైతం కొన్నిచోట్ల అభ్యర్థులను మార్చాల్సి వస్తే మారుస్తామన్నారు. దాదాపు 10 మందిని మార్చే అవకాశం ఉందని పార్టీ నుంచే లీకులు వచ్చాయి.
మరోవైపు రెండు రోజుల క్రితమే అభ్యర్థులకు పార్టీ ఫండ్ వెళ్లిందని ప్రచారం జరుగుతోంది. ఒక్కో అభ్యర్థికి దాదాపు రూ. 10 కోట్ల చొప్పున పంపినట్లు సమాచారం. దీంతో అభ్యర్థుల మార్పుపై ఆశలు పెట్టుకున్న ఆశావహులు నిరాశకు గురవుతున్నారు. ఇక తమకు టిక్కెట్ ఆశలు గల్లంతయ్యాయని ఆందోళన చెందుతున్నారు.
టికెట్ ఆశించి అసంతృప్తితో ఉన్న క్షేత్రస్థాయి నాయకులను బుజ్జగించేందుకు గులాబీ పార్టీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. అలాగే ఇతర పార్టీలలోని ప్రజాప్రతినిధులను చేర్చుకునేందుకు పార్టీ పంపిన ఫండ్ వాడుకోవాలని అభ్యర్థులకు సూచించినట్లు బీఆర్‌ఎస్ క్యాడర్ చెవులు కొరుక్కుంటున్నాయి.
ఒకవైపు అభ్యర్థుల మార్పుపై చర్చ జరుగుతుండగానే.. టిక్కెట్ పొందిన నేతలకు పార్టీ ఫండ్ పంపడంతో క్షేత్రస్థాయి నాయకులలో అయోమయం నెలకొంది. సిట్టింగ్ లను మార్చకపోతే తమ దారి తాము చూసుకుంటానని తెగేసి చెబుతున్నారు కొందరు నేతలు. ఇక మరికొందరు నేతలు వచ్చినకాడికి దండుకుందామనే ధోరణిలో అభ్యర్థి ఇచ్చే తయిలాలకు మెత్తపడ్డారని తెలుస్తోంది. మరి తెలంగాణలో రానున్న రోజుల్లో పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.