Encounter at Karregutta: బీజాపూర్ అడవుల్లో మరోసారి కాల్పుల మోత మోగింది. 30 మందికి పైగా మావోలు హతమైనట్లు సమాచారం. ఒకే రోజు రెండు చోట్ల భారీ ఎన్ కౌంటర్లు జరిగాయి. బీజాపూర్ జిల్లా శివారు లంకపల్లి అడవుల్లో ఎన్ కౌంటర్ జరిగినట్లు తెలిసింది. సెర్చ్ ఆపరేషన్ లో 24 మంది మావో మృతదేహాలను గుర్తించారు. మిగతా మృతదేహాల కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.
ఘటనా స్థలంలో మావోల భారీ డంప్ ను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మావోయిస్టులు గ్రూపులుగా విడిపోయి..కర్రెగుట్టలను వదిలివెళుతున్నట్లు భద్రతా బలగాలు గుర్తించాయి. దీంతో చత్తీస్ గడ్ మహారాష్ట్ర, ఆంధ్రా ఒరిస్సా అటవీ ప్రాంతాల్లో బలగాలను మోహరిస్తోంది కేంద్రం.
ఆపరేషన్ సిందూర్ కొనసాగుతున్న నేపథ్యంలో ఆపరేషన్ కగార్‌ను కొన్ని రోజుల క్రితం కేంద్రం తాత్కాలికంగా నిలిపివేసింది. బలగాలలో కొన్ని విభాగాలను అక్కడి నుంచి తరలించింది. ఆపరేషన్ కగార్‌కు తాత్కాలిక విరామం ప్రకటించింది.
కొన్ని రోజుల పాటు కాల్పులు జరగకపోవచ్చని అందరూ భావించారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా బీజాపూర్ అడవులు దద్దరిల్లాయి. 30 మంది మావోయిస్టులను పై లోకాలకు పంపించారు.
ఇదిలా ఉంటే.. మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా కేంద్రప్రభుత్వం కొనసాగిస్తున్న ఆపరేషన్ కగార్.. బీజాపూర్ జిల్లాలోని ఏజెన్సీ వాసులను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. భద్రతా బలగాల ఫోకస్ మొత్రం కర్రెగుట్టలపై ఉండడంతో వాటిని ఆనుకొని ఉన్న కోయగూడెంలలో భయానక వాతావరణం కనిపిస్తోంది. తమ గ్రామాలపై తిరుగుతున్న ఆర్మీ హెలికాప్టర్‌లు, గుట్టల్లో గర్జిస్తున్న గన్‌లు, పేలుతున్న బాంబులతో అటవీ ప్రాంతం అంతా కనిపించిపోతోంది.
మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు హిడ్మా దళానికి గెరిల్లా బేస్ క్యాంపుగా కర్రెగుట్టలు పనిచేశాయి. దశాబ్దాల కాలంగా గెరిల్లా ఆర్మీకి శిక్షణ ఇచ్చేందుకు మావోయిస్టు కేంద్ర కమిటీ నేతలు కర్రెగుట్టలను సేఫ్ జోన్‌గా మార్చుకున్నారు. ఆ తర్వాత కాలంలో మావోయిస్టు దళాలు దండకారణ్యానికి వలస వెళ్లినప్పటికీ… ఎమర్జెన్సీ సమయంలో తలదాచుకునేందుకు ఉపయోగించేవారని నిఘా వర్గాల వద్ద సమాచారం ఉంది. దండకారణ్యంలో సాయుధ బలగాలు పైచేయి సాధించడంతో అక్కడి నుండి పరారైన మావోయిస్టు దళాలు కర్రెగుటల్లోకి వచ్చాయని తెలుస్తోంది. అందుకే కేంద్ర ప్రభుత్వం కర్రెగుట్టలను అష్టదిగ్బంధనం చేసి మావోయిస్టులను పూర్తిగా ఏరివేసేందుకు సిద్ధమైంది.
ఏప్రిల్ 21 నుంచి కర్రెగుట్టల్లో ఆపరేషన్ కోసం CRPF, కోబ్రా, DRG, STF, బస్తర్ ఫైటర్స్ బలగాలు కర్రెగుట్టలను చుట్టుముట్టాయి. కర్రెగుట్టలకు ఆనుకొని ఉండే దోబికొండ, నీలం సరాయికొండపై బేస్ క్యాంపులు ఏర్పాటు చేసి భారీగా ఆయుధాలను సిద్ధం చేసుకున్నాయి బలగాలు.
కర్రెగుట్టలను మూడు వైపుల నుంచి తెలంగాణ, ఛత్తీస్‌గడ్, మహారాష్ట్ర వైపు నుంచి కేంద్రబలగాలు అష్టదిగ్భందం చేశాయి. డ్రోన్లు, హెలికాఫ్టర్ల సాయంతో గుట్టపై బాంబులతో బలగాలు దాడులు చేస్తున్నాయి. కర్రెగుట్టల ప్రాంతమంతా మావోయిస్టులు ప్రెషర్ మైన్స్ అమర్చడంతో, హెలికాప్టర్ ద్వారా బాంబులు వేస్తూ ప్రెజర్ మైన్స్‌ను పేల్చేస్తున్నాయి భద్రతా బలగాలు.
Also Read: గంజాయిపై పోలీసుల ఉక్కుపాదం.. మొత్తం ఎన్ని కిలోలు దొరికిందంటే..
20 రోజులకు పైగా సాయుధ బలగాలు కర్రెగుటల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నప్పటికీ ఇప్పటివరకు మావోయిస్టుల జాడ కనిపెట్టలేకపోయారు. వందల సంఖ్యలో మావోయిస్టులు, గెరిల్లా దళపతి హిడ్మా కర్రెగుట్టలోనే రహస్య బంకర్లలో తలదాచుకున్నట్లు నిఘవర్గాల సమాచారం. అందుకే బంకర్ల నుంచి మావోయిస్టులు బయటకు వచ్చేవరకు వేచి చూసి మట్టు పెట్టేందుకు సాయదబలగాలు బేస్ క్యాంపు లను ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఆపరేషన్ కగార్ పూర్తయ్యే వరకు కర్రెగుట్టల వైపు ఎవరూ రావద్దంటూ స్థానిక ఆదివాసిలకు నిషేధాజ్ఞలు జారీ చేశారు అధికారులు. దీంతో తమకు ఎప్పుడేం జరుగుతుందో అనే ఆందోళనలో ఉన్నారు. మొత్తానికైతే కర్రెగుట్టల్లో దాక్కొన్న మావోయిస్టులను పూర్తిగా ఎరివేసే వరకు భద్రతా బలగాలు వెనక్కి తగ్గేదే లే అన్నట్టుగా ఉంది పరిస్థితి.