Yadadri Bhuvanagiri: యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ చేపట్టిన ఉద్యోగ వాణి కార్యక్రమం.. రాష్ట్రవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచింది. ఉద్యోగుల సమస్యలు నేరుగా విని, వాటికి తక్షణ పరిష్కారం చూపించేందుకు జిల్లా కలెక్టర్ స్వయంగా ముందుకు రావడం పట్ల అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్, ప్రభుత్వ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.
ఇది రాష్ట్రస్థాయిలో తొలిసారిగా జిల్లా స్థాయిలో నిర్వహించిన వినూత్న కార్యక్రమం. అటెండర్ స్థాయి ఉద్యోగి నుండి జిల్లా స్థాయి అధికారి వరకు, ప్రతి ఒక్కరికి తమ సమస్యలను నేరుగా కలెక్టర్ ముందు చెప్పుకునే అవకాశం లభించింది.
జిల్లాలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు తమ వ్యక్తిగత, వేతన, బదిలీ, సౌకర్యాలకు సంబంధించిన సమస్యలను వివరించారు. ప్రతి వినతి పత్రాన్ని జాగ్రత్తగా విని, తక్షణ పరిష్కారం సాధ్యమైన వాటిని వెంటనే అమలు చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
ఉద్యోగ వాణి లో ఉద్యోగులు కొందరు ఇచ్చిన సమస్యలు విని.. తమ పరిధిలో ఉన్న కొన్నింటిని సత్వరమే పరిష్కరించారు. మరి కొన్ని రాష్ట్ర స్థాయి లో ఉన్న సమస్యలపై సంబంధిత రాష్ట్ర స్థాయి అధికారులతో చర్చించి.. పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని పై అధికారులు హామీ ఇవ్వడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.
అక్కడ ఔట్సోర్సింగ్ పద్ధతిలో ఆఫీస్ సబార్డినేట్‌గా పనిచేస్తున్న జాహెదా బేగం గత మూడు నెలలుగా వేతనం పొందలేదని వినతి పత్రం ఇచ్చారు. దీనిపై వెంటనే స్పందించిన కలెక్టర్ సంబంధిత అధికారులను పిలిచి, తక్షణమే వేతనాలు చెల్లించాలని ఆదేశించారు.
జిల్లాలో టి-స్వాన్ ప్రాజెక్ట్ ద్వారా పనిచేస్తున్న ఆరుగురు సిబ్బందికి.. గత ఐదు నెలలుగా వేతనాలు అందలేదని తెలిపారు. కలెక్టర్ తక్షణమే రాష్ట్ర స్థాయి అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, సిబ్బందికి వెంటనే జీతాలు విడుదల చేయాలని ఆదేశించారు.
పంచాయతీ కార్యదర్శుల వినతి:
ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శులు కూడా వేతనాల లేమి గురించి వివరించారు. కలెక్టర్ ఈ అంశాన్ని రాష్ట్ర స్థాయిలో తీసుకొని, సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారం కోసం చర్యలు ప్రారంభించారు.
Also Read: ఢిల్లీకి సీఎం రేవంత్.. డీసీసీ అధ్యక్షుల ఎంపికపై కీలక భేటీ
యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ చేపట్టిన ఉద్యోగ వాణి కార్యక్రమం ఇప్పుడు.. రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు కూడా స్ఫూర్తిగా మారింది. అనేక జిల్లాల అధికారులు ఈ తరహా కార్యక్రమాలను చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.