Hyderabad News: సామాన్యుడి ప్లాట్ స్వాతంత్రయం ఇది. 8 ఏళ్ల పోరాట ఫలితం. హైడ్రా సాకారం చేసింది. ప్లాట్లకు చుట్టూ నిర్మించిన ప్రహరీని శుక్రవారం హైడ్రా కూల్చేయడంతో వారి ఆనందానికి హద్దులు లేవు. తమ ప్లాట్లను నేరుగా చూసే అవకాశం లభించిందని సంబరాలు చేసుకున్నారు. స్వాంత్రంత్యం సిద్ధించాక సంబరాలను తలపించాయి వారి వేడుకలు. మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా పోచారం మున్సిపాలిటీ, ప్రతాప్‌సింగారంలోని భవానీ నగర్ లే ఔట్ ప్లాట్ యజమానుల సంబరాలకు సంబంధించిన వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.
ప్రతాప్‌సింగారం గ్రామంలోని సర్వే నంబరు 315, 316, 317లలో 27 ఎకరాల పరిధిలో లే ఔట్ వేశారు. దాదాపు 400ల ప్లాట్లతో 1978లో వేసి ఈ లేఔట్ కి గ్రామపంచాయతీ అనుతి ఉంది. తర్వాత మున్సిపాలిటీ పరిధిలోకి వచ్చింది. ఆరుగురికి చెందిన ఈ 27 ఎకరాలలో భాగస్వామిగా ఉన్న మలిపెద్ది బుచ్చిరెడ్డికి జీపీఏ ఇవ్వడంతో ఈ లేఔట్ వేశారు. మొత్తం 27 ఎకరాల లేఔట్‌లో మలిపెద్ది జనార్దన్‌రెడ్డికి చెందిన 6.14 ఎకరాల భూమి కూడా ఉంది. మిగతా ఎక్కడా సమస్య రాలేదు.. మలిపెద్ది జనార్దన్ రెడ్డి కుమారు మలిపెద్ది మధుసూధన్ రెడ్డి ధరణిలో దరఖాస్తు చేసుకుని వ్యవసాయ భూమిగా పాసుబుక్ సృష్టించాడు. రైతుబందు పథకం డబ్బులు కూడా తీసుకోవడం ప్రారంభించాడు. అక్కడితో ఆగకుండా ప్రహరీ నిర్మించాడు. ఈ 6.14 ఎకరాల పరిధిలోని 88 ప్లాట్లకు చెందిన వారు అభ్యంతరాలు చెప్పారు. 27 ఎకరాల లే ఔట్‌లో 6.14 ఎకరాల వ్యవసాయ భూమి ఎక్కడి నుంచి వచ్చిందని స్థానిక రెవెన్యూ అధికారులతో పాటు.. జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో రైతుబందు రద్దయ్యింది కాని వారి కష్టాలు తీరలేదు. 8 ఏళ్లుగా ప్లాట్ల కోసం పోరాడుతున్నారు.
ప్రహరీనీ కూల్చిన హైడ్రా..
6.18 ఎకరాల చుట్టూ 2017 -18లో మలిపెద్ది మధుసూధన్ రెడ్డి ప్రహరీ నిర్మించి.. ఎవరినీ లోపలకు అనుమతించడంలేదని భవానీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. తమ ప్లాట్లలోకి వెళ్లడానికి వీలు లేకుండా రహదారులను ప్రహరీతో బ్లాక్ చేశారంటూ వాపోయారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో హైడ్రా అధికారులు విచారణ చేపట్టారు. మొత్తం 27 ఎకరాల పరిధిలో లే ఔట్ ఉన్నట్టు నిర్ధారించుకున్నారు. ప్రహరీ నిర్మాణానికి ఎలాంటి మున్సిపల్, గ్రామపంచాయతీ అనుమతులు లేవని విచారణలో తేలింది.
ALSO READ: Rahul Sipligunj -Harinya: సింగర్ రాహుల్ – హరిణ్య ఇంట మొదలైన పెళ్లి సందడి.. ఫోటోలు వైరల్!
ప్లాట్లలోకి వెళ్లే రహదారులకు ఆటంకం కలిగించినట్టు నిర్ధారించుకున్నారు. అలాగే మలిపెద్ది మధుసూధన్‌రెడ్డితో పాటు ప్లాట్ల యజమానులు, రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో హైడ్రా సమావేశం ఏర్పాటు చేశారు. ఇరుపక్షాల వాదనలు విని… ప్లాట్ యజమానులకు న్యాయం చేశారు. ఇందులో ప్లాట్లు కొన్నవారంతా సామాన్యులే. 8 ఏళ్లుగా పోరాడుతున్నామని.. హైడ్రాకు ఫిర్యాదు చేయడంతో ఈ సమస్య పరిష్కారం అయ్యిందని వారంతా సంబరాలు చేసుకున్నారు. ప్రభుత్వానికి, హైడ్రాకు అనుకూలంగా నినాదాలు చేశారు. లే ఔట్ ప్రకారం వారి ప్లాట్లను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. హైడ్రా అధికారులకు ధన్యవాదాలు తెలిపి.. మాకు స్వాంతంత్రయం వచ్చినట్టుందని సంబర పడ్డారు.