అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్న వేళ బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగలనున్నదని చర్చ జరుగుతున్నది. మొన్నటివరకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాష్ట్రంలో హాట్‌హాట్‌గా సాగింది. ఎఫ్‌ఎస్‌ఎల్ అగ్నిప్రమాదం అనంతరం ఈ కేసు విచారణ కాస్త నెమ్మదించింది.అయితే, రేవంత్ సర్కార్ కావాలనే ఎఫ్ఎస్ఎల్‌లోని ఓటుకు నోటు ఆధారాలను మాయం చేయడానికి ఫైర్ యాక్సిడెంట్ చేయించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి ఆధారాలు సైతం ఈ ప్రమాదంలో కాలి బూడిద అయ్యాయని ప్రచారం జరుగుతోంది. సర్కారు మాత్రం ఆధారాలు భద్రంగానే ఉన్నాయని చెబుతోంది. కాగా, ఏదో ఒకటి కొలిక్కి రాకుండా ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ ఎందుకు నిలిచిపోయిందని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.
అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్, మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నట్టుగా మాటల యుద్దం జరుగుతోంది. ప్రభుత్వ పథకాలు, సంక్షేమం అమలు, ఆరు గ్యారంటీలు, మూసీ పునరుజ్జీవం, రైతు ఆత్మహత్యలు, ఫ్యూచర్ సిటీ, హైడ్రా కూల్చివేతలు, గాంధో సరోవర్ వంటి అంశాలపై ప్రతిపక్షం అధికారపక్షాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నది. మరోవైపు ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మీద పెద్దఎత్తున విమర్శ, ప్రతివిమర్శలు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో ఫార్ములా ఈ కార్ రేసు కేసులో ఏసీబీ చార్జ్‌షీట్ దాఖలు చేయడం సంచలనంగా మారింది.త్వరలోనే కేటీఆర్‌ను ఏసీబీ విచారణకు పిలిచే అవకాశాలు ఉన్నాయి. అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యాక పిలుస్తారా? లేక ముందే పిలుస్తారా? అని చర్చ జరుగుతున్నది.
ఈనెల 30తో అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి. ఒకవేళ సమావేశాలు పూర్తి కాకముందే ఫార్ములా ఈ కార్ రేసు కేసులో విచారణకు రావాలని ఏసీబీ నుంచి పిలుపువస్తే కేటీఆర్ విచారణకు హాజరయ్యేందుకు గడువు కోరతారా? లేక హాజరవుతారా? అనేది తెలియాల్సి ఉన్నది. ఒకవేళ తప్పక విచారణకు రావాలని ఏసీబీ నోటీసులు అందజేస్తే కేటీఆర్ .. అసెంబ్లీ సమావేశాలకు దూరం కానున్నారు. దాంతో అది కాస్త సర్కారుకు ప్లస్ అవుతుందని టాక్ వినిపిస్తోంది.ప్రశ్నించే గొంతు అసెంబ్లీలో లేకపోతే సర్కారుకు ఎటువంటి అడ్డంకి ఉండదని, బిల్లులు కూడా ఆమోదం పొందుతాయని బీఆర్ఎస్ నేతలు చర్చించుకుంటున్నారు. కేటీఆర్ అడిగే ప్రశ్నలకు సమాధానం లేకనే సీఎం రేవంత్ ఇలా కేసులు, విచారణల పేరుతో వేధిస్తున్నారని గులాబీ పార్టీలో చర్చ జరుగుతోంది.
Sridhara Babu: కొత్త పెళ్లి కొడుకు అబద్ధాలు చెప్పిండు.. మల్లారెడ్డి పై శ్రీధర్ బాబు జోకులు
ఏదేమైనా ఈ కేసులో కేటీఆర్ ఏ1గా ఉన్నారు. గతంలో కేటీఆర్ మున్సిపల్ మంత్రిగా ఉన్న సమయంలో ఫార్ములా రేసు కోసం రూ.50 కోట్ల హెచ్ఎండీఏ నిధులను విదేశీ కంపెనీకి చెల్లించాలని నాటి కమిషనర్ అరవింద్ కుమార్‌ను ఆదేశించారు. ఇదే విషయాన్ని ఆయన స్వయంగా అంగీకరించారు. కాగా, ప్రభుత్వ అనుమతి, కేబినెట్ ఆమోదం లేకుండా విదేశీ కంపెనీకి నిధులు చెల్లించడంలో మనీ లాండరింగ్, నిధుల దుర్వినియోగం జరిగిందని సర్కారు భావించి విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే.దీంతో ఈ కేసులో కేటీఆర్ ఏ1, అరవింద్ కుమార్ ఏ2గా ఉన్నారు. ఐఏఎస్ మీద ఆరోపణలు రావడంతో ఆయన్ను డీవోపీటీ సస్పెండ్ చేసింది. దీంతో సర్కారు సైతం ఆయనకు పోస్టింగ్ ఇవ్వకపోవడంతో ప్రస్తుతం ఖాళీగా ఉన్నారు. తాజాగా ఏసీబీ చార్జ్‌షీట్‌తో కేటీఆర్ భవిష్యత్ కార్యాచరణపై సస్పెన్స్ కొనసాగుతోంది.ఆయన ఏం చేయబోతున్నారనేది తెలియాల్సి ఉన్నది.