Janasena Clashes: ఏమీ లేని విస్తరి ఎగిరెగిరి పడుతుందంటారు.. సరిగ్గా అలాగే కనిపిస్తోంది నెల్లూరు జిల్లా జనసేన పరిస్థితి.. జిల్లా పార్టీలో చెప్పుకోదగ్గ నాయకుడు, క్షేత్రస్థాయిలో క్యాడర్ లేవు.. అసలు జిల్లాలో ప్రాతినిధ్యమే లేని జనసేన పార్టీలో వర్గ పోరు మాత్రం భగ్గుమంటోంది .. అధిష్టానం పెద్దల మద్దతు తమకుందని, జిల్లా నేతలు ఆధిపత్యం కోసం నేతలు జబ్బలు చరుచుకుంటూ పార్టీ కార్యక్రమాలను కూడా పద్దతిగా నిర్వహించడం లేదంట. పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు అయినా ఆ పార్టీని నడిపించే రథసారధి కొరత వెంటాడుతూనే ఉంది. ఇలాంటి సమయంలో ఆ పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం నేతలకు కొత్త తిప్పలు తెచ్చిపెట్టింది. పార్టీని నడిపించే నేత కోసం క్యాడర్ ఎదురుచూస్తుంటే.. ఉన్న నేతలు మాత్రం గ్రూపులు కట్టి రోజూ యుద్ధాలకు దిగుతుండటంతో అందరూ ఆశ్చర్యపోతున్నారంట.
జిల్లాలో జనసేన పార్టీకి క్షేత్రస్థాయిలో పటిష్టమైన క్యాడర్ లేకున్నా.. తమ వల్లే కూటమి అధికారంలోకి వచ్చిందని నెల్లూరు జిల్లాకు చెందిన ఆ పార్టీ నేతలు కాలర్లు ఎగరేస్తున్నారంట. కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి కావస్తున్నా ఇప్పటికీ ఆ పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు కనిపించడం లేదని ప్రచారం సాగుతోంది. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు తామే నాయకులమంటూ నియోజకవర్గాల్లో నాయకులు పార్టీ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఇదే సమయంలో పార్టీ తమకు పదవులు ఇచ్చి నియమిస్తే, మీరు అలా చెప్పుకోవడం ఏంటని పదవులు తీసుకున్న నేతలు వ్యతిరేకిస్తున్నారు. మరికొందరు ఏమీ మాట్లాడలేక సైలెంట్ అవుతున్నారు. ఇలాంటి పరిస్థితి రెండేళ్లుగా కొనసాగుతూనే ఉన్నా, తాజాగా ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో వారి రచ్చ మరీ ఎక్కువవుతోంది.
తాజాగా ఆత్మకూరులో జనసేన పార్టీ ఉద్యమి నమోదు కార్యక్రమంలో జరిగిన రగడ ఇందుకు నిలువెత్తు నిదర్శనం. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో దాదాపు ఇదే పరిస్థితి కొనసాగుతోంది. దీంతో కిందిస్థాయి క్యాడర్ ఎవరు వైపు వెళ్లాలో తెలియక తలలు పట్టుకుంటోందంట. ఆత్మకూరు నియోజకవర్గంలో జనసేన నేతలు నలిశెట్టి శ్రీధర్, టిడ్కో ఛైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ వర్గాల మధ్య ఆధిపత్య పోరు సభ్యత్వ నమోదు కార్యక్రమంతో తేటతెల్లమైంది. వీరి మధ్య వర్గ పోరు, బల ప్రదర్శనలు ఘర్షణ వరకు దారితీశాయి. సభ్యత్వ నమోదు కార్యక్రమాలు వేరువేరుగా నిర్వహిస్తూ ఒకరి కార్యక్రమాలను ఒకరు అడ్డుకుంటున్నట్లు సమాచారం.
జిల్లా జనసేన ఇన్చార్జిగా బొలిశెట్టి శ్రీనివాసులు ఉన్నా, క్షేత్రస్థాయిలో విభేదాలను పరిష్కరించడంలో ఆయన విఫలమవుతున్నారని, వ్యక్తిగత ఇమేజ్ పెంచుకోవడానికి, సోషల్ మీడియా ప్రచారాలకే పరిమితం అవుతున్నారని కార్యకర్తలు తెగ ఫీల్ అవుతున్నారు. అధిష్టానం లోని ఇద్దరు నేతల మద్దతు ఉందని చెప్పుకుంటున్న నేతల వర్గపోరే జిల్లా జనసేనలో ఈ పరిస్థితికి కారణమంటున్నారు. దాంతో బొలిశెట్టి మాత్రం ఏం చేయగలరు అన్న వాదన వినిపిస్తోంది. వేములపాటి అజయ్ కుమార్‌పై ఇటీవల సొంత వారే విమర్శలు, ఆరోపణలు చేస్తున్నా కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. అధిష్టానంలోని రెండు వర్గాలకు చెందిన నేతల మద్దతు వారికి ఉండడంతో ఈ పరిస్థితి ఉందని నేతలు బాహాటంగా చెబుతున్నారు. నాగబాబు సైడ్ నుంచి వేములపాటి అజయ్ కుమార్ వర్గం.. నాదెండ్ల మనోహర్ గ్రూపుగా మరో వర్గం పనిచేయడం బహిరంగ రహస్యమే.
అయితే ఇదంతా పార్టీ అధిష్టానానికి తెలియదా అంటే తెలుసంటున్నారు ఆ పార్టీ నేతలు. ఇటీవల నెల్లూరు జిల్లా జనసేన వర్గ పోరు పై పంచాయతీ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వరకు వెళ్లిందట. జనసేనాని విచారణ చేపట్టి , హితబోధ చేసినా జిల్లాలో కొందరు నేతల వ్యవహార శైలి మాత్రం మారడం లేదు. సాధారణంగా ఎన్నికలకు ముందు ఉండే వర్గ పోరు ఎన్నికలు అయినా రెండేళ్ల తర్వాత కూడా కొనసాగుతుండటం.. పెద్ద లోపంగానే భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. జనసేన అధిష్టానం ఆత్మకూరు ఇన్చార్జిగా నలిశెట్టి శ్రీధర్‌ను ఏళ్ల క్రితమే నియమించింది . అయితే తనను కాదని చదలవాడ హరీష్ అనే వ్యక్తి వర్గాన్ని టిడ్కో చైర్మన్ అజయ్ కుమార్ ఆత్మకూరులో ప్రోత్సహిస్తున్నారని నలిశెట్టి శ్రీధర్ ఆరోపిస్తున్నారు.
చదలవాడ హరీష్ ఆధ్వర్యంలో అజయ్ కుమార్ అతిథిగా పాల్గొని సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేపడుతున్న క్రమంలో శ్రీధర్ వర్గీయలు దాన్ని అడ్డుకోవడంతో అంతర్గత పోరు బహిర్గతమైంది. శ్రీధర్ వర్గీయులు పెద్ద ఎత్తున నినాదాలు చేయడం.. హరీష్ వర్గం తిరగబడటంతో ఆత్మకూరులో ఉద్రిక్త పరిస్థితిలు నెలకొన్నాయి. రెండు వర్గాలు పరస్పర దాడులకు దిగడంతో పోలీసులు రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది. దాన్నిబట్టి నాయకత్వం లోపం ఏ స్థాయిలో ఉందో టక్కున అర్థమవుతుందంటున్నారు.
జనసేనలో అన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొని ఉందంటున్నారు. ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో జన సైనికులు బాహ బాహకి దిగడం, టీడీపీ నాయకులకి కూడా తలనొప్పిగా కూడా మారిందట. ఎవరిని ప్రోత్సహించాలో, ఎవరికి సపోర్ట్ చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారట. ఇప్పటికైనా పార్టీ అధిష్టానం పెద్దలు ఎమ్మెల్సీ నాగబాబు, మంత్రి నాదెండ్ల మనోహర్‌లు సమన్వయంతో జిల్లాలోని రెండు వర్గాలను ఓకే మార్గాన నడిపే విధంగా చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ కార్యకర్తలు కోరుతున్నారు.
Also Read: వరుస ఓటములకు చెక్ పడేనా? రేపల్లె సెగ్మెంట్‌పై జగన్ స్పెషల్ ఫోకస్ వెనుక అసలు కథ ఇదే!
Story by: Apparao, Big Tv