Adilabad RIMS: ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన ఆసుపత్రిలోనే ప్రజారోగ్యానికి ముప్పు కలిగించే నిర్లక్ష్యం వెలుగుచూసింది. ఆదిలాబాద్ రిమ్స్‌లో బయో మెడికల్ వ్యర్థాల నిర్వహణలోని లోపాలను బిగ్ టీవీ క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆధారాలతో సహా బయటపెట్టింది. వార్డులు, ల్యాబ్‌ల నుంచి వెలువడే వైద్య వ్యర్థాలను నిబంధనల ప్రకారం వేరు చేయకుండా, సాధారణ చెత్తతో కలిపి డంపింగ్ యార్డుకు తరలిస్తున్న తీరును ప్రసారం చేసింది. నవంబర్ 3న ప్రసారమైన ఈ కథనాలతో అధికార యంత్రాంగంలో కదలిక మొదలైంది.
రిమ్స్ యాజయాన్యానికి నోటీసులు..
బిగ్ టీవీ కథనాలపై స్పందించిన తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి అధికారులు నవంబర్ 6న ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా బయో మెడికల్ వ్యర్థాల విభజన, నిల్వ, నిర్వహణలో పలు లోపాలను గుర్తించారు. బయో మెడికల్ వేస్ట్ మేనేజ్‌మెంట్ రూల్స్ 2016 నిబంధనలు పాటించడంలో యాజమాన్యం నిర్లక్ష్యం వహించినట్లు అధికారులు నిర్ధారించారు. గుర్తించిన లోపాలను పరిగణనలోకి తీసుకున్న కాలుష్య నియంత్రణ మండలి రిమ్స్ యాజమాన్యానికి అధికారిక నోటీసులు జారీ చేసింది. వ్యర్థాలను నిబంధనల ప్రకారం వేరు చేయాలని, సరైన పద్ధతిలో నిల్వ చేసి శాస్త్రీయ విధానంలో నిర్వహించాలని ఆదేశించింది. అంతేకాకుండా పది రోజుల్లోగా లోపాలను సరిదిద్ది, తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలని ఆదేశించారు. లేదంటే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
వ్యర్థాల నిర్వహణను గాడిలో పెడుతుందా?
బిగ్ టీవీ కథనాలతో అధికారుల తనిఖీలు.. తనిఖీలతో నిర్లక్ష్యం బట్టబయలు.. చివరకు రిమ్స్ యాజమాన్యానికి నోటీసులు జారీ అయ్యాయి. మరి ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి బయో మెడికల్ వ్యర్థాల నిర్వహణను గాడిలో పెడుతుందా? ప్రజారోగ్య పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకుంటుందా? వేచి చూడాలి.
Also Read: ఏపీ జలదోపిడీపై రేవంత్ సర్కార్ మౌనమెందుకు?: కేటీఆర్