TVVP Commissioner: స్వేచ్చ బ్యూరో: టీవీవీపీ కి పూర్తి స్థాయిలో కమిషనర్ ను నియమించక పోవడంలో సీఎంవోని ఓ సీనియర్ ఐఏఎస్ పాత్ర ఉన్నట్లు మెడికల్ యూనియన్లు ఆరోపిస్తున్నాయి. గతంలో ఆయన కమిషనర్ గా పనిచేసిన సందర్భంలో మెడికల్ యూనియన్లకు ఆయనకు గ్యాప్ ఏర్పడిందని, ఇప్పుడు ఆ కోపంతోనే టీవీపీసీకి కమిషనర్ నియామక ప్రక్రియను అడ్డుకుంటున్నారని యూనియన్ నేతలు మండిపడుతున్నారు. దీని వలన అడ్మినిస్ట్రేషన్ తో పాటు ఆసుపత్రుల్లోని సేవల్లోనూ జాప్యం జరుగుతున్నట్లు చెప్తున్నారు.
రాష్ట్రంలోని పేద,మధ్యతరగతి ప్రజలకు వైద్యం అందించాల్సిన తెలంగాణ వైద్య విధాన పరిషత్ పెద్దదిక్కు లేని అనాథలా మారిపోతున్నట్లు వివరిస్తున్నారు. అంతేగాక ప్రమోషన్లు, ఫైళ్లకు బ్రేకులు పడ్డాయని వెల్లడించారు. సీఎంవోని ఆ సార్ గుస్సాకు వేలాది మంది ఉద్యోగులు బలి కావాల్సి వస్తుందని క్షేత్రస్థాయిలోని మెడికల్ యూనియన్లు ఫైర్ అవుతున్నాయి.సీఎం రేవంత్ రెడ్డి, వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహాలు చొరవ తీసుకొని తమకు పూర్తి స్థాయిలో కమిషనర్ ను నియమించాలని టీవీవీపీ ఉద్యోగులు కోరుతున్నారు.
రాష్ట్రంలోని జిల్లా ,ఏరియా ,సామాజిక ఆరోగ్య కేంద్రాలు..ఇలా దాదాపు 150 కు పైగా ఆసుపత్రుల పర్యవేక్షణ అంతా టీవీవీపీ పరిధిలోనే ఉంటుంది.ఇంతటి కీలకమైన విభాగానికి పూర్తిస్థాయి కమిషనర్‌ను నియమించడంలో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోంది.డి పార్ట్ మెంట్ నుంచి ఫైల్ సీఎంవోకు చేరినప్పటికీ, ఆ ఫైల్ కదలకుండా సీఎంవోలోని ఓ ఉన్నతాధికారి అడ్డుపడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పూర్తిస్థాయి కమిషనర్ లేకపోవడంతో కీలక విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇంచార్జి అధికారులు వెనుకాడుతున్నారు. దీంతో పరిపాలన పూర్తిగా స్తంభించిపోయింది.ఆసుపత్రుల మౌలిక వసతులు,మందుల కొనుగోలు,పరికరాల మరమ్మతులు,సిబ్బంది సర్దుబాటుకు సంబంధించిన వందలాది ఫైళ్లు కమిషనర్ కార్యాలయంలో దుమ్ము పడుతున్నాయి.అంతేగాక క్షేత్రస్థాయిలో ఆసుపత్రులను తనిఖీ చేసే వారు లేకపోవడంతో వైద్యులు, సిబ్బందిలో జవాబుదారీతనం లోపిస్తోంది.దీని ప్రభావం నేరుగా సామాన్య రోగులపై పడుతోంది.
ఒకవైపు పాలనాపరమైన నిర్లక్ష్యం,మరోవైపు తమ దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం కాకపోవడంతో వైద్య విధాన పరిషత్ ఉద్యోగులు తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్నారు.ఏళ్ల తరబడి సేవలందిస్తున్న తమను పట్టించుకునే నాథుడే లేడని కన్నీరుమున్నీరవుతున్నారు.ఏళ్ల తరబడి కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న సిబ్బంది కి సకాలంలో జీతాలు రావడం లేదని మండిపడుతున్నారు. అంతేగాక ఉద్యోగులకు రావాల్సిన 6, 12, 18, 24 సంవత్సరాల ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ ఇంక్రిమెంట్లు మంజూరు కావడం లేదు. ఫైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ఆర్థికంగా నష్టపోతున్నారు.
Also Read: రాజ్ ఫ్యామిలీతో సమంత స్పెషల్ సీమంతం వేడుక..ఫొటోస్ వైరల్ !
మరోవైపు అర్హత ఉన్నప్పటికీ డీపీసీ సమావేశాలు నిర్వహించకపోవడంతో డాక్టర్లు,నర్సులు, పారామెడికల్ సిబ్బంది ప్రమోషన్లకు నోచుకోవడం లేదు. పదోన్నతి లేకుండానే రిటైర్ అవుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఉద్యోగుల ప్రయోజనాలకు సంబంధించిన జీవో 190 అమలుపై స్పష్టత లేకపోవడంతో సిబ్బందిలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. గత ప్రభుత్వ హయాంలో వచ్చిన జీ.వో 317 కారణంగా స్థానికత కోల్పోయి, కుటుంబాలకు దూరంగా పనిచేస్తున్న ఉద్యోగుల బదిలీలు, సమస్యల పరిష్కారంపై నేటికీ అడుగు ముందుకు పడటం లేదు.
“ వ్యవస్థను చక్కదిద్దేందుకు సీఎం రేవంత్ రెడ్డి, వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహాలు సమర్ధవంతంగా పనిచేస్తున్నా కొందరు అధికారులు కుట్రకోణంతో అడ్డుపడుతున్నారు. కమిషనర్ రిటైరైన తర్వాత నెలలు గడుస్తున్నా..ఇప్పటి వరకు అధికారిని నియమించకోవడం దారుణం. అన్ని విషయాల్లోనూ ఆలస్యం జరుగుతుంది. బాన్సువాడ నర్సింగ్ ఆఫీసర్ల సస్పెండ్ ను క్లియర్ చేసి రీ పోస్టింగ్ ఇవ్వాలని మంత్రి సంతకం పెడితే ప్రిన్సిపల్ సెక్రటరీ ఇప్పటి వరకు పోస్టింగ్ ఇవ్వలేదు.
పూర్తి స్థాయి కమిషనర్ రిక్రూట్ ను మాణిక్ రాజ్ కన్నన్ అడ్డుకుంటున్నట్లు తెలిసింది. డీహెచ్ రవీంద్రనాయక్ ఇప్పటికే ఎన్నో తప్పిదాలు, నిర్లక్ష్యం చేశాడు. ఆయన్ను సజావుగా పోస్టులో ఉంచారు. కానీ కొత్తగా ఇతర అర్హులకు టీవీవీపీ కమిషనర్ గా నియమిస్తే సమస్య ఏమిటీ? డబ్బులకు కక్కుర్తి పడే ఇప్పటికీ పోస్టు ను భర్తీ చేయడం లేదనే టాక్ ఉద్యోగుల్లో ఉన్నది. ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్లకే ఆ పోస్టు ఇస్తారని టీవీవీపీ ఉద్యోగులతో పాటు వైద్యారోగ్యశాఖలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది”అని ఎస్ కే ప్రసన్న కుమారి తెలిపారు.
Also Read: ఎయిర్‌పోర్టులో స్పైస్‌జెట్ హైడ్రామా.. 9 గంటలైనా కదలని విమానం!