Mettu Sai Kumar: తెలంగాణ రాజకీయాల్లో సిద్దిపేట కేంద్రంగా మాటల యుద్ధం ముదురుతోంది. బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు లక్ష్యంగా టీపీసీసీ ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీకి కొత్త నిర్వచనం ఇస్తూ అది ‘భూ బకాసుర రాష్ట్ర సమితి’ అని ఆరోపించారు.
20 ఏళ్ల పాలనపై ఆరోపణలు
గత ఇరవై ఏళ్లుగా సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్న హరీష్ రావు నియోజకవర్గ ప్రజలకు చేసిందేమీ లేదని మెట్టు సాయి కుమార్ విమర్శించారు. సిద్దిపేటను రియల్ ఎస్టేట్ అడ్డాగా మార్చుకుని, మాజీ ఐఏఎస్ అధికారి వెంకట్ రామిరెడ్డితో కలిసి భూ దందాలు చేశారని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటనకు వస్తే ఈ అక్రమాలు, మోసాలు ఎక్కడ బయటపడతాయోనన్న భయంతోనే హరీష్ రావు ఆందోళన చెందుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. మల్లన్న సాగర్, కొండపోచమ్మ ప్రాజెక్టుల నిర్మాణ సమయంలో రైతుల భూములు లాక్కుని.. వారిని బేడీలు వేసి ఇబ్బందులకు గురిచేశారన్నారు. అదే విధంగా ఆ రైతుల ఆవేదన హరీష్ రావుకు తప్పక తగులుతుందని మెట్టు సాయి అన్నారు. అంతేకాకుండా, నియోజకవర్గంలోని నిరుపేద కుటుంబాలకు పెన్షన్లు రాకుండా అడ్డుకుంటున్నారని కూడా ఆయన మండిపడ్డారు.
2028 ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం
వచ్చే 2028 అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దిపేట ప్రజలే హరీష్ రావును ఓడించి, ఆయనను ‘తాజా మాజీ’ ఎమ్మెల్యేగా మార్చడం ఖాయమని మెట్టు సాయి కుమార్ ధీమా వ్యక్తం చేశారు. సిద్దిపేటకు పట్టిన సమస్యలు తొలగిపోయి, అభివృద్ధిలో కొత్త శకం మొదలవుతుందని అన్నారు. 1983లో అనంతల మదన్ మోహన్ రావు తర్వాత మళ్లీ సిద్దిపేటలో కాంగ్రెస్ జెండా ఎగురుతుందని ఆయన జోస్యం చెప్పారు.
కాంగ్రెస్ సునామీలో కారు, కమలం కొట్టుకుపోతాయి..
రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ సునామీలో బీఆర్ఎస్ (కారు), బీజేపీ (కమలం) పార్టీలు కొట్టుకుపోతాయని ఆయన వ్యాఖ్యానించారు. S1 సిరిసిల్ల, S2 సిద్దిపేట నియోజకవర్గాలు రెండూ కాంగ్రెస్ ఖాతాలోకి రావడం ఖాయమన్నారు. వచ్చే ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుని కాంగ్రెస్ పార్టీ మరోసారి ఘన విజయం సాధిస్తుందని మెట్టు సాయి కుమార్ స్పష్టం చేశారు.
Also Read: ‘మరుజన్మ ఉంటే మధ్యతరగతిలో పుట్టించకు దేవుడా!’.. కన్నీరు పెట్టిస్తున్న వరంగల్ దంపతుల సూసైడ్ నోట్!