Raj Gopal Reddy: తెలంగాణ రాజకీయాలు మరో సారి వేడెక్కాయి. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. సొంత పార్టీ ప్రభుత్వంపైనే ఆయన సూటి విమర్శలు చేశారు. తాను ప్రభుత్వాన్ని విమర్శించడం లేదని.. కేవలం తప్పులను ఎత్తిచూపుతూ సూచనలు మాత్రమే చేస్తున్నానని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. అందరూ జిందాబాద్ కొడుతూ భజన చేస్తే.. తప్పును తప్పు అని చెప్పేదెవరని ఆయన ప్రశ్నించారు.
పదవుల కంటే ప్రజలే ముఖ్యం
మంత్రి పదవి రాలేదన్న అక్కసుతోనే తాను మాట్లాడుతున్నానని కొందరు చేస్తున్న ప్రచారాన్ని రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. తాను పదవుల కోసం పాకులాడే మనిషిని కాదని.. కేవలం ప్రజల కోసమే రాజకీయాల్లో ఉన్నానని ఆయన తేల్చి చెప్పారు. అందరూ జిందాబాద్ లు కొడుతూ భజన చేస్తుంటే.. తప్పును తప్పని ఎత్తిచూపడం ఎలా నేరమవుతుందని ఆయన ప్రశ్నించారు. పార్టీ మారుతారంటూ వస్తున్న ఊహాగానాలను కొట్టిపారేస్తూ, తనకు పదవులు లేకున్నా ఫర్వాలేదు కానీ నియోజకవర్గ ప్రజలకు అన్యాయం జరిగితే మాత్రం చూస్తూ ఊరుకోబోనని స్పష్టం చేశారు.
నిధుల కేటాయింపులో వివక్షపై ఆగ్రహం
నియోజకవర్గాల అభివృద్ధి విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ఆయన తప్పుబట్టారు. గతంలో కేసీఆర్ కేవలం సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్‌లకే పరిమితమైనట్లుగా.. ఇప్పుడు తెలంగాణ అంటే కేవలం కొడంగల్, మధిర మాత్రమే కాదని వ్యాఖ్యానించారు. మునుగోడులో బిల్లులు రాక రోడ్ల పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయని.. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చుట్టూ తిరిగినా పనులు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొడంగల్‌కు రూ. 10 వేల కోట్లు అంటే పండబెట్టి తొక్కుతావా అని ముఖ్యమంత్రి వాడిన భాషపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఉన్న నగరానికే దిక్కులేనప్పుడు ‘ఫ్యూచర్ సిటీ’ ఎందుకని నిలదీశారు.
హామీల అమలు, పాత కాంట్రాక్టర్ల పెత్తనం
ఎన్నికల మేనిఫెస్టోలో పెన్షన్ రూ. 4 వేలు ఇస్తామని మాట ఇచ్చి.. ఇప్పుడు ప్రజలకు ఏం సమాధానం చెబుతారని రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మాట ఇస్తే నిలబెట్టుకోవడం దివంగత నేత వైఎస్సార్ నేర్పిన కాంగ్రెస్ నైజమని గుర్తు చేశారు. ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు గడుస్తున్నా కార్యకర్తల ఆశలు అడియాశలయ్యాయన్నారు. గత ప్రభుత్వంలో కేసీఆర్‌కు వ్యతిరేకంగా పోరాడిన వారికి గుండు సున్న మిగిలిందని అన్నారు. పైగా, గతంలో పదవులు అనుభవించిన వారు, దోచుకున్న ఆంధ్రా కాంట్రాక్టర్లే ఇప్పుడు మళ్లీ ముందు సీట్లలో కూర్చుని దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు.
తండ్రి పాత్ర పోషించండి.. లేదంటే కురుక్షేత్రమే!
ముఖ్యమంత్రికి అదృష్టం కలిసొచ్చిందని.. మిగిలిన రెండేళ్లైనా అందరినీ సమానంగా చూస్తూ తండ్రి పాత్ర పోషించాలని రాజగోపాల్ రెడ్డి సూచించారు. మళ్లీ వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేస్తూనే.. మునుగోడుకు నిధులు ఇవ్వకపోతే మాత్రం మరో కురుక్షేత్రం తప్పదని హెచ్చరించారు. గతంలో కొంచెం బుల్లెట్ మిస్ అయిందేమో కానీ.. ఈసారి మాత్రం గురి తప్పదని ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
Also Read:తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీపై విమర్శలా? కేటీఆర్‌కు చామల స్ట్రాంగ్ కౌంటర్!