Bhongir RTA: ప్రభుత్వ కార్యాలయాలకు ప్రజలు ఎందుకు వస్తారు..? తమ పనులు నిబంధనల ప్రకారం, పారదర్శకంగా పూర్తిచేసుకోవడానికి. కానీ యాదాద్రి భువనగిరి రవాణా శాఖ కార్యాలయం వద్ద పరిస్థితి చూస్తే ప్రభుత్వ వ్యవస్థ కంటే మధ్యవర్తుల వ్యవస్థే బలంగా పనిచేస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆర్టీఏ కార్యాలయం ప్రాంగణంలో అడుగుపెట్టక ముందే ఏజెంట్ల వలలో పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాహనదారులు వాపోతున్నారు. ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించి సేవలను డిజిటలైజ్ చేసింది. లైసెన్స్, రిజిస్ట్రేషన్, ఫిట్‌నెస్, పర్మిట్, ట్యాక్స్ చెల్లింపులు, యాజమాన్య మార్పులు, అడ్రస్ మార్పులు.. ఇలా దాదాపు అన్ని సేవలను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. అయినప్పటికీ భువనగిరి ఆర్టిఏ కార్యాలయం వద్ద ఏజెంట్ల ప్రభావం ఏమాత్రం తగ్గలేదు. పైగా రోజురోజుకూ మరింత బలపడుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఒకప్పుడు ఆర్టీఏ కార్యాలయం చుట్టూ టీ దుకాణాలు, జిరాక్స్ సెంటర్లు మాత్రమే ఉండేవి. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కార్యాలయానికి ఎదురుగా, పక్కనే, వెనుక వైపున, సమీప వీధుల్లో వరుసగా ఏజెంట్ల కార్యాలయాలు వెలిశాయి. “ఆర్టిఏ కన్సల్టెన్సీ”, ఆర్టిఏ ఏజెంట్ వంటి పేర్లతో బోర్డులు పెట్టుకుని కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ప్రజలు ఆర్టీఏ కార్యాలయానికి చేరుకోగానే కొందరు వ్యక్తులు వారిని గుర్తించి పలకరిస్తారు. “ఏ పని కోసం వచ్చారు?”, “లైసెన్స్ కావాలా?”, “ఫిట్‌నెస్ చేయించాలా?”, “రిజిస్ట్రేషన్ చేయాలా?” అంటూ వివరాలు తెలుసుకుని ఆర్టిఏ కార్యాలయంలో పనులు చక్కబెడుతున్నారు..
ఆర్టీఏ కార్యాలయానికి ఆనుకుని ఉన్న గేటు ఎదురుగా రోడ్డులో అనేక ఏజెంట్ సర్వీస్ కార్యాలయాలు నడుస్తున్నాయి. ఇవన్నీ రవాణా శాఖకు సంబంధించిన సేవల కొరకే. ప్రజలు నేరుగా కార్యాలయానికి వెళ్లే ముందు ఈ కేంద్రాలను ఆశ్రయించడం సాధారణంగా మారేలా పరిస్థితి తయారయ్యిందంటే అతిశయోక్తి కాదు.ఉదయం కార్యాలయం తెరుచుకునే సమయానికి ముందే ఏజెంట్లు తమ కార్యాలయాల వద్ద సిద్ధంగా ఉంటున్నారు. పేపర్లు పట్టుకొని వచ్చిన వ్యక్తిని చూస్తే చాలు వెంటనే వాలిపోతారు. కొందరైతే ఆర్టీఏ కార్యాలయంలో ఎవరిని కలవాలో తెలియక నేరుగా ఏజెంట్ల వద్దకే వెళ్లిపోతున్నారు. “ఏజెంట్ లేకపోతే పని జరగదు” అనే భావన వాహనదారుల్లో వ్యక్తం అవుతుంది.
Alao Read: సైదాబాద్ టు చాంద్రాయణగుట్ట ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఈ రూట్‌లో సిగ్నల్ ఫ్రీ జర్నీ స్టార్ట్..!
ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు తక్కువగానే ఉన్నప్పటికీ, ఏజెంట్ల ద్వారా పనులు చేయించుకుంటే ఖర్చు అనేక రెట్లు పెరుగుతోందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కొన్ని సందర్భాల్లో ప్రభుత్వ ఫీజు కంటే ఏజెంట్ వసూలు చేసే మొత్తం ఎక్కువగా ఉంటోందని ఆరోపణలు ఉన్నాయి. అవసరమైన పత్రాల పేరుతో, ప్రాసెసింగ్ పేరుతో, సర్వీస్ ఛార్జీల పేరుతో అదనపు భారం మోపుతున్నారని ప్రజలు చెబుతున్నారు.
“ప్రభుత్వం సేవలను ఆన్‌లైన్‌లో అందిస్తే మేమెందుకు ఏజెంట్లను ఆశ్రయించాలి?”, “ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లినా మళ్లీ మధ్యవర్తుల వద్దకే ఎందుకు పంపిస్తున్నారు?”, “కార్యాలయం చుట్టూ ఇన్ని ఏజెంట్ కార్యాలయాలు ఎలా ఏర్పడ్డాయి?” వంటి ప్రశ్నలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి.ఆర్టీఏ కార్యాలయం పరిసరాల్లో ఈ వ్యవస్థ ఏళ్లుగా కొనసాగుతున్నప్పటికీ దానిపై పెద్దగా చర్యలు కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది.
Also Read: కారుతో మైనర్ బీభత్సం.. 7 బైకులు ధ్వంసం, ఇద్దరికి తీవ్ర గాయాలు!
ఆర్టీఏ కార్యాలయానికి వచ్చే కొన్ని ఫైళ్లపై ప్రత్యేక గుర్తులు లేదా సంకేతాలు ఉంటాయని. ఈ గుర్తుల ద్వారా ఏ ఫైల్ ఏజెంట్ ద్వారా వచ్చిందో గుర్తించే అవకాశం ఉంటుంది.కొంతమంది వాహన యజమానులు మాత్రం ఏజెంట్ల ద్వారా సమర్పించిన దరఖాస్తులు త్వరగా కదులుతాయనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు విచారణ జరపాలని వాహనదారులు కోరుతున్నారు.
ఇబ్బందులు లేకుండా ప్రభుత్వ సేవలు నేరుగా అందాలంటే ఆర్టీఏ కార్యాలయాల్లో ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేయాలని, ఫీజుల వివరాలను బహిరంగంగా ప్రదర్శించడం, ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, కార్యాలయాల చుట్టూ అనధికారిక మధ్యవర్తిత్వంపై ప్రత్యేక నిఘా పెట్టడం అత్యవసరమని వాహనదారులు అభిప్రాయపడుతున్నారు. ప్రజలకు సేవలు అందించాల్సిన ప్రభుత్వ కార్యాలయం చుట్టూ ఏజెంట్ల సామ్రాజ్యం విస్తరిస్తుండటం రవాణా శాఖ పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. అధికారులు స్పందించి కఠిన చర్యలు తీసుకుంటారా? లేక ఇదే పరిస్థితి కొనసాగుతుందా? అన్నది ఇప్పుడు ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది.
Also Read: నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!