Inter Students: ఇంటర్ సిలబస్‌లో మార్పులు-చేర్పులు జరుగుతున్నాయా? మారిన సిలబస్ వచ్చే విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి రానుందా? కొన్ని పాఠాలను తొలగించాలని ఇంటర్ బోర్డు ఇప్పటికే నిర్ణయం తీసుకుందా? రాబోయే కొత్త పాఠాలేంటి? ఇవే ప్రశ్నలు చాలామంది విద్యార్థులను వెంటాడుతున్నాయి.
మారుతున్న కాలానికి అనుగుణంలో ఇంటర్ విద్యలో మార్పులు చేయాలని భావిస్తోంది తెలంగాణ బోర్డు. ఇప్పటికే వేసిన కమిటీ కసరత్తు చేసింది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, జువాలజీ, ఆర్ట్స్‌లో కొన్ని పాఠాలను తొలగించాలని నిర్ణయం తీసుకుంది. వాటి స్థానంలో ఏయే పాఠాలు ప్రవేశపెట్టబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.
ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు.. ఇంటర్ ఫిజిక్స్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-ఏఐ, రోబోటిక్స్, డేటా సైన్స్, మిషన్ లెర్నింగ్ పాఠాలను చేర్చాలని భావిస్తోంది. జువాలజీకి వస్తే కొవిడ్ మహమ్మారి లాంటి వ్యాధులపై అవగాహన పెంచేలా మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. మారిన సిలబస్ వచ్చే విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి తీసుకురావాలన్నది బోర్డు ఆలోచన.
ఇంటర్ సెకండియర్‌లో ఎలక్ట్రానిక్స్ ఛాప్టర్‌లో కొంత పార్టు తొలగించి, వాటి స్థానంలో వీటిని ప్రవేశపెట్టాలని సూచన చేసింది. మార్కెట్‌లో ఆయా కోర్సులకు డిమాండ్ ఉండడమే కారణంగా తెలుస్తోంది. ఈ తరహా కోర్సులకు బీటెక్ మాత్రమే కాకుండా డిగ్రీలో ఫుల్ డిమాండ్ ఉంది. ఈ క్రమంలో ఆయా సబ్జెక్టులను విద్యార్థులకు పరిచయం చేయాలన్నది బోర్డు ఆలోచనగా తెలుస్తోంది.
ALSO READ: సింగపూర్‌లో రేవంత్ టీమ్ బిజీ, వాణిజ్య మంత్రితో భేటీ
ఇటు జువాలజీ గ్రూపులో స్వల్ప మార్పులు జరగనున్నాయి. కొవిడ్ పాఠాన్ని చేర్చాలని నిర్ణయించిందట బోర్డు. ఆ తరహా వ్యాధులు వస్తే ఎలాంటి అవగాహన కల్పించాలని అనే అంశాలు పొందుపరుస్తున్నారు. వీటిపై విద్యార్థులకు ఏ మాత్రం భార పడకుండా ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇటు ఐఐటీ, అటు నీట్ దృష్టిలో పెట్టుకుని సిలబస్‌లో మార్పులు చేస్తున్నామన్నది కొందరి అధికారుల మాట.
సీనియర్ ప్రొఫెసర్లు, లెక్చరర్లతో సిలబస్ కమిటీలు వేసింది ఇంటర్ బోర్డు. ఆ కమిటీ ఇదే పనిలో నిమగ్నమైంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, జువాలజీ, బోటనీ గ్రూపుల్లో కొన్ని పాఠాలు తొలగించనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి చాన్నాళ్లు తర్వాత ఇంటర్మీడియట్‌లో కొత్త పాఠాలు రాబోతున్నాయన్నమాట.