TS Highcourt : తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ అరాధే ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో జస్టిస్ అలోక్ అరాధేతో గవర్నర్ తమిళిసై ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్, హైకోర్టు న్యాయమూర్తులు, పలువురు తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఇప్పటి వరకు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ ఉజ్జల్ భూయాన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. దీంతో ఆయన స్థానంలో జస్టిస్ అలోక్ అరాధే సీజేగా బాధ్యతలు చేపట్టారు.
మధ్యప్రదేశ్‌కు చెందిన జస్టిస్ అలోక్ అరాధే 1964 ఏప్రిల్ 14న రాయ్‌పూర్‌లో జన్మించారు. ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశాక 1988లో న్యాయవాదిగా వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. 2007లో సీనియర్ న్యాయవాది అయ్యారు. మధ్యప్రదేశ్ హైకోర్టులో రాజ్యాంగం, మధ్యవర్తిత్వం, కంపెనీ చట్టాలకు సంబంధించిన కేసులు వాదించడంతో ఆయనకు మంచి పేరు వచ్చింది.
జస్టిస్ అలోక్ 2009 డిసెంబర్ 29న మధ్యప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2016 సెప్టెంబర్ 16న జమ్మూకశ్మీర్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. అక్కడే తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా కూడా పని చేశారు. అక్కడ నుంచి 2018 నవంబర్ 17న కర్ణాటక హైకోర్టుకు బదిలీ అయ్యారు. అక్కడ కూడా తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా సేవలు అందించారు.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విభజన 2019 జనవరి 1న జరిగింది. తెలంగాణ హైకోర్టు ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు ఐదుగురు సీజేలుగా పనిచేశారు. జస్టిస్ రాధాకృష్ణన్, జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ సీజేలుగా పనిచేశారు. ఇప్పుడు జస్టిస్ అలోక్ అరాధే తెలంగాణ హైకోర్టుకు ఆరో సీజేగా బాధ్యతలు చేపట్టారు. జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ పదోన్నతిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా వెళ్లారు.