
Amit shah Hyderabad visit schedule(Political news in telangana) :
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రహోంమంత్రి అమిత్ షా 20 రోజుల వ్యవధిలోనే మరోసారి తెలంగాణకు వస్తున్నారు. ఆగస్టు 27న ఖమ్మం బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణలో అధికారం సాధిస్తామంటూ కాషాయ శ్రేణుల్లో విశ్వాసాన్ని నింపే ప్రయత్నం చేశారు. ఇప్పుడు మరోసారి తెలంగాణ పర్యటనకు రాబోతున్నారు.
సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో అమిత్ షా పాల్గొంటారు. సెప్టెంబర్ 16నే అమిత్ షా హైదరాబాద్‌కు చేరుకుంటారు. ఆ రోజు రాత్రి 7.55 గంటలకు ఔరంగాబాద్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వస్తారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా సీఆర్పీఎఫ్ సెక్టార్స్ ఆఫీసర్స్ మెస్‌కు వెళతారు. రాత్రి అక్కడే బస చేస్తారు. 17న ఉదయం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ కు అమిత్ చేరుకుంటారు. తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు హాజరవుతారు. ఆ తర్వాత తెలంగాణ ప్రజల నుద్దేశించి అమిత్ షా ప్రసంగిస్తారు.