
Rohit Sharma Latest Record(Indian cricket news today) :
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరో మైలురాయి దాటాడు. వన్డేల్లో10 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. హిట్ మ్యాన్ 241 ఇన్నింగ్స్ లోనే ఈ మార్కు చేరుకున్నాడు. కోహ్లీ 205 ఇన్నింగ్స్ ల్లో 10 వేల రన్స్ చేశాడు. ఆ తర్వాత రోహితే వేగంగా 10 వేల పరుగులు మైలురాయిని చేరాడు.
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 259 ఇన్నింగ్స్ ల్లో , సౌరవ్ గంగూలీ 263 ఇన్నింగ్స్ ల్లో 10 వేల రన్స్ చేశారు. భారత్ నుంచి ఈ ఘనత సాధించిన ఆరో బ్యాటర్ గా రోహిత్ నిలిచాడు. సచిన్, గంగూలీ, ద్రవిడ్, ధోని, కోహ్లీ .. రోహిత్ కంటే ముందు 10 వేల రన్స్ చేశారు. అంతర్జాతీయంగా 10 వేల క్లబ్ లో చేరిన 15వ బ్యాటర్ రోహిత్.
ఇప్పటి వరకు 248 వన్డే మ్యాచ్ లు ఆడిన రోహిత్ 241 ఇన్నింగ్స్ లో 10, 031 పరుగులు చేశాడు. అందులో 30 సెంచరీలు, 51 హాఫ్ సెంచరీలున్నాయి. వన్డేలో 3 డబుల్ సెంచరీలు కొట్టిన తొలి బ్యాటర్ రోహిత్ శర్మనే. అత్యధిక వ్యక్తిగత స్కోర్ 264. ఆసియా కప్‌లోనూ రోహిత్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. తొలి మ్యాచ్ లో పాక్ పై విఫలమైనా ఆ తర్వాత వరుసగా 3 హాఫ్ సెంచరీలు కొట్టాడు. నేపాల్ , పాకిస్థాన్, శ్రీలంకలపై హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ జోడి ప్రపంచ రికార్డును తమ ఖాతాలో వేసుకుంది. వన్డేల్లో అత్యంత వేగంగా 5 వేల పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన జోడిగా నిలిచింది. ఇప్పటి వరకు వెస్టిండీస్ దిగ్గజ బ్యాటర్లు గార్డన్ గ్రీనిడ్జ్ , డెస్మాండ్ హేన్స్ పేరిట ఈ రికార్డు ఉంది. వారిద్దరూ 97 ఇన్నింగ్స్‌ల్లో ఈ మార్క్‌ను అందుకున్నారు. ఇప్పుడు విరాట్ కోహ్లీ- రోహిత్ శర్మ కేవలం 86 ఇన్నింగ్స్‌ల్లోనే 5 వేల పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇందులో 18 సార్లు సెంచరీ పార్టనర్ షిప్, 15 సార్లు హాఫ్ సెంచరీ పార్టనర్‌షిప్‌లు ఉన్నాయి. హిట్ మ్యాన్- కింగ్ జోడి మ్యాచ్ కు సగటున 62.47 పరుగులు జోడించారు. ఇద్దరూ కలిసి 2018లో ఆస్ట్రేలియాపై అత్యధికంగా 246 పరుగులు జోడించారు.