TRS : అగ్నిపరీక్ష
మునుగోడు ఉపఎన్నిక టీఆర్ఎస్ కు అగ్ని పరీక్షగా మారింది. చాలా మంది ఎమ్మెల్యేలు కారు దిగిపోతారని ప్రచారం జోరుగా సాగుతోంది. మునుగోడులో గులాబీ పార్టీ ఓటమి పాలైతే వలసల జోరుందుకునే అవకాశం ఉంది. ఉపఎన్నికలో గెలుపు తమదేనని కేసీఆర్ గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. ప్రచార సమయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు సహా వందమంది నేతలను మోహరించారు. కేసీఆర్ లంకెలపల్లి గ్రామానికి ఇన్ఛార్జ్ గా ఉన్నారు.
TRS : గులాబీ నేతల్లో టెన్షన్
మునుగుడు ఉపఎన్నికపై టీఆర్ఎస్ నాయకుల్లో టెన్షన్ నెలకొంది. ఓటర్లకు భారీగా తాయిలాలు ఎర వేసినా గెలుస్తామా? లేదా? అనే అనుమానం గులాబీ నేతలను వెంటాడుతోంది. ఎన్నికల షెడ్యూల్ రాగానే గ్రామానికో లీడర్‌ను ఇన్ఛార్జ్ గా నియమించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు నెలరోజులు మునుగోడులోనే మకాం వేశారు. గతంలో ఉపఎన్నికల సమయంలో ఒక బహిరంగ సభతోనే సరిపెట్టిన కేసీఆర్…ఈసారి రెండుసార్లు బహిరంగ సభలకు హాజరయ్యారు. నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో పక్కాగా పనిచేసినా గెలుస్తామన్న ధీమా గులాబీ నేతల్లో కనిపించడంలేదు.
TRS : ప్రచారం ఫలించేనా?
మునుగోడులోని ప్రతి ఇంటికి ఏదో ఒక పథకంతో ప్రయోజనం కల్పించామని మంత్రులు ప్రచారం చేశారు. ఆసరా, రైతుబంధు, దళిత బంధు, కళ్యాణలక్ష్మి.. ఇలా ప్రతి పథకం ఓటర్లకు చేరిందని పదే పదే చెప్పారు. అయినా లబ్ధిదారులు ఓట్లు వేస్తారా? అనే అనుమానం టీఆర్ఎస్ను నేతలను వెంటాడుతోంది. ఓటుకు రూ. 3 వేలు పంచారనే ఆరోపణలు వచ్చాయి.
TRS : 2 విజయాలు, 2 పరాజయాలు
టిఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 4 ఉపఎన్నికలు జరిగాయి. రెండు చోట్ల గెలిస్తే మరో రెండు స్థానాల్లో ఓడింది. హుజూర్ నగర్, నాగార్జునసాగర్ ఉపఎన్నిక బాధ్యతలను కేటీఆర్‌కు అప్పగించారు. ఆ రెండు ఉపఎన్నికల్లో కారు దూసుకుపోయింది. దుబ్బాక, హుజూరాబాద్ బాధ్యతలను హరీశ్‌కు అప్పగించారు. ఈ రెండు ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ కు షాక్ తగిలింది. ఐదో ఉపఎన్నికలో మాత్రం ఇన్ఛార్జ్ బాధ్యతలు ఎవరికీ ఇవ్వకుండా ఒక్కో గ్రామానికి ఒక్కో లీడరును ఇన్ఛార్జ్ గా నియమించారు కేసీఆర్. ఎన్నికల వ్యూహాలు, ప్రచారం, నేతల మధ్య సమన్వయం చేసే బాధ్యతలను కేటీఆర్, హరీశ్ రావు కు అప్పగించారు కేసీఆర్. కుటుంబలోని వ్యక్తుల తప్ప మిగతా వారికి పెద్ద బాధ్యతలు అప్పగించలేదు. ఉపఎన్నికలో ఓటమి భయంతోనే ఇతర నేతలపై విశ్వాసం ఉంచలేదని టాక్ వినిపిస్తోంది.
TRS : కారుకు బ్రేకులు?
మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ ఓడితే ఆ పార్టీ నుంచి భారీగా వలసలు ఉంటాయని టాక్ వినిపిస్తోంది. సాధారణ ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే సమయం ఉంది. సెమీ ఫైనల్ లాంటి మునుగోడులో గెలవకపోతే కారుకు బ్రేకులు పడినట్లేనని ప్రచారం సాగుతోంది. మరి ఈ సవాళ్లను కేసీఆర్ ఎలా అధిగమిస్తారో చూడాలి మరి.