Veera Raghava Reddy: రామరాజ్యం ఆర్మీ పేరుతో హడావిడి చేసిన వీర రాఘవరెడ్డిపై దాడి జరిగింది. చిలుకూరు ఆలయ పూజారి రంగరాజన్‌పై దాడి కేసులో.. ప్రధాన నిందితుడిగా ఉన్న వీరరాఘ, ఇటీవలే అరెస్టై బయటకు వచ్చాడు. ఈ కేసులోనే మొయినాబాద్ పీఎస్‌కు సంతకం చేసి వస్తుండగా.. 20 మంది గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తిరిగి వస్తూ.. ఓ టీ స్టాల్ దగ్గర ఆయన ఆగారు. అక్కడే వీర రాఘవరెడ్డిపై దుండగులు ఎటాక్ చేశారు. ఈ దాడిలో వీర రాఘవ రెడ్డి గాయపడ్డాడు. గమనించిన స్థానికులు అడ్డు రావడంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆయన మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరం గ్రామానికి చెందిన కొవ్వూరి వీర రాఘవరెడ్డి రామరాజ్యం పేరుతో ప్రైవేట్ సైన్యం నడిపిస్తున్నాడు. దేశంలో రామరాజ్యం ఏర్పాటు కావాలని ప్రచారం చేస్తుంటాడు. కొంత యువకులను తన సైన్యంలో రిక్రూట్ చేస్తూ వస్తున్నాడు. వారికి నెలకు 20 వేల జీతం కూడా ఇస్తున్నాడు. 5 కిలో మీటర్లు నడిచే సామర్థ్యం, రెండు కిలో మీటర్లు పరిగెత్తే సామర్థం ఉంటే చాలు. వయసు 20 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి. ఇలా ఉన్నవారికి ఆయన తన సైన్యంలో చేర్చుకుంటున్నాడు.
ఆ సైన్యంతో చాలా దౌర్జన్యాలకు పాల్పడ్డాడని రాఘవరెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. గతేడాడి ఫిబ్రవరిలో అనుచరులతో కలిసి చిలుకూరు బాలాజీ అర్చకుడు రంగరాజన్‌ను ఇంటికి వెళ్లి దాడి చేశాడు. తమ రామరాజ్యం స్థాపనకు మద్దతు ఇవ్వాలని, భక్తులను తమ సంస్థలో చేర్చాలని ఒత్తిడి చేశాడు. రంగరాజన్ అంగీకరించకపోవడంతో దాడికి పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. అతని కుమారుడిని తన ప్రైవేట్ సైన్యంతో కొట్టించాడు. గతంలో హైదరాబాద్ అబిడ్స్‌లో కూడా వీర రాఘవరెడ్డిపై దాడి కేసు నమోదు అయ్యింది. రంగరాజన్‌పై దాడి ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. వీరరాఘవరెడ్డితో పాటు అతడి అనుచరులను సైతం అరెస్ట్ చేశారు.
అయితే ఈ దాడిపై వీరరాఘవ రెడ్డి స్పందించాడు. మొయినాబాద్ పీఎస్‌కు సంతకం చేయడానికి వెళ్లిన తనపై.. దాడి చేసినట్లు వీర రాఘవ రెడ్డి తెలిపాడు. ఇటీవల తనపై దాడిచేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని రంగరాజన్ ప్లెస్ క్లబ్‌లో మీడియా సమావేశం పెట్టి మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే తనపై దాడి చేపించి ఉంటారని ఆయన చెబుతున్నారు. పోలీసులు ఈ ఘటనకు సంబంధించి.. పూర్తి వివరాలు సేకరించి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే దాడి చేసిన వ్యక్తులందరూ కూడా పోలీసులు ఘటనా స్థలానికి వచ్చేలోపే అక్కడి నుంచి పరార్ అయినట్లు ఆయన తెలిపారు.
Also Read: దూకుడు మీదున్న కొత్త కమిషనర్, బెంబేలెత్తుతున్న అధికారులు, ఏం జరిగింది?
కాగా ఇటీవల బెయిల్‌పై బయట ఉన్న వీరరాఘవ రెడ్డి.. ఇండియా, పాకిస్థాన్ ఇష్యూపై కూడా రియాక్ట్ అయ్యారు. ఇది జరిగిన రెండు రోజులకే ఆయనపై దాడి జరిగినట్లు తెలుస్తోంది.