Mumbai: ముంబైలో కలకలం రేపిన కిడ్నాపర్ ని కాల్చారు పోలీసులు. ముంబైలోని పవయా ప్రాంతంలోని ఆర్ ఏ యాక్టింగ్ స్టూడియోలో పని చేసే రోహిత్ ఆర్య గత నాలుగైదు రోజులుగా ఆడిషన్స్ నిర్వహిస్తున్నాడు. గురువారం ఉదయం 15 ఏళ్ల వయసుగల పిల్లలు వంద మంది ఆడిషన్స్ కోసం స్టూడియోకి వచ్చారు. వీరిలో 80 మంది వరకూ చిన్నారులను బయటకు పంపించిన రోహిత్ మరో 20 మందిని మాత్రం స్టూడియో నుంచి వెళ్లకుండా అక్కడే బంధించాడు. దీంతో భయాందోళనలకు గురైన పిల్లలు స్టూడియో కిటికీల నుంచి సాయం కోసం అరిచారు. అది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడకు చేరుకుని చాకచక్యంగా వ్యవహరించి.. చిన్నారులను రక్షించారు. నిందితుడ్ని అరెస్టు చేశారు. ఇంతలో జరిగిన ఘర్షణలో భాగంగా.. పోలీసులు అతడిపై కాల్పులు జరిపారు. ఆ వెంటనే అతడ్ని ఆస్పత్రిలో చేర్పించారు. ఆర్య చికిత్స పొందుతూ మృతి చెందాడు.