Hyderabad Traffic: హైదరాబాద్ నగరవాసులకు ఇది ముఖ్య గమనిక. నేషనల్ హైవే (NH)-44 పై ప్యారడైజ్ జంక్షన్ నుంచి డెయిరీ ఫామ్ రోడ్ వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఈ రోజు(అక్టోబర్ 30) నుంచి తొమ్మిది నెలల పాటు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ప్రకటించింది. ఈ మేరకు జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) డి. జోయెల్ డేవిస్ మళ్లించిన ట్రాఫిక్ అడ్వైజరీని విడుదల చేశారు.
రాజీవ్ గాంధీ విగ్రహం జంక్షన్ నుండి బాలంరాయ్ వరకు ఉన్న రహదారి మార్గం ఇరువైపులా ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ కాలం మొత్తం పూర్తిగా మూసివేశారు. బాలంరాయ్ నుంచి సీటీఓ జంక్షన్ వరకు ఉన్న రోడ్ పరిసర ప్రాంతాలలో ట్రాఫిక్ ఎక్కువగా ఏర్పడే అవకాశం ఉన్నందున ఆ మార్గాన్ని కూడా సాధ్యమైనంత వరకు నివారించాలని ప్రజలకు సూచించారు. ప్రజల సౌకర్యార్థం, వాహనదారులు అనుసరించాల్సిన ముఖ్యమైన మళ్లింపు మార్గాలను ట్రాఫిక్ పోలీసులు వివరించారు.
ALSO READ: Bihar elections: సీఎం అభ్యర్థి నితేశ్! బీహార్‌లో బీజేపీ ప్లాన్ అదేనా?
బాలానగర్ వైపు నుండి వచ్చి పంజాగుట్ట/ట్యాంక్ బండ్ వైపు వెళ్లాలనుకునే వాహనదారులు తాడ్‌బండ్ – మస్తాన్ కేఫ్ – డైమండ్ పాయింట్ – రైట్ టర్న్ – మడ్‌ఫోర్ట్ – ఎన్‌సీసీ – జేబీఎస్ – ఎస్‌బీఐ మార్గాన్ని ఉపయోగించుకోవాలని చెప్పారు. సుచిత్ర వైపు నుండి వచ్చి పంజాగుట్ట/ట్యాంక్ బండ్ వైపు వెళ్లాలనుకునే వాహనదారులు సేఫ్ ఎక్స్‌ప్రెస్ – లెఫ్ట్ టర్న్– బాపూజీ నగర్ – సెంటర్ పాయింట్ – డైమండ్ పాయింట్ – మడ్‌ఫోర్ట్ – ఎన్‌సీసీ – జేబీఎస్ – ఎస్‌బీఐ మార్గాన్నిఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
ట్యాంక్ బండ్/రాణి గంజ్/పంజాగుట్ట/రసూల్‌పుర/ప్లాజా వైపు నుండి సీటీఓ జంక్షన్ మీదుగా తాడ్‌బండ్ వైపు వెళ్లాలనుకునే వాహనదారులు రాజీవ్ గాంధీ విగ్రహం జంక్షన్ వద్ద అన్నా నగర్ – బాలంరాయ్ – తాడ్‌బంద్ వైపు ప్రయాణించాలని చెప్పారు. అన్నా నగర్ నివాసితులు: పంజాగుట్ట/ట్యాంక్ బండ్ వైపు వెళ్లాలనుకునే వారు మీటింగ్ పాయింట్ బైలేన్, హాకీ గ్రౌండ్ బైలేన్, ఎల్&ఓ పోలీస్ స్టేషన్ బైలేన్ వంటి అంతర్గత మార్గాలను ఎంచుకోవాలని పేర్కొన్నారు. లేదా బాలంరాయ్ మీదుగా వెళ్లవచ్చని చెప్పారు.
ALSO READ: Jubilee Hills by Election: జూబ్లీహిల్స్ బైపోల్.. గెలుపు వార్ వన్ సైడే: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
ట్రాఫిక్ పోలీసులు తెలిపిన ఈ మళ్లింపులను దృష్టిలో ఉంచుకుని ప్రజలు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు కోరారు. తమకు సహకరించాలని కోరారు. తాజా ట్రాఫిక్ వివరాల కోసం @Hyderabad Traffic Police ఫేస్‌బుక్ పేజీని లేదా @HYDTP (ట్విట్టర్ హ్యాండిల్)ను అనుసరించవచ్చు. అత్యవసర ప్రయాణ సహాయం కోసం 9010203626 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.