House Theft: వినాయక చవితి పండగ వేళ సొంతూరికి వెళ్లిన దంపతులకు తిరిగొచ్చేసరికి ఊహించని షాక్ తగిలింది. పండగ సంతోషంతో ఇంటికి చేరిన వారికి గుమ్మం ముందే దొంగతనం జరిగిన విషయం తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. చర్లపల్లి పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలోని రైల్వే కాలనీలో ఈ ఘటన చోటుచేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది.
వినాయక చవితికి స్వగ్రామానికి..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రైల్వే కాలనీలోని ప్లాట్ నంబర్ 19లో నివాసముంటున్న దంపతులు ఈ నెల 12వ తేదీ శనివారం నాడు వినాయక చవితి వేడుకల కోసం తమ సొంతూరికి వెళ్లారు. పండగ ముగించుకుని బుధవారం తిరిగి ఇంటికి చేరుకోగా.. వెనుక వైపు తలుపులు తీసి ఉండటాన్ని గమనించారు. అనుమానంతో లోపలికి వెళ్లి చూడగా ఇంట్లోని సామాన్లు, దుస్తులు చిందరవందరగా పడి ఉన్నాయి. బీరువా తెరిచి చూడటంతో అందులో దాచిన సుమారు 10 తులాల బంగారం, 12 తులాల వెండి ఆభరణాలు మాయమైనట్లు గుర్తించారు.
చర్లపల్లి పోలీసులకు ఫిర్యాదు..
బాధితులు వెంటనే చర్లపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్లూస్ టీమ్‌తో సహా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించారు. దొంగలు ఇంటి వెనుక వైపు తలుపులు పగలగొట్టి లోపలికి చొరబడినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ అనుమానితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పోలీస్ స్టేషన్‌కు అత్యంత సమీపంలోనే ఈ దోపిడీ జరగడంతో స్థానిక ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.
Also Read: దిల్‌సుఖ్‌నగర్ బహార్ బిర్యానీ కేఫ్‌పై ఫుడ్ సేఫ్టీ దాడులు.. 50 కేజీల కుళ్లిన చికెన్, మటన్ స్వాధీనం!