Fake Officer: స్వేచ్ఛ బ్యూరో: ప్రభుత్వ అధికారిని అంటూ నమ్మించి, స్థానిక దుకాణాలు, హోటళ్ల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న ఓ నకిలీ అధికారి గుట్టు రట్టయింది. ఎల్లంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని డబిల్‌పూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. సదరు వ్యక్తి తాను ట్రేడ్ లైసెన్స్, చైల్డ్ లేబర్ ఆఫీసర్‌నని చెబుతూ వ్యాపార సముదాయాల్లో ప్రదక్షిణలు చేస్తూ.. నిర్వాహకులను బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలిసింది. అయితే తని ప్రవర్తన, మాటతీరుపై అనుమానం వచ్చిన స్థానిక యువకులు ఐడీ కార్డు చూపించాలని నిలదీశారు.
యువకులు అతడి గుర్తింపు కార్డును క్షుణ్ణంగా పరిశీలించగా.. అది నకిలీదని స్పష్టమైంది. దీంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా అప్రమత్తమైన యువకులు ఆ నకిలీ అధికారిని పట్టుకుని మేడ్చల్ పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సమగ్ర విచారణ చేపట్టారు. సదరు వ్యక్తి ఇప్పటివరకు ఏయే షాపులు, హోటళ్లలో తిరిగాడు? ఎవరెవరి దగ్గర ఎంత మొత్తంలో డబ్బులు వసూలు చేశాడు? అలాగే ఆ నకిలీ ఐడీ కార్డును ఎక్కడ, ఎలా తయారు చేయించాడనే కోణాల్లో పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు.
Also Read: శ్రీహరి కొడుకు మేఘాంశ్ ‘ఆస్మాన్ ‘ టీజర్ రిలీజ్!