Balmoor Venkat: సిఎల్పీ మీడియా హాల్ వేదికగా ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్ బిఆర్‌ఎస్ తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శాసనసభ సమావేశాలను సజావుగా సాగనివ్వకుండా చెడగొట్టడమే లక్ష్యంగా బిఆర్‌ఎస్ కుట్ర పన్నిందని ఆయన ఆరోపించారు. సభకు హాజరైతే తమ గత వైఫల్యాలు, అక్రమాలు ఎక్కడ బయటపడతాయోనన్న భయంతోనే ఆ పార్టీ నేతలు సభను అడ్డుకునేందుకు ప్లాన్ చేశారని మండిపడ్డారు. BRSLP సమావేశంలోనే ఈ కుట్రకు పునాది వేశారని, ప్రజాసమస్యలపై చర్చించకుండా పారిపోవడానికే బిఆర్‌ఎస్ ప్రాధాన్యమిస్తోందని స్పష్టం చేశారు.
స్వీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు..
అసెంబ్లీ గేటు వద్ద స్పీకర్‌పై బిఆర్‌ఎస్ నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యలు దళితుల పట్ల ఆ పార్టీకి ఉన్న వ్యతిరేక వైఖరిని స్పష్టంగా బయటపెట్టాయని వెంకట్ ధ్వజమెత్తారు. శుద్ధీకరణ పేరిట దళితులను అవమానించడం దారుణమని, రాబోయే రోజుల్లో తెలంగాణ దళితులు బిఆర్‌ఎస్‌కు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమని హెచ్చరించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము పద్ధతి ప్రకారం నిరసన తెలిపినప్పటికీ తమపై దాడులు జరిగాయని, నా పక్కటెముకలు కూడా విరిగాయని ఆనాటి పరిస్థితులను గుర్తు చేసుకున్నారు. కానీ నేడు బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు మహిళా పోలీసుల పట్ల కూడా అసభ్యంగా ప్రవర్తించడం వారి దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు.
కేటీఆర్ పిఏ, పిఆర్ఓల ప్రవర్తనపై ఆగ్రహం..
కేటీఆర్ పిఏ, పిఆర్‌ఓల ప్రవర్తనను వెంకట్ తీవ్రంగా తప్పుపట్టారు. డ్యూటీలో ఉన్న పోలీసులను బూతులు తిడుతూ, గల్లా పట్టి కొట్టడం యావత్ సమాజం చూసిందని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే పోలీస్ శాఖ తమదైన శైలిలో గట్టి సమాధానం చెప్పాలని విజ్ఞప్తి చేశారు. సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో డిజే పర్మిషన్ కోసం వచ్చిన యువకులను కాంగ్రెస్ వారంటూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని, అసలు వాస్తవాలను పోలీసు అధికారులే స్పష్టంగా వెల్లడించారని పేర్కొన్నారు. పోలీసు కెమెరాల్లో అన్ని దృశ్యాలు రికార్డయ్యాయని, సిగ్గు లేకుండా కేటీఆర్, హరీష్‌రావులు దాడి జరిగిందంటూ తప్పుడు ప్రచారాలు చేయడం మానుకోవాలన్నారు. పిఏలు, పిఆర్‌ఓలు ఒళ్లు దగ్గర పెట్టుకుని ప్రవర్తించాలని హెచ్చరించారు.
Also Read: యూపీఐ ఉచిత సేవలకి ఎండ్ కార్డ్? మోదీ సర్కార్ నిర్ణయంపై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు!