Telangana Rains: మోంథా తుపాను ప్రభావం తెలంగాణపై పడనుంది. రాబోయే రెండు రోజులు తెలంగాణలోని అనేకచోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సోమవారం ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, నాగర్‌కూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ని భారత వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది.
తెలంగాణకు భారీ వర్ష సూచన
మొంథా తుపాను ప్రభావం తెలంగాణలోనూ చూపనుంది. నేటి నుంచి నాలుగు రోజులపాటు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తుపాను బలపడి రేపటికి తీవ్ర తుపానుగా మారనుంది. తుపాను తీరం ధాటే సమయంలో గంటలకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది.
మంగళవారం సాయంత్రం మచిలీపట్నం-కలింగపట్నం మధ్య తుపాను తీరాన్ని దాటే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. మంగళ, బుధవారాల్లో ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, మహబూబాబాద్, ఖమ్మం, వరంగల్, హన్మకొండ, జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడనున్నట్లు పేర్కొంది. ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.
మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు
హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్ నగర్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి వంటి జిల్లాలకు భారీ వర్షాలు పడనున్నాయి. వీటికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షం పడే సమయంలో అవసరమైతే తప్ప, బయటకు రావద్దని సూచన చేసింది.
హైదరాబాద్ నగరంలో మంగళ, బుధవారాల్లో ఓ మోస్తరు వర్షాలు పడనున్నాయి. ఆశాశం మేఘావృతమై ఉండనుంది. సిటీలో 30 నుంచి 55 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావచ్చని అంచనా వేస్తోంది. రానున్న రెండు రోజులు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ కేంద్రం పేర్కొంది.
ALSO READ: జూబ్లీహిల్స్ బైపోల్.. వీధి వ్యాపారులతో మంత్రి ముచ్చట్లు
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలపడి మొంథా తుపానుగా మారినట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం నైరుతి-ఆగ్నేయ మద్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైంది. మంగళవారం నాటికి తీవ్ర తుపానుగా మారనుంది. గడిచిన 6 గంటల్లో గంటకు 20 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది.