Bandi Sanjay fires on Rahul Gandhi not respond on Bangladesh Hindus: కాంగ్రెస్ పార్లమెంటరీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బంగ్లాదేశ్ లో మైనారిటీ హిందువులపై ముస్లింలు ఊచకోత కోస్తుంటే కనీసం మానవత్వం మరిచిపోయిన రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదంటూ బండి సంజయ్ ప్రశ్నించారు. భారత దేశంలో కులాలు, మతాలు రెచ్చగొట్టిందే కాంగ్రెస్ అన్నారు. అప్పట్లో నెహ్రూ నియంతృత్వ ధోరణితో హిందూ వర్గాలను అణిచివేశారని అన్నారు. నాడు కాంగ్రెస్ నేతలు ఆనాలోచితంగా బెంగాల్ నుంచి బంగ్లాదేశ్ ని విడదీశారని..దాని ఫలితమే ఇప్పుడు జరుగుతున్న హిందువులపై దాడులని అన్నారు. కేవలం నెహ్రూ తన స్వార్థం కోసం, కుటుంబ ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకునేవారు తప్ప ఏనాడూ ప్రజా శ్రేయస్సు గురించి ఆలోచించలేదని అన్నారు.
నెహ్రూ కుటుంబానికే కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీ అంటేనే కేవలం నెహ్రూ కుటుంబానికి మాత్రమే అండగా నిలబడి భజన బృందంగా తయారయిందని..ఇన్నాళ్లుగా కుటుంబ పాలన తరహాలోనే కాంగ్రెస్ పాలన సాగిందని అన్నారు. ప్రజలలో దేశభక్తి భావాలను రగిలించడానికే తమ ప్రభుత్వం హర్ ఘర్ తిరంగ కార్యక్రమాన్ని ప్రారంభించామని అన్నారు. దేశ భక్తి ఏ కోశానా లేని కాంగ్రెస్ ఎప్పుడైనా ఇలాంటి ఆలోచన చేసిందా అని బండి సంజయ్ ప్రశ్నించారు. సోమవారం కరీంనగర్ జిల్లాలో బీజేపీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున తిరంగ యాత్రను ప్రారంభించారు బండి సంజయ్. భారతీయ యువ మోర్చా ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ..మోదీ వెనకబడిన కులాల వారికి న్యాయం చేయడంలో అంబేద్కర్ ను స్ఫూర్తిగా తీసుకున్నారని అన్నారు.
ఇళ్ల ముందు జాతీయ జెండా
మోదీ ఏనాడూ ముస్లిం వ్యతిరేక వ్యాఖ్యలు చేయలేదని..కావాలనే ప్రతిపక్షాలు మోదీ కేవలం హిందువులకు మాత్రమే సపోర్ట్ అంటూ అవాస్తవాలు ప్రచారం చేయడం తగదని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చాక ఎక్కువ కాలం కాంగ్రెస్ పాలనలోనే దేశం ఉందని కానీ ఏనాడూ ఆర్టికల్ 370 గురించి ఆలోచించలేదని అన్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్ ఊపిరి పీల్చుకుందని అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో ప్రతి యువతా తమ మొబైల్స్ లో డీపీలుగా త్రివర్ణ పతాకం పెట్టుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల ముందు జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటాలని పిలుపునిచ్చారు.