జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి జరగబోతున్న ఉప ఎన్నిక బీఆర్ఎస్ కి కీలకంగా మారింది. ఇది కేవలం బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం మాత్రమే కాదు, ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోయిందని బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారంలో ఎంత నిజముందో ఈ ఫలితం తేల్చేస్తుంది. అందుకే కేసీఆర్ కూడా ఈ ఎన్నికపై ఫోకస్ పెట్టారు. అభ్యర్థి మాగంటి సునీతతోపాటు కీలక నేతలతో ఆయన సమావేశమయ్యారు. దాదాపు 2 గంటలసేపు ఆయన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ప్రచారం ఇతర అంశాలపై ఆరా తీశారు. నాయకులకు దిశా నిర్దేశం చేశారు.
కాంగ్రెస్ అభ్యర్థిపై తీవ్ర వ్యాఖ్యలు..
సహజంగా కేసీఆర్ కి తన ప్రత్యర్థిని తీవ్రంగా చులకన చేసి మాట్లాడటం అలవాటు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ని రౌడీషీటర్ అంటూ ఈ సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. కాంగ్రెస్ తన అభ్యర్థిగా ఓ రౌడీషీటర్ ని నిలబెట్టిందని, హైదరాబాద్ ప్రజలు విజ్ఞతతో ఓటు వేయాలని ఆయన అన్నారు. గెలుపుకోసం కాదని, భారీ మెజార్టీకోసం ప్రయత్నించాలని ఆయన నేతలతో అన్నారు. కాంగ్రెస్ పాలనతో ప్రజలు అసంతృప్తితో ఉన్నారని, అదే బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపుకి కారణం అవుతుందని చెప్పారు.
ఆ నమ్మకం ఉందా?
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలకే నమ్మకం కుదరడం లేదు. అందుకే సేఫ్ సైడ్ పీజేఆర్ తనయుడు విష్ణుతో నామినేషన్ వేయించారు. ఇటీవల సునీత తన తండ్రికి భార్య కాదంటూ మాగంటి గోపీనాథ్ తనయుడు తారక్ ప్రద్యుమ్న రచ్చకెక్కడం మరింత సంచలనంగా మారింది. ఆమె నామినేషన్ ని రద్దు చేయాలంటూ ఆయన ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే బీఆర్ఎస్ ఈ వ్యవహారంపై ఏమాత్రం స్పందించడం లేదు. అటు మాగంటి సునీత కూడా అధికారులకు అఫిడవిట్ ఇస్తానన్నారు కానీ, బహిరంగంగా ఈ వ్యవహారంపై ఆమె స్పందించలేదు. దీంతో బీఆర్ఎస్ కి ఇది నెగెటివ్ గా మారే అవకాశముందని అంటున్నారు.
Also Read: ఇంట్లో కూర్చుని మాట్లాడితే కుదరదు.. ఏదైనా ఉంటే అసెంబ్లీలో చూసుకో
కేసీఆర్ వ్యూహం ఏంటి..?
2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ డైలమాలో పడింది. అంతే కాదు, ఉన్న ఎమ్మెల్యేలు ఒక్కొక్కరే చేజారుతుండటంతో ఆ పార్టీకి ఏం చేయాలో దిక్కుతోచలేదు. అసెంబ్లీ ఎన్నికల మరుసటి ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కనీసం ఒక్క స్థానం కూడా గెలవకపోవడం బీఆర్ఎస్ ని మరింత ఇబ్బంది పెట్టింది. ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో సత్తా చూపుతామని అంటున్నారు ఆ పార్టీ నేతలు. అనుకోకుండా వచ్చిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తమ స్థానాన్ని నిలబెట్టుకోడానికి ఆపసోపాలు పడుతున్నట్టు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు స్థానికులు చెబుతున్నారు. అయినా సరే బీఆర్ఎస్ మాత్రం ఈ ఎన్నికల్లో గట్టి పోటీ అయినా ఇవ్వాలనే ఉద్దేశంతో శక్తులన్నీ జూబ్లీహిల్స్ పైనే కేంద్రీకరించింది.
Also Read: సీఎం అభ్యర్థిగా తేజస్వీ యాదవ్