Konda Surekha: ఎట్టకేలకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చెలరేగిన చిన్నపాటి టీ కప్పులో తుపాన్ ముగిసిపోయింది. ఈ వ్యవహారంపై స్వయంగా మంత్రి కొండా సురేఖ క్లారిటీ ఇచ్చారు. తన కూతురు చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి క్షమాపణలు చెప్పారు. ఈ ఇష్యూ ఇంతటితో ముగిసిపోయిందన్నారు. అసలేం జరిగింది?
ముఖ్యమంత్రి రేవంత్‌కు క్షమాపణలు చెప్పిన కొండా సురేఖ
సరిగ్గా పది రోజుల కిందట హైదరాబాద్‌లోని మంత్రి కొండా సురేఖ ఇంటికి టాస్క్‌ఫోర్స్ పోలీసులు వెళ్లారు. కొన్నాళ్లుగా ప్రైవేటు ఓఎస్డీ సుమంత్ కోసం పోలీసులు వెతుకుతున్నారు. మంత్రి కొండా సురేఖ ఇంట్లో అతడు ఉన్నట్లు సమాచారం రావడంతో పోలీసులు వెళ్లారు. ఈ క్రమంలో పోలీసులతో కొండా సుస్మిత వాగ్వాదానికి దిగారు.
ఆవేశంలో సీఎం రేవంత్‌రెడ్డి కామెంట్స్ చేశారు. ఈ వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో తీవ్రదుమారం రేగింది. అయితే నాలుగు రోజుల కిందట దీపావళి శుభాకాంక్షలు చెప్పేందుకు కొండా దంపతులు స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా జరిగిన విషయాలను వివరించారు. ఈ వ్యవహారాన్ని ప్రతిపక్ష బీఆర్ఎస్ తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేసింది. సీఎంపై నేరుగా విమర్శలకు దిగింది.
కేబినెట్ భేటీ తర్వాత మంత్రి వివరణ
ఈ వ్యవహారంలో అర్థరాత్రి సుస్మిత హంగామా, మంత్రి సురేఖ తన ఓఎస్డీని కాపాడుతున్నారని ఆరోపణలు హల్‌చల్ చేశాయి. దీనిపై పార్టీ తెలంగాణ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌లతో చర్చించారు. ఆ తర్వాత ఆమె వెనక్కి తగ్గారు. ఆ ఎపిసోడ్‌లో అంశాలను చర్చించిన తర్వాత కేబినెట్ సమావేశంలో ఇదే అంశాన్ని చెప్పినట్టు సమాచారం. ఆ విషయాన్ని మీడియా ముఖంగా వెల్లడించారు.
గురువారం కేబినెట్ సమావేశం తర్వాత మిగతా మంత్రులతో కలిసి మీడియా ముందుకొచ్చారు కొండా సురేఖ. ఈ క్రమంలో సీఎం రేవంత్‌రెడ్డికు ఆమె క్షమాపణలు చెప్పారు. ఇదంతా టీ కప్పులో తుపానుగా వర్ణించారు. కుటుంబం అన్నాక సమస్యలు వస్తుంటాయి, పోతుంటాయని అన్నారు.
ALSO READ: రేవంత్ కేబినెట్ కీలక నిర్ణయాలు.. పంచాయతీ ఎన్నికలపై సంచలన ప్రకటన
కుటుంబంలో మాదిరిగా పార్టీలో మిస్‌అండర్ స్టాండింగ్ వల్ల చిన్నపాటి సమస్యలు వచ్చాయన్నారు. మా ఇంటికి పోలీసులు రావడంతో మా అమ్మాయి ఆవేశంలో ముఖ్యమంత్రిపై మాట్లాడిన విషయంలో తాను క్షమాపణలు చెబుతున్నట్లు వెల్లడించారు. ఈ వ్యవహారానికి ఫుల్‌స్టాప్ పడింది. ప్రభుత్వ వ్యవహారాలపై ఫోకస్ పెట్టాలని సీఎం రేవంత్ సూచన చేశారు. దీంతో అటవీ పర్యావరణ, దేవాదాయ శాఖలపై దృష్టి పెట్టనున్నారు మంత్రి సురేఖ.