MLA Bandla Krishna Mohan Reddy Joins Congress(Telangana news): బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్ గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ మేరకు జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకున్న ఆయన.. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్సీ సమక్షంలో హస్తం పార్టీ కండువా కప్పుకున్నారు.
కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ దూకుడుగా కొనసాగుతోంది. ఇప్పటికే ఎమ్మెల్యేలతోపాటు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరగా.. రేపు మరో నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని సమాచారం. కాగా.. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డితో కలిపి ఇప్పటివరకు ఏడుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. మరోవైపు ఎనిమిది మంది ఎమ్మెల్సీలు కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు.
అంతకుముందు గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డితోపాటు ముఖ్య అనుచరులు కూడా సీఎం ఇంటికి వచ్చారు. ఇప్పటికే తాను కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు గద్వాల ఎమ్మెల్యే అనుచరులతో వెల్లడించారు. అయితే కృష్ణమోహన్ రెడ్డి చేరికను గద్వాల జెడ్పీ చైర్‌పర్సన్ సరితా తిరుపతయ్య సహా పలువురు స్థానిక కాంగ్రెస్ నేతలు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చొరవ తీసుకొని సరితను సర్దిచెప్పారు. పార్టీలో ఆమెకు సముచిత స్థానం కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు.