Bharat Jodo Yatra : తెలంగాణ గొంతును అణిచిచేయడం ఎవరి తరం కాదన్నారు రాహుల్ గాంధీ. తెలంగాణ కలలను టీఆర్ఎస్ విచ్ఛిన్నం చేసిందని మండిపడ్డారు. రాష్ట్రంలో విద్య, వైద్య సౌకర్యాలు అధ్వాన్నంగా ఉన్నాయన్నారు. ప్రజల భూములపై టీఆర్ఎస్ సర్కారు పెత్తనం చేస్తోందని.. హక్కులను హరిస్తోందని తప్పుబట్టారు. తెలంగాణలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని.. ఇంజినీరింగ్ చదవాలంటే లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఈ పరిస్థితిని మారుస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. తెలంగాణలో భారత్ జోడో యాత్ర ముగింపు సందర్భంగా.. కామారెడ్డి జిల్లా మెనూరులో నిర్వహించిన బహిరంగా సభకు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
భారత్ జోడో యాత్రతో తనకు తెలంగాణ పూర్తిగా అర్థమైందని.. 12 రోజుల పాటు పాదయాత్ర చేసి ఇక్కడి ప్రజలతో మాట్లాడి.. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నానన్నారు రాహుల్ గాంధీ. అన్ని వర్గాల ప్రజలను కలుసుకుంటూ ముందుకు వెళ్లానని చెప్పారు. దెబ్బలు తగులుతున్నా కాంగ్రెస్ కార్యకర్తలు భయపడకుండా ఉత్సాహంగా పని చేస్తున్నారని.. ఏనాడూ వెనకడుగు వేయలేదని రాహుల్ కొనియాడారు. దేశానికి తెలంగాణ పాఠం చెప్పగలదని రాహుల్ గాంధీ అన్నారు.
అంతకుముందు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సైతం తెలంగాణ సర్కారు తీరుపై మండిపడ్డారు. తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు అవమానాలకు దోపిడీకి గురవుతున్నారని అన్నారు. ఏ ఆకాంక్షలతోనైతే ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నామో.. కేసీఆర్ పాలనలో ఆ ఆశలన్నీ గల్లంతయ్యాయని అన్నారు. అప్పటి తెలంగాణ ఉద్యమకారులంతా ఇప్పుడు ఎవరికి అమ్ముడు పోయారని నిలదీశారు. నెహ్రూ కుటుంబం మొదటినుంచీ ఆగర్భ శ్రీమంతులని.. ప్రస్తుతం ఢిల్లీలో ప్రభుత్వ భవనంలో అత్యంత నిరాడంబర జీవితం గడుపుతున్నారని.. అలాంటి గాంధీ ఫ్యామిలీపై అవినీతి ఆరోపణలు చేస్తే పురుగులు పడి చస్తారని.. వారిని ఎడమ కాలి చెప్పుతో కొట్టాలంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి.
ఇక తెలంగాణలో విజయవంతంగా ముగిసి మహారాష్ట్రలో ప్రవేశించింది భారత్ జోడో యాత్ర. అక్టోబర్ 23న తెలంగాణలో యాత్ర స్టార్ట్ కాగా.. నవంబర్ 7న మెనూరు దగ్గర భారీ బహిరంగ సభతో సమాప్తమైంది. తెలంగాణలో మొత్తం 375 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు రాహుల్ గాంధీ. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ప్రారంభించి.. 15 కిలోమీటర్లు నడిచే వారు. సాయంత్రం 4 గంటల నుంచి మరో 10 కిలోమీటర్లు యాత్ర సాగేది. రోజూ సాయంత్రం కార్నర్ సమావేశాలు జరిగేవి. ఇలా 17 అసెంబ్లీ నియోజక వర్గాల్లో, 7 పార్లమెంట్ స్థానాల మీదుగా భారత్ జోడో యాత్ర కొనసాగింది.
హైదరాబాద్ లోకి ఎంటర్ అయ్యాక యాత్రలో మరింత జోష్ వచ్చింది. నవంబర్ 1న చార్మినార్ దగ్గర జాతీయ జెండా ఆవిష్కరణతో ఆ ప్రాంతమంతా మువ్వన్నెల మయమైంది. నెక్లెస్ రోడ్ లో జరిగిన సభ గ్రాండ్ సక్సెస్ అయింది.
తెలంగాణ సమాజం రాహుల్ పాదయాత్రకు సంపూర్ణ మద్దతు పలికింది. యాత్ర పొడువునా.. సామాజిక సంఘాలు, ప్రజాస్వామిక వాదులు, రైతులు, మేధావులు, నిరుద్యోగులు, విద్యార్థులు, మహిళలు తదితర వర్గాలతో మాట్లాడుతూ వారి బాధలు వినేవారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఎక్కడికక్కడ విరుచుకుపడేవారు.
పాదయాత్రలో భాగంగా ప్రజలతో కలిసి క్రికెట్, ఫుట్ బాల్ ఆడటం, లంబాడీ నృత్యాలు చేయడం, చిన్నపిల్లలతో పరుగు పందెంలో పాల్గొనడం, కొరడాతో కొట్టుకోవడం లాంటి ఆసక్తికర అంశాలెన్నో జరిగాయి. అలా తెలంగాణలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర దిగ్విజయంగా ముగిసింది. యాత్ర విజయవంతం కావడంలో టీపీసీసీ, రేవంత్ రెడ్డిలది కీ రోల్.