Big Stories

Ippatam : పవన్ వర్సెస్ వైఎస్సార్.. రాజకీయ ఇప్పటం.. ఏది వాస్తవం?

Ippatam : ఇప్పటం. మొన్నటి వరకూ కొందరికే తెలుసు ఈ గ్రామం. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ పాపులర్. పవన్ కల్యాణ్ బస్తీ మే సవాల్ అనడంతో రాజకీయంగా హోరెత్తింది. జనసేనాని ఇప్పటం పర్యటన ప్రభంజనంలా సాగింది. కట్ చేస్తే.. పవన్ దూకుడును అదే స్థాయిలో న్యూట్రల్ చేసే ప్రయత్నం చేసింది ప్రభుత్వం. ఏ వైఎస్సార్ విగ్రహాన్నైతే చూపించి.. జగన్ ను జనసేనాని సవాల్ చేశారో.. ఇప్పుడు అదే వైఎస్సార్ విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించి పవన్ యాక్షన్ నకు అదే రేంజ్ లో రియాక్షన్ ఇచ్చారు. రోడ్డు వెడల్పు కోసం తండ్రి విగ్రహాన్నే తొలగించారనే మైలేజీని సొంతం చేసుకున్నారు జగన్.

- Advertisement -

ఇప్పటంలో వైఎస్సార్ విగ్రహాన్ని అధికారులు తొలగించడం మామూలు విషయమేమీ కాదు. తాడేపల్లి ప్యాలెస్ పర్మిషన్ లేకుండా.. స్థానిక అధికారులు ఇంతటి సాహసం చేశారని అనుకోలేం. పక్కాగా సీఎం జగన్ ఆఫీసు నుంచి ఆదేశాలు వస్తేనే.. వైఎస్సార్ విగ్రహం అక్కడి నుంచి కదిలించారని అంటున్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో.. వైఎస్సార్ విగ్రహాన్ని తొలగించి.. అభివృద్దే తమ ప్రధమ ప్రాధాన్యం అనేలా ప్రజల్లోకి పాజిటివ్ మెసేజ్ వెళ్లేలా చేశారని చెబుతున్నారు. మరి, వైఎస్సార్ విగ్రహం తరలించడం కేవలం ఇప్పటం రోడ్డు వెడల్పు కోసమేనా? లేక, పవన్ దూకుడుకు చెక్ పెట్టేందుకా? అనే చర్చ కూడా నడుస్తోంది.

- Advertisement -

ఇప్పటంలో అసలేం జరిగిందంటే..
వన్ మ్యాన్..ఆర్మీ షో తో ఇప్పటం హీరో అయ్యారు పవన్ కల్యాణ్. జనసేనాని గ్రామంలోకి రాకుండా పోలీసులు అడ్డుకోవడం.. పవన్ వారిపై వీర లెవెల్ లో విరుచుకుపడటం.. కారు మీద కూర్చొని సినిమాటిక్ గా షో చేయడం.. ఇప్పటంలో ఇళ్లు కూలిస్తే ఇడుపులపాయలో హైవే వేస్తామంటూ వార్నింగ్.. ఇలా ఓ రేంజ్ లో పాపులారిటీ వచ్చింది పవన్ కల్యాణ్ కి. రియల్ హీరో.. అంటూ పీకే ఆర్మీ సోషల్ మీడియాలో హోరెత్తించింది. అక్కడే ఓ ఆసక్తికర ఘటన.

ఇప్పటంలో కూల్చిన ఇళ్లను పవన్ పరిశీలిస్తుండగా.. ఆ పక్కనే రోడ్డుపై ఉన్న వైఎస్సార్ విగ్రహం జనసేనాని కంట పడింది. అదిగో.. రహదారిపై ఉన్న వైఎస్సార్ విగ్రహం అడ్డురాలేదు కానీ పేదల ఇళ్లే అడ్డొచ్చాయా? ఆ విగ్రహాన్ని ఎందుకు కూల్చలేదంటూ పవన్ గట్టిగా ప్రశ్నించారు. ఆ డైలాగ్ మీడియాలో బాగా వైరల్ అవడం.. ఆ విజువల్స్ చూసి పవన్ అడిగేది నిజమేగా? అంటూ ప్రజలు చర్చించుకోవడం.. సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు రావడంతో విషయం ప్రభుత్వ పెద్దల దృష్టికి వెళ్లింది. ఏ వైఎస్సార్ విగ్రహాన్ని అడ్డుగా చూపించి పవన్ కల్యాన్ పొలిటికల్ మైలేజ్ సాధించారో.. ఆ వైఎస్సార్ విగ్రహం అక్కడి లేకుండా చేసి నష్టనివారణ చర్యలు చేపట్టింది సర్కారు. ఇప్పటం రోడ్డుపై ఉన్న వైఎస్సార్ విగ్రహాన్ని క్రేన్ లతో తొలగించారు అధికారులు. అభివృధికి అడ్డుగా ఉంటే తన తండ్రి విగ్రహాన్నే తీసేయించారంటూ.. మా జగనన్న చాలా గ్రేట్ అంటూ.. వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో తెగ ప్రశంసిస్తున్నారు.

ఇప్పటం గ్రౌండ్ రియాలిటీ..!
మార్చి 14న జరిగిన జననేస ఆవిర్భావ సభకు ఇప్పటం గ్రామ ప్రజలు స్థలం ఇవ్వడం వల్లే.. రోడ్డు విస్తరణ సాకుతో ఇళ్లను కూల్చేస్తున్నారనేది జనసేనికుల ఆరోపణ. అందుకే, నేరుగా జనసేనానే రంగంలోకి దిగి.. ఇప్పటంలో బల ప్రదర్శనకు దిగారు. అయితే, ఇప్పటంలో రోడ్డు వెడల్పు కార్యక్రమం ఇప్పటిది కాదని.. గతంలోనే ఆ మేరకు అడుగులు పడ్డాయని చెబుతున్నారు. అటు మంగళగిరికి, ఇటు తాడేపల్లికి కనెక్ట్ చేస్తూ ఇప్పటం గ్రామాన్ని అభివృద్ధి చేయాలనేది ప్లాన్. గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే రోడ్ వైడెనింగ్ కు మార్కింగ్ చేశారు కానీ పనులు ప్రారంభం కాలేదు. వైసీపీ పాలనలో గత జనవరిలోనే ఇప్పటంలో రోడ్ల విస్తరణ పనులకు టెండర్లు పిలిచారని తెలుస్తోంది. అయితే, జనసేన సభ జరిగింది మార్చిలో. సో, సభకు స్థలం ఇచ్చారనే ప్రతీకారంతో ఇళ్లు కూల్చేయలేదనేది వైసీపీ వాదన.

కొన్ని ప్రహారీ గోడలు మాత్రమే కూల్చేశామని, ఒక్క ఇల్లు కూడా నేలమట్టం చేయలేదనేది అధికారుల మాట. ఇక జనసేన సానుభూతిపరుల ఇళ్లనే కూల్చేస్తున్నారనే ప్రచారంలోనూ నిజం లేదంటున్నారు. ఇప్పటంలో జనసేనకు చెందిన ఒకే ఒక వ్యక్తి కాంపౌండ్ వాల్ ను కూల్చేయగా.. అతను కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నాడు.

ఇప్పటం లాంటి చిన్న గ్రామంలో 120 అడుగుల రోడ్డు విస్తరణ చేయడమేంటనే ప్రశ్ననూ తప్పుబడుతున్నారు అధికారులు. ప్రస్తుత రోడ్డు 50 నుంచి 60 అడుగులు మాత్రమే ఉందని.. దానిని 75 నుంచి 80 అడుగుల వరకూ పెంచాలనే ఉద్దేశ్యంతోనే రోడ్డు వెడల్పు కార్యక్రమం చేపట్టామని చెబుతున్నారు. రోడ్ల విస్తరణ పనుల కోసం ఈ ఏడాది ఏప్రిల్, మే నెలలలోనే నోటీసులు ఇచ్చామని.. చట్టప్రకారమే కూల్చివేతలు చేస్తున్నామని సమర్థించుకుంటున్నారు. పవన్ కల్యాణ్ అనవసరంగా ఇష్యూ చేశారంటూ కొందరు స్థానికులు సైతం అంటున్నారు. నిజానిజాలు ఎలా ఉన్నా.. ఇప్పటం ఇప్పుడొక రాజకీయ క్రీడా వేదికగా మారిందనేది వాస్తవం.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News