Hydra :
ఆక్రమణలను వదలొద్దు
అక్రమ నిర్మాణాలు కూల్చివేయండి
సహకరించిన బీఆర్ఎస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోండి
అసెంబ్లీ సమావేశాల్లోగా చర్యలు తీసుకోండి
లేదంటే నేను అసెంబ్లీలో గళం విప్పుతా
హైడ్రాకు బీజేపీ ఎమ్మెల్యే ఫిర్యాదు
హైదరాబాద్, స్వేచ్ఛ : సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని ఏర్పాటు చేసిన హైడ్రా సత్ఫలితాన్ని ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ నగరంలోని అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని, ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలంటూ కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణా రెడ్డి హైడ్రాకు ఫిర్యాదు చేశారు. జీహెచ్‌ఎంసీ, రెరా, టీజీఐఐసీలలో కూడా ఆయన ఫిర్యాదులు చేశారు. మొత్తం 5 రియల్ ఎస్టేట్ కంపెనీలపై ఆయన ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఈ కంపెనీలు చెరువుల్లో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నాయన్నారు. ఈ ఐదు రియల్ ఎస్టేట్ కంపెనీలపై హైడ్రా చీఫ్ రంగనాథ్‌కు తాను ఫిర్యాదు చేశానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అనుమతులు ఉన్న నిర్మాణాలను ఏమీ చేయబోమని అధికారులు చెప్పారని, మరి ఆ అక్రమ నిర్మాణాలకు అనుమతిచ్చిన అధికారులు ఎవరని ఎమ్మెల్యే కాటిపల్లి ప్రశ్నించారు. అనుమతులు ఇచ్చిన అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన అడిగారు. రియల్ ఎస్టేట్ కంపెనీల ఆక్రమణలపై తాను మాట్లాడిన 10 రోజుల తర్వాత అధికారులు స్పందించారని, ఈ అంశంపై తాను ఇదివరకే మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించానని ప్రస్తావించారు.
ఎవరినీ వదలొద్దు – గత బీఆర్ఎస్ సర్కారులో చేపట్టిన అక్రమ నిర్మాణాలకు సహకారం అందించిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కాటిపల్లి కోరారు. తప్పు చేసిన అధికారులు, మంత్రులు ఎవరైనా శిక్షకు అర్హులేనని వ్యాఖ్యానించారు. భూకబ్జాల నివారణకు ప్రభుత్వం ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకురావాలని ఎమ్మెల్యే కాటిపల్లి కోరారు. ప్రభుత్వం నుంచి స్పందన రాకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తెలిపారు. రియల్ ఎస్టేట్ పడిపోతే వచ్చే నష్టం ఏమి లేదని ఆయన వ్యాఖ్యానించారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోగా అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని, వీలైనంత త్వరగా చర్యలు తీసుకోకుంటే ప్రస్తుత ప్రభుత్వానికి కూడా భాగస్వామ్యం ఉందని భావించాల్సి ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. చర్యలు తీసుకోకపోతే అసెంబ్లీ సమావేశాల్లో తాను గొంతెత్తుతానని ఆయన అన్నారు.