Loan Apps :
⦿ తీవ్రమవుతున్న లోన్ యాప్స్ ఆగడాలు
⦿ 2 వేల కోసం ప్రాణం తీసిన నిర్వాహకులు
⦿ డబ్బులు చెల్లించలేదని మార్ఫింగ్‌లు చేసిన వైనం
⦿ మనస్తాపానికి గురై ఉరేసుకున్న యువకుడు
⦿ నెల రోజుల క్రితమే వివాహం, ఇంతలోనే విషాదం
⦿ విశాఖపట్నంలోని మహారాణిపేటలో ఘటన
విశాఖపట్నం, స్వేచ్ఛ : లోన్ యాప్స్ ఆగడలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా నిర్వాహకులకు మాత్రం కళ్లెం పడట్లేదు. కేవలం రెండు వేల రూపాయల కోసం యాప్ నిర్వాహకులు నిండు ప్రాణాన్ని బలిగొన్నారు. విశాఖపట్నంలోని మహారాణిపేటకు చెందిన నరేంద్ర అనే యువకుడు లోన్ యాప్స్ ద్వారా అప్పు తీసుకున్నాడు. రెండు వేల రూపాయల మినహా తీసుకున్న అప్పు మొత్తం చెల్లించాడు. కానీ, ఆ రెండు వేల కోసమే నిర్వాహకులు వేధించడం మొదలు పెట్టారు. వరుస కాల్స్, మెసేజులు చేసి బెదిరించారు. డబ్బులు చెల్లించకపోతే మార్ఫింగ్ ఫోటోలు, వీడియోలను కుటుంబ సభ్యులు, బంధువులు, ఫోన్‌లో ఉన్న అందరికీ పంపిస్తామని బెదిరించి, నిమిషాల వ్యవధిలోనే అన్నంత పని చేసేశారు నిర్వహకులు. ఆఖరికి అతని భార్యకూ ఆ వీడియోలు వెళ్లాయి. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై కట్టుకున్న భార్యకు, బంధువులు, కుటుంబీకులకు మొహం చూపించలేక శనివారం అర్ధరాత్రి అందరూ నిద్రలో ఉండగా ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బాధితుడికి పెళ్లయ్యి నెల రోజులు కావొస్తోంది. ఈ క్రమంలోనే విషాద ఘటన జరగడంతో భార్య, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాధితుడి సెల్ ఫోన్ ఆధారంగా పోలీసులు విచారణ మొదలుపెట్టారు. మరోవైపు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడానికి ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు.
ALSO READ : లంచం లేకపోతే పెన్ను పెట్టదు.. అవినీతి అధికారిని దివ్య జ్యోతిపై ఏసీబీ ఫోకస్..