Mohan Babu: మోహన్ బాబు(Mohan Babu) ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ముఖ్యంగా తమకు, తమ కుటుంబానికి రక్షణ కావాలి అంటూ డీజీపీ, డీజీలను కలిసారు మంచు మనోజ్ (Manchu Manoj) దంపతులు.. అనంతరం ఇంట్లో ఉన్న ఏడు నెలల పాపను కలవడానికి ఇంటికి వచ్చారు. అదే సమయంలో మోహన్ బాబు సిబ్బంది వీరిని లోపలికి అనుమతించకుండా అడ్డుకోవడంతో మంచు మనోజ్ తన బౌన్సర్లతో గేట్లు బద్దలు కొట్టుకొని మరీ లోపలికి వెళ్లిపోయారు. ఇక లోపల ఏం జరుగుతోంది అని తెలుసుకోవడానికి మీడియా మిత్రులు లోపలికి వెళ్ళగా.. అక్కడికి వచ్చిన మోహన్ బాబు విచక్షణారహితంగా మీడియా మిత్రులపై దాడి చేశారు.
మోహన్ బాబు దాడిలో గాయపడ్డ మీడియా ప్రతినిధులు..
మీడియా మిత్రుల దగ్గర ఉన్న టీవీ మైక్ లాక్కొని మరీ వారి తల పగలగొట్టడమే కాకుండా కొంతమందిని గాయపరిచినట్లు తెలుస్తోంది. మోహన్ బాబు మీడియా ప్రతినిధిపై చేసిన దాడిలో ఇద్దరికీ గాయాలవ్వగా, వారిద్దరికీ తల, చెవి దగ్గర తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. దీంతో వారిద్దరినీ ఆసుపత్రికి తరలించారు. అంతేకాదు వారిద్దరూ కూడా మోహన్ బాబు తమను చంపేందుకు ప్రయత్నించారని, పోలీసులకు వాంగ్మూలం కూడా ఇచ్చినట్లు సమాచారం. మోహన్ బాబు కారణంగా తమ ప్రాణానికి గండం ఉందని కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మోహన్ బాబు పై మండిపడుతున్న జర్నలిస్టు సంఘాలు..
ఇకపోతే మీడియా మిత్రులపై దాడి చేయడంతో జర్నలిస్ట్ సంఘాలు మోహన్ బాబు పై మండిపడుతున్నాయి. అంతేకాదు మోహన్ బాబు పై హత్యాయత్నం కేసు కింద అరెస్టు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఇక దీంతో కుటుంబంలో జరుగుతున్న వివాదంపై ఆవేశపడి మీడియాపై దాడి చేయడం, తన కుమార్తె కోసం ఇంటికి వచ్చిన మంచు మనోజ్ దంపతులపైన దాడి చేయడంతో ఆయనను ఎప్పుడైనా సరే పోలీసులు అరెస్టు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మనోజ్ పై విష్ణు బౌన్సర్లు దాడి..
ఇదిలా ఉండగా మోహన్ బాబు గొడవ సమయంలో తన దగ్గర ఉన్న లైసెన్స్డ్ గన్ బయటకు తీయడంతో ఈ గన్ను కారణంగా ఎవరికైనా ప్రమాదం పొంచి ఉందని భావించిన పోలీసులు, వెంటనే మోహన్ బాబు దగ్గర ఉన్న గన్ లైసెన్స్ ను రద్దు చేసి, ఆ గన్ ను సీజ్ చేశారు. దీనికి తోడు పాప కోసం మంచు మనోజ్ ఆయన భార్య మౌనిక లోపలికి వెళ్తే విష్ణు (Manchu Vishnu)బౌన్సర్లు వారిపై దాడి చేశారు. ఆయన చొక్కా చింపి బయటకు పంపించారు. ఏడు నెలల మనోజ్ కుమార్తె ఇంట్లో ఉన్నా.. ఆమెను చూడనివ్వకుండా దాడి చేసి పంపించేసారని మనోజ్ కూడా వాపోతున్నారు.
అంతా కుమ్మక్కయ్యారా..
ఇదిలా ఉండగా మోహన్ బాబు ఇంటివద్ద అటు మనోజ్ ఇటు విష్ణు బౌన్సర్లు పెద్ద ఎత్తున మోహరించినా పోలీసులు మాత్రం పెద్దగా పట్టించుకోకపోవడం ఇక్కడ వివాదాస్పదంగా మారింది. ఉదయం పోలీసులు మనోజ్ కి చెందిన బౌన్సర్లను పంపించారు. కానీ విష్ణు తెచ్చిన బౌసర్లను మాత్రం పంపించలేదు. దీంతో వీరంతా కలిసి మీడియాపై, మనోజ్ పై దాడి చేశారు. ఇక మనోజ్ కూడా పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ,కొన్ని గంటల క్రితం వాపోయిన విషయం తెలిసిందే. మరి ఏం జరుగుతుందో తెలియాల్సి ఉంది.