
BJP news Telangana(TS Politics):
తెలంగాణలో ఎన్నికల వేళ దళిత్ దంగల్ నడుస్తున్నట్టు కనిపిస్తున్నాయి పరిస్థితులు. బీఆర్‌ఎస్ దళిత బంధు పథకంతో దళితులను ఆదుకున్నామంటూ చెబుతుండగా.. బీజేపీ మాత్రం దళిత ఓటర్లను.. ముఖ్యంగా మాదిగ ఓటర్లపై తమ కాన్సన్‌ట్రేషన్ చేసినట్టు కనిపిస్తోంది. ఇప్పటికే ప్రధాని నరేంద్రమోదీ భాగ్యనగరంలో విశ్వరూప మహాసభ వేదికగా ఎస్సీ వర్గీకరణపై హామీ ఇచ్చారు. శనివారం బీజేపీ మేనిఫెస్టో విడుదల కార్యక్రమానికి ఎమ్మార్పీఎస్ చీఫ్ మందకృష్ణ మాదిగ హాజరుకానున్నారు. ఆ తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా MRPS నేతలతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు.
బీసీ సీఎం అంటూ ఇప్పటికే బీసీ ఉపకులాలకు గాలం వేసింది బీజేపీ. ఇప్పుడు వర్గీకరణకు సై అంటూ మాదిగ వర్గం ఓట్లను గంపగుత్తగా తమవైపు తిప్పుకోవాలని చూస్తోంది. అందుకే ఆ వర్గం ఓట్లను టార్గెట్ చేస్తూ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణను ప్రచార బరిలో దింపుతోంది. బీజేపీ మేనిఫెస్టో విడుదల తర్వాత మందకృష్ణ సభలు మొదలవుతాయని తెలుస్తోంది. అయితే వర్గీకరణపై బీజేపీ మేనిఫెస్టోలో క్లారిటీ ఉంటుందా? లేదా? అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.
తెలంగాణలో మాదిగ వర్గం ఓట్లు అధిక సంఖ్యలో ఉన్నాయి. ఎస్సీ రిజర్వ్ డ్ నియోజకవర్గాల్లోనే కాకుండా జనరల్ సీట్లలో సైతం వారి భాగస్వామ్యం ఎక్కువగా ఉంది. అందుకే బీజేపీ వారి ఓట్లకు గాలం వేస్తోంది. వర్గీకరణకు మోదీ ఒప్పుకున్నారు కాబట్టి.. మందకృష్ణ కూడా తమ మద్దతు బీజేపీకేనని అదే వేదికపై చెప్పారు. తమలో ఎవరెవరు ఏ పార్టీలో ఉన్నా కూడా ఈసారి బీజేపీకే ఓటు వేస్తామన్నారు.
అయితే మందకృష్ణ తీరుపై దళిత వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అంతేకాదు ఈ ప్రయత్నాలన్నీ కాంగ్రెస్ పార్టీకి మాదిగల ఓట్లను దూరం చేసే కుట్రలో భాగమేనని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మోడీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ తొమ్మిదేళ్లలో ఇప్పటి వరకూ వర్గీకరణ ఎందుకు చేయలేదని ప్రశ్నిస్తున్నారు.