BJP Target On Telangana: బీజేపీ హైకమాండ్ తెలంగాణపై ఫోకస్ చేసింది. ఈనెలారులోగా కొత్త అధ్యక్షుడ్ని ప్రకటించాలని నిర్ణయించింది. రేపో మాపో పార్టీ పరిశీలకులు ఢిల్లీ నుంచి తెలంగాణకు రానున్నారు. 2029 ఎన్నికల్లో తెలంగాణలో కాషాయి జెండా ఎగురవేయాలనేది కమలనాథుల ఆలోచన. అందుకు సంబంధించి అన్ని అస్త్రాలను సిద్ధం చేస్తోంది. మరి బీజేపీ సింగిల్ గా వెళ్తుందా? లేకుంటే టీడీపీ-జనసేనతో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.
ఢిల్లీలో విజయం సాధించడంతో ఫుల్‌జోష్‌లో ఉంది బీజేపీ. ఈ నేపథ్యంలో తెలంగాణలో మెల్లగా పావులు కదుపుతోంది. 2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణపై ఫోకస్ చేసింది. అందుకు ఇప్పటి నుంచే వ్యూహాలు రచించే పనిలో నిమగ్నమైంది. తెలంగాణలో పార్టీ బలాబలాల గురించి డీటేల్స్ తెప్పించుకుందని సమాచారం.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ దెబ్బకు డీలా పడింది బీఆర్ఎస్ పార్టీ. ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కనీసం ఖాతా తెరవలేదు. రెండు దశాబ్దాల తర్వాత పార్లమెంటులో ఆ పార్టీకి స్థానం లేకుండా పోయింది. అయినప్పటికీ తాము బలంగా ఉన్నామంటూ మీడియా ముందు ఆ పార్టీ నేతలు ఒకటే రీసౌండ్. మరి ఏమనుకుందో తెలీదుగానీ త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. కీలక నేతలకు కేసులు వెంటాడుతున్నాయి. ఏం చెయ్యాలో తెలియక కేడర్ దిక్కు తోచని పరిస్థితిలో ఉంది.
ఇక బీజేపీ.. మూడు అడుగులు ముందుకు.. నాలుగు అడుగులు వెనక్కి అన్నచందంగా మారింది. బీఆర్ఎస్ లోటును అంది పుచ్చుకోలేక పోతోంది. సింపుల్‌గా చెప్పాలంటే తెలంగాణలో రాజకీయ శూన్యత కనిపిస్తోంది. సరైన ప్రతిపక్ష లేకుండా పోయింది. ఆ లోటును భర్తీ చేసుకోవాలనే పనిలో నిమగ్నమైంది బీజేపీ. అందుకోసం ఇప్పటి నుంచే వ్యూహాలను రచిస్తోంది.
ALSO READ: బీజేపీ చీఫ్‌పై సస్పెన్స్.. పోటీలో ఆ నలుగురు!
తెలంగాణ బీజేపీ నుంచి హైకమాండ్‌కు నివేదిక చేరిందట. వచ్చే ఎన్నికలకు సింగిల్‌గా వెళ్లేకంటే రెండు లేదా మూడు పార్టీలతో కలిసి వెళ్తే వచ్చే ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయన్నది ప్రధాన పాయింట్. టీడీపీ గురించి ఎలాగూ తెల్సిందే. ఆ పార్టీకి నగరాలతోపాటు రూరల్‌లోనూ బలమైన కేడర్ ఉంది. టీడీపీ బరిలో ఉంటే బీఆర్ఎస్ ఖాళీ అవ్వడం ఖాయమనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది.
జనసేన కూడా ఇప్పుడిప్పుడే యాక్టివ్ అవుతోంది. పవన్ పంచ్ డైలాగ్స్ ఆ పార్టీ ప్రధాన ఆకర్షణ. రెండురోజుల కిందట తెలంగాణ ఎన్నికల కమిషనర్ జనసేనకు గాజు గ్లాసు గుర్తు కేటాయించారు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల బరిలో దిగాలని ప్లాన్ చేస్తోంది.
కొద్దిరోజులుగా టీడీపీ-జననేన యాక్టివ్ వెనుక బీజేపీ ఉందనే వాదన సైతం లేకపోలేదు. ఢిల్లీ నుంచి వచ్చిన సంకేతాల ప్రకారం ఈ రెండు పార్టీలు తెలంగాణలో వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్నాయి. ఓ వైపు బీజేపీ, మరోవైపు టీడీపీ, జనసేన పార్టీలు యాక్టివ్ అయినట్టే కనిపిస్తున్నాయి.
2014 ఎన్నికల్లో ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేశాయి. అప్పుడు పవన్ ప్రచారానికి పరిమితమయ్యారు. ఈసారి కొన్ని సీట్లలో పోటీ చేయాలన్నది ఆ పార్టీలో కొందరు నేతల మాట. మొత్తానికి రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాలు ఇంకెన్ని మలుపులు తిరుగుతాయో చూడాలి.