BJP District President Elections: రాష్ట్ర బీజేపీ సంస్థాగతంగా సవాలక్ష సమస్యలతో సతమతం అవుతుంది. కొత్త పాత నేతల పంచాయితీలు, పార్టీ రాష్ట్ర నాయకత్వానికి, శాసనసభాపక్షానికి ఉన్న గ్యాప్.. ఎమ్మెల్యేల తలోదారి.. అన్ని స్థాయిల్లో నేతల మధ్య సమన్వయ లోపం. ఇన్ని తలనొప్పుల మధ్య సంస్థాగతంగా బలోపేతంపై దృష్టి పెట్టలేకపోతోంది.19 జిల్లాల అధ్యక్షుల ప్రకటనకే నానా తంటాలు పడిన కాషాయపార్టీ.. ఇంకా 19 జిల్లాలకు ప్రెసిడెంట్లను పెండింగ్లో పెట్టింది. ఇక రాష్ట్ర అధ్యక్షుడి పీటముడి ఎంతకీ తెగడం లేదు. లక్ష్యాలు ఘనంగా పెట్టుకున్న ఆ పార్టీ ఈ పరిస్థితులను అధిగమిస్తుందా?
తెలంగాణలో బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ చివరి దశకు చేరుకుంది అంటున్నారు కాని ఒక కొలిక్కి రావడం లేదు. ఆ క్రమంలో వేసవి రానే లేదు బీజేపీలో మాత్రం అంతర్గత సమస్యలతో వేడి పెరిగిపోతోంది. నేతల పంచాయితీల మధ్య గత ఆరు నెలల నుంచి సంస్థాగతంగా ఎన్నికలు నిర్వహిస్తూనే ఉన్నారు. పోలింగ్ బూత్ నుంచి జాతీయ స్థాయి వరకు అధ్యక్షుల ఎన్నిక ప్రక్రియలో భాగంగా బీజేపీ రాష్ట్రంలో ఆయా జిల్లాల అధ్యక్షుల నియామకంపై కసరత్తులు చేస్తోంది. ఇప్పటికే 19 జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించిన కాషాయ పార్టీ మరో 19 జిల్లాల అధ్యక్షుల ఎంపికపై మల్లగుల్లాలు పడుతోంది.
బీజేపీకి సంస్థాగతంగా 38 జిల్లాలు ఉండగా 19జిల్లాలకు నానా పాట్లు పడి అధ్యక్షులను ప్రకటించింది. మరో 19 జిల్లాల అధ్యక్షులను పెండింగ్‌లో పెట్టింది. ప్రకటించిన అధ్యక్షులపై కూడా కొన్ని చోట్ల వ్యతిరేకత వ్యక్తమవుతుంది. తొలుత 38 జిల్లాలకు అధ్యక్షులను ఒకేసారి ప్రకటించాలని భావించినప్పటికీ నేతల మధ్య ఉన్న విభేదాలు రచ్చ రేపుతుండటంతో ఆయా నేతల ఒత్తిళ్లతో పూర్తిస్థాయిలో అధ్యక్షులను ప్రకటించలేకపోయింది.
జిల్లా అధ్యక్షుల నియామకంలో సామాజిక సమీకరణాల లెక్కల ప్రకారమే అధ్యక్షులను ఎంపిక చేశామని, 19 జిల్లాల అధ్యక్షుల ప్రకటనతో రాష్ర్ట అధ్యక్షుడిని ఎన్నికునేందుకు అర్హత సాధించిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో ఈ నెల 15 కల్లా నూతన రాష్ర్ట అధ్యక్షుడిని ప్రకటించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. మూడేళ్లకు ఒకసారి జరిగే బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ తుది అంకానికి చేరుకున్నప్పటికీ, రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికలో మాత్రం సస్పెన్స్ కొనసాగుతోంది.
ఇక పార్టీ శ్రేణులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న జిల్లా అధ్యక్షులను రాష్ర్ట ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎండల లక్ష్మీనారాయణ ఆదేశానుసారం, ఎన్నికల రిటర్నింగ్ సహాయ అధికారులు19 జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించారు.మరో ఎనిమిది స్థానాలను ఒకటి రెండు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది మిగతా 11 జిల్లా అధ్యక్షులను రాష్ర్ట అధ్యక్షుడి ఎన్నిక తరువాతే నియమిస్తారనే ప్రచారం జరుగుతుంది.
బీజేపీ అంటే అగ్రవర్ణాల పార్టీ అనే ముద్ర ఉంది. ఆ ముద్రను చెరిపివేసుకునేందుకు జాతీయ నాయకత్వం ప్రయత్నిస్తోంది. గత ఎన్నికల్లో బీసీ ముఖ్యమంత్రి నినాదంతో ఎన్నికల బరిలో దిగినా ఆ పార్టీకి ఫలితం దక్కలేదు. ఆ క్రమంలో పోలింగ్ బూత్ అధ్యక్షుడి నుంచి జాతీయ అధ్యక్షుడి వరకు అన్ని వర్గాలకు కమిటీల్లో సముచిత స్థానం కల్పించింది. 19 జిల్లా అధ్యక్షుల్లో బీసీలకు 12, ఒసీలకు 6, ఎస్సీలకు ఒకటి కేటాయించింది. బీసీల్లో 4 మున్నూరు కాపు, గౌడ వర్గానికి 3, ముదిరాజ్, బోయ, మరాఠా, విశ్వబ్రాహ్మణ, నాయి బ్రాహ్మణ వర్గాలకు ఒక్కొక్కటి చొప్పున కేటాయించింది.
అయితే మరోపక్క ప్రకటించిన 19 జిల్లాల అధ్యక్షులలో యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన వారు ఎవరు లేకపోవడంతో ఆ సామాజిక వర్గానికి చెందిన వారంతా బీజేపీ పై గుర్రుగా ఉన్నారు. గత వారం నుంచి బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడిస్తూ, నిరసనలు తెలుపుతున్నారు, యాదవ సామాజిక వర్గం బీజేపీ రాష్ట్ర నాయకత్వ తీరుపై మండి పడుతున్నారు. యాదవ సామాజిక వర్గమే కాదు అధ్యక్షులను ప్రకటించిన జిల్లాల్లో కూడా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి, నిజామాబాద్, వరంగల్, హన్మకొండ, నల్లగొండ, సెంట్రల్ హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో పార్టీ నిర్ణయాలపై అసహనం వ్యక్తమవుతుంది. పార్టీకోసం పనిచేస్తున్న వారికి కాకుండా షో పుటప్ రికమండేషన్ బ్యాచ్ కు పదవులు కట్టబెట్టారనే చర్చ ఆ పార్టీ వర్గాల్లోనే జోరుగా సాగుతోంది.
అంతేకాదు మహిళలకు 33 శాతం రిజర్వేషన్, మహిళలకు పెద్దపీట అంటూ ప్రచారం చేసుకుంటున్న బీజేపీ జిల్లాల అధ్యక్షుల నియామకాల్లో ఎక్కడ కూడా మహిళలకు అవకాశం ఇవ్వలేదు. రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికకు అర్హత సాధించామని చెప్పుకున్న రాష్ట్ర నాయకత్వంపై పార్టీ మహిళా నేతలు తీవ్ర అసంతృప్తితో కనిపిస్తున్నారు. మిగతా 19 జిల్లాల్లో అయిన మహిళలకు అవకాశం ఇస్తారా లేదా అనేది క్లారిటీ లేదు. ఇటు మహిళలకు, అటు కీలక సామాజిక వర్గాలకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం మొండి చేయి చూపిస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Also Read: టీ – కాంగ్రెస్ అలర్ట్.. అసలు పార్టీలో ఏం జరుగుతోంది..?
పదవులన్ని రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో బేరసారాలకు పెడుతున్నారనే కామెంట్లు సైతం బలంగా వినిపిస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా టికెట్ల కేటాయింపు సందర్భంగా ఇలాంటి విమర్శలే వినిపించాయి. నేరుగా పార్టీ కార్యాలయం ముందే సీట్లు అమ్ముకున్నారని ధర్నాకు దిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా కూడా పోలింగ్ బూత్ నుంచి జిల్లాల అధ్యక్షుల ఎంపిక అంశంలో అదే సీన్ రిపీట్ అవుతుంది. ఇక జిల్లా అధ్యక్షుల నియామక పంచాయితీ ఒకవైపు కొనసాగుతుండగానే రాష్ర్ట అధ్యక్షుడి ఎన్నికపై చర్చ మొదలైంది. ఈ నెల 15 కల్లా నూతన అధ్యక్షుడిని ప్రకటించినున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇప్పటికే అధ్యక్ష రేసులో ముదిరాజ్ వర్గానికి చెందిన ఎంపీ ఈటల రాజేందర్ పేరు బలంగా వినిపిస్తోంది. బీజేపీ రాష్ట్రంలో బీసీ ఫార్ములాతో ముందుకు వెళ్తున్న నేపధ్యంలో తెలంగాణ ఉద్యమ కారుడు, బీసీ సామజిక నేత ఈటల రాజేందర్ వైపుకే అధిష్టానం మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు ధర్మపురి ఆర్వింద్, రాంచందర్‌రావులు రాష్ట్ర పార్టీ పగ్గాల కోసం ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. పాత, కొత్త అనే విభేదాలు రచ్చ రెపుతుందటంతో అధిష్ఠానం మరికొంత మంది పేర్లను కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో అధ్యక్ష పదవి రేసులోకి కొత్తపేర్లు వచ్చాయి.
అనూహ్యంగా మురళీధర్ రావు, డీకే అరుణ పేర్లు వినిపిస్తున్నాయి. ఈ ఇద్ధరిలో ఎవ్వరికో ఒక్కరికి అధ్యక్ష పదవి దక్కితే బీసీలకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చే యోచనలో అధిష్టానం ఆలోచిస్తున్నాట్టు చర్చ జరుగుతోంది. రాష్ర్టశాసన సభ ఫ్లోర్ లీడర్ గా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఉండటంతో. అధ్యక్ష పదవి రెడ్డి లేదా వెలమకు దక్కితే బీసీల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది కాబట్టి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని అధిష్టానం తెరపైకి తెస్తోందంట. బీసీలకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కట్టబెట్టి, అధ్యక్ష పదవి రెడ్డి లేదా వెలమ సామాజిక వర్గానికి ఇస్తే పొలిటికల్ ఈక్వేషన్లు ఎలా ఉంటాయనే దానిపై అధిష్టానం ఫోకస్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఒకవేళ అదే జరిగితే ఈటల లేదా ధర్మపురి ఆర్వింద్‌లో ఒక్కరికి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి దక్కే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ బీసీకి అధ్యక్ష పదవి దక్కితే వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రస్తావన లేనట్లేనని కాషాయ పార్టీ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. మొత్తం మీద పోలింగ్ బూత్ నుంచి రాష్ర్ట స్థాయి వరకు అధ్యక్షులను ఎంపిక చేయడానికే సంస్థాగతంగా అధిష్ఠానం తలలు పట్టుకుంటుంది. నేతల తీరు, సామాజిక వర్గాల ఈక్వేషన్స్ అర్థంకాక తర్జన భర్జన పడుతోంది. ప్రకటించిన 19 మంది అధ్యక్షుల పైన కూడా తీవ్ర అసంతృప్తి, నిరసనలు వెల్లువెత్తుతున్న నేపధ్యంలో రేపు ప్రకటించబోయే రాష్ట్ర అధ్యక్షుడి విషయంలో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తి రేపుతోంది.