కవిత దూకుడు మీద ఉన్నారు. తమ కొత్త పార్టీ రాబోతున్నదని, కొత్త చరిత్ర సృష్టిస్తామని ఆమె గొప్పగా చెప్పుకుంటున్నారు. అధికార పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు. బీజేపీని కూడా వదలడం లేదు. చాన్సు దొరికినప్పుడల్లా ప్రెస్ మీట్లు పెట్టడం.. తను ఈ నెల 25న పెట్టబోయే కొత్త పార్టీ గురించి హైప్ క్రియేట్ చేసుకోవడం నడుస్తూ వస్తున్నది. ఇంకా ఆమె పార్టీ పెట్టకముందే తీన్మార్ మల్లన్నకు చెందిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ మాటల దాడికి దిగింది. కవిత పెట్టబోయే పార్టీలో రెడ్లు, వెలమలు మాత్రమే చేరుతారని ప్రచారం చేయిస్తున్నది.
కవిత తన రాజకీయ పార్టీ ఎజెండాలో బీసీల రిజర్వేషన్ల అంశం కూడా ప్రధానంగా పెట్టుకున్నారు. పలు మార్లు ఈ అంశంపై నిరసనలు, ఆందోళనలు కూడా చేశారు. తీన్మార్ మల్లన్న పార్టీ కూడా ప్రధానంగా బీసీల నినాదాన్నే ఎత్తుకుని స్థాపించబడిన పార్టీ. కానీ తీన్మార్ మల్లన్న పార్టీ ఏర్పాటు తరువాత కూడా పెద్దగా జనాల్లో ప్రభావం చూపలేకపోయింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసినా, మున్సిపాలిటీలలో కూడా అక్కడక్కడ ఉనికి చాటుకునే ప్రయత్నం చేసినా ఉపయోగం లేకుండా పోయింది.
ఇప్పుడు కొత్తగా వచ్చే కవిత పెట్టబోయే రాజకీయ పార్టీని టార్గెట్ చేయడం మూలంగా మా పార్టీనే బీసీల పార్టీ అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నది. కవిత పార్టీలో రెడ్లు, వెలమలు చేరుతారని ప్రచారం చేస్తున్నారు సోషల్ మీడియా వేదికగా. గతంలో కూడా ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడైన తీన్మార్ మల్లన్న కవితను ఇదే విషయంపై టార్గెట్ చేసి మాట్లాడాడు. అసలు బీసీల కోసం మాట్లాడేందుకు నువ్వెవరు? మాతో మీకు మంచం పొత్తా? కంచం పొత్తా?? అని కామెంట్ చేయడం తీవ్ర కలకలం రేపింది.
జాగృతి నాయకులు మల్లన్న పార్టీ కార్యాలయంపై దాడి చేశారు. కవిత కూడా ఈ విషయంలో తీవ్రంగా స్పందించారు. నాతో పెట్టుకోకు అగ్గిరవ్వనై కాల్చేస్తానని వార్నింగ్ కూడా ఇచ్చారు. ఆ తరువాత ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోలేదు. ఎవరి పని వారు చేసుకుంటున్నారు. కవిత రాజకీయాల్లో ఇంకా చాలా బిజీ అయ్యారు. ఆమె కొత్త పార్టీ ఏర్పాటుపై జనాల్లో చర్చకు వచ్చేలా ఎప్పటికప్పుడు రాజకీయంగా అడుగులు వేస్తున్నారు.
ఈ క్రమంలో మళ్లీ తీన్మార్ మల్లన్న పార్టీ నుంచి మాటల దాడి మొదలైంది. ఆ పార్టీ బీసీల పార్టీ కాదని, ఓసీల పార్టీ అని ప్రచారం చేస్తున్నారు.