Auto Workers: ఆటో కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మేడ్చల్లో ఆటో ర్యాలీలు నిర్వహించారు. మేడ్చల్‌లోని 297, 298 డివిజన్లలో అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి అత్వెల్లి వరకు ర్యాలీ నిర్వహించగా, ఎల్లంపేట్ మున్సిపాలిటీ పరిధిలో దబిల్‌పూర్ నుంచి నూతన్‌కల్ వరకు ఆటో ర్యాలీ చేపట్టారు. పెద్ద సంఖ్యలో ఆటో కార్మికులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా మాజీ కోప్షన్ మెంబర్ నవీన్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటో కార్మికులకు సంవత్సరానికి రూ.12 వేల ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చిందన్నారు. రెండు సంవత్సరాలు గడిచినా హామీ మేరకు ఆర్థిక సహాయం అందలేదని ఆరోపించారు. ఒక్కో ఆటో కార్మికుడికి రెండేళ్లకు కలిపి రూ.24 వేల బకాయి ఉందని, వెంటనే ఆ మొత్తాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మాజీ గ్రంథాలయ చైర్మన్ భాస్కర్ యాదవ్ మాట్లాడుతూ.. ఆటో కార్మికుల సంక్షేమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు. పెరుగుతున్న ఇంధన ధరలు, వాహన నిర్వహణ ఖర్చులతో ఆటో కార్మికులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుని ప్రతి ఆటో కార్మికుడికి రావాల్సిన రూ.24 వేల బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
Also read: సంగీత్ శోభన్ ‘అంతా రాములోరు చూస్కుంటారు’ గ్లింప్స్ రిలీజ్!
ఎల్లంపేట్ మున్సిపాలిటీ పరిధిలో చైర్‌పర్సన్ శ్రీదేవి రమేష్ ఆధ్వర్యంలో దబిల్‌పూర్ నుంచి నూతన్‌కల్ వరకు ఆటో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీదేవి రమేష్ మాట్లాడుతూ.. ఆటో కార్మికులకు ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సంవత్సరానికి రూ.12 వేల చొప్పున రెండేళ్లకు రూ.24 వేల ఆర్థిక సహాయం అందించి ఆటో కార్మికులను ఆదుకోవాలని కోరారు.ఆటో కార్మికుల సమస్యల పరిష్కారం కోసం బీఆర్‌ఎస్ నిరంతరం పోరాడుతుందని, ప్రభుత్వం స్పందించి బకాయిలను వెంటనే విడుదల చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. కార్యక్రమాల్లో BRS నాయకులు సందీప్ గౌడ్,నాగరాజు, శైలేందర్, శేఖర్ రెడ్డి,రఘుపతి రెడ్డి, ప్రభాకర్,శంకర్,నర్సింగ్ గౌడ్,రాజు,బాలు , పాల్గొన్నారు.
Also read: తెలంగాణలో ఆయిల్ పామ్ సాగు జోరు.. లక్ష్యాన్ని మించిన దరఖాస్తులు.. ఎన్నో తెలుసా..!