Oil Palm: రాష్ట్రంలో సాంప్రదాయ పంటలకు స్వస్తి పలుకుతూ రైతన్నలు వాణిజ్య పంటల వైపు వేగంగా అడుగులు వేస్తున్నారు. తక్కువ పెట్టుబడి, స్థిరమైన ఆదాయం అందించే ‘ఆయిల్ పామ్’ సాగుపై తెలంగాణ వ్యాప్తంగా ఆసక్తి రెట్టింపు అయింది. ఈ ఏడాది ప్రభుత్వం నిర్ణయించిన లక్ష్యాన్ని మించి రైతులు ముందుకు రావడం వ్యవసాయ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయిల్ ఫాంపై ప్రత్యేక దృష్టిసారించింది. రైతులకు మొక్కలతో పాటు ప్రోత్సాహకాలు సైతం అందజేస్తుండటం, సాగుపై అవగాహన సైతం కల్పిస్తుండటంతో ఆసక్తి చూపుతున్నారు. ఈ ఏడాది 85 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగును విస్తరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా, ఆన్‌లైన్ నమోదులో అనూహ్య స్పందన లభించింది. ఏకంగా 1,10,000 ఎకరాల్లో సాగు చేస్తామంటూ రైతులు దరఖాస్తు చేసుకున్నారు. నమోదు చేసుకున్న భూముల్లో 88,000 ఎకరాలను అధికారులు ఇప్పటికే క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేసి, సాగుకు యోగ్యమైనవిగా ధ్రువీకరించారు. అంతేకాదు 65,350 ఎకరాలకు పరిపాలన అనుమతులు కూడా ఇచ్చారు. నర్సరీ ట్యాగింగ్ ను సైతం 51,852 ఎకరాల్లో కంప్లీట్ ను అధికారులు చేశారు. 26,702 ఎకరాల్లో మొక్కల నాటడం సైతం పూర్తి చేశారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగుకు భారీగా ప్రోత్సాహకాలు అందించింది. సబ్సిడీపై మొక్కలు, డ్రిప్ పరికరాల పంపిణీతో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత ఆయిల్ ఫాం సాకుకు ప్రోత్సాహాలను ప్రభుత్వం పెంచింది. దీంతో తెలంగాణలో ఇప్పటివరకు ఏకంగా 2.91 లక్షల ఎకరాల్లో కొత్తగా ఆయిల్ పామ్ సాగు ప్రారంభం కావడం ఒక రికార్డు. ఆయిల్ ఫాం సాగును1992లో స్టార్ట్ చేయగా 2021 వరకు కేవలం 40వేల ఎకరాల్లో మాత్రం సాగు చేసేందుకు రైతులు ముందుకు వచ్చారు. కేవలం 2021 నుంచి ఈ నెల3 వరకు(2026) 2లక్షల ఎకరాలకు పైగా సాగైనట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 33 జిల్లాలకు గాను 31 జిల్లాల్లో ఈ పంట ను సాగుచేసేందుకు రైతులు ముందుకు వస్తున్నారు. ఎకరా సాగుకు 46,250 రాయితీని ప్రభుత్వం ఇస్తుంది. సాగులో అంతర్ పంటల సాగు, డ్రిప్ నకు ఆర్ధికసహకారం అందజేస్తుంది.
Also read: ఈవీని ప్రతిసారి 100% ఛార్జ్ చేయడం మంచిదేనా? ఈ తప్పు అస్సలు చేయకండి!
ఆయిల్ ఫాం సాగుల్లో రాష్ట్రంలోనేభద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రథమస్థానంలో ఉంది. 92,525 ఎకరాల్లో రైతులు సాగు చేశారు. రెండో స్థానంలో ఖమ్మం జిల్లా నిలిచింది. 49,993 ఎకరాల్లో రైతులు సాగుచేశారు. మూడోస్థానంలో నల్లగొండ జిల్లాలో 16,336 ఎకరాలు, సిద్దిపేట జిల్లాలో 16316 ఎకరాల్లో సాగు చేశారు. రాష్ట్రంలో మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో, ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలో కలిపి సాగవుతున్న 31 జిల్లాల్లో 3,17,747 ఎకరాల్లో ఆయిల్ ఫాం తోటలను రైతులు పెంచుతున్నారు. టన్నుకు 25వేలకు పైగా మద్దతు ధర వస్తుండటంతో రైతులు సాకుకు ఆసక్తి చూపుతున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో కోతుల బెడద ప్రధాన సమస్య గా మారింది. ఏ పంట సాగుచేసినా వాటితో నాశనం అవుతుంది. దీనికి తోడు అడవి పందుల బెడత సైతం ఉండదు. దీంతో రైతులు ఆయిల్ ఫాం పంటవైపు మొగ్గుచూపుతున్నారు. అంతేగాకుండా రాష్ట్రంలో ఆయిల్ ఫాంకు సంబంధించిన పరిశ్రమలు రావడం, మార్కెట్ సదుపాయం, ఆశాజనకంగా ధర రావడంతో రైతులు ఆసక్తి చూపుతున్నారు. పంట నిర్వహణ సులభం కావడం, కూలీల సమస్య కూడా ఉండకపోవడం, తోట నాటిన 4-5 ఏళ్ల నుంచి దాదాపు 30 ఏళ్ల పాటు నిరంతర ఆదాయం రావడం కూడా మరోకారణం.ప్రభుత్వం సమకూరుస్తున్న రాయితీలు, క్రషింగ్ మిల్లుల ఏర్పాటుతో రానున్న రోజుల్లో తెలంగాణ ‘పామాయిల్ హబ్’గా మారబోతోందని వ్యవసాయ శాఖ అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Also read: అధిక వడ్డీ చూసి బాండ్స్ కొనకండి.. పెట్టుబడిదారులు చేసే 5 తప్పులు ఇవే