Revanth Reddy: నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలో ప్రజా పాలన ప్రగతి సభ వేదికపై సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో 2034 వరకు అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు 1000 రోజుల ప్రజా పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఏర్పాటుచేసిన సభలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేసిన ఖర్చుపై వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజుల తమ పాలనలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పనులను ప్రజలు గత పదేళ్ల పాలనతో పోల్చి చూడాలని కోరారు.
గత ప్రభుత్వం లో ప్రకటించిన పథకాలను రద్దు చేయకుండ మరింత పెంచి అందుబాటులోకి తెచ్చామన్నారు. 1000 రోజుల్లో అద్భుతమైన పథకాలను తీసుకువస్తే కొంతమంది దుర్మార్గులు సన్నాసులు ప్రభుత్వం ఫెయిల్ అయిందని.. ముఖ్యమంత్రి, మంత్రులు రాజీనామా ఊరూరా పండగ పూట వచ్చే గంగిరెద్దుల తిరుగుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా నిలిచిందని సీఎం తెలిపారు. 25 లక్షల 35 వేల మంది రైతులకు రూ.2 లక్షల లెక్కన రుణమాఫీ చేశామని, 32 నెలల్లో రూ.36 వేల కోట్ల రైతు భరోసా పేరిట అందించామని చెప్పారు. వరి రైతుల ఖాతాల్లో రూ.90 వేల కోట్లు జమ చేశామన్నారు. సన్న వడ్లకు క్వింటాళ్లకు రూ.500 బోనస్ అందించినట్లు చెప్పారు. ఉచిత విద్యుత్ కోసం రూ.30 వేల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు.
కేసిఆర్ పాలనలో 2014 లో నాలుగు విడతలో లక్ష రూపాయల రుణమాఫీ చేస్తే మిత్తి చెల్లింపుకే సరిపోయిందన్నారు. మళ్లీ 2018లో లక్ష రూపాయల రుణమాఫీ చేప్పి అసలుకు మిత్తికి పంగ నామం పెట్టారని ఆరోపించారు. 7 వేల కోట్లకు ఔటర్ రింగ్ రోడ్డు అమ్ముకొని గద్దే దిగిపోయారన్నారు. చివరి విడత రైతుబంధు వేయకుండా మోసం చేశారన్నారు. గత పదేళ్ల పాలనలో వ్యవసాయ ఇతర అన్ని రంగాలను ధ్వంసం చేసి కేసీఆర్ కుటుంబం బంధువులు బందిపోట్లలా మారి తెలంగాణను రాష్ట్రాన్ని నిలువున దోచేసిండ్రు
రేవంత్‌రెడ్డి ఆరోపించారు.
మహాలక్ష్మి పథకంతో మహిళలకు ఆర్టీసీ బస్ ల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తున్నామని రేవంత్‌రెడ్డి చెప్పారు. ఇందుకోసం ప్రభుత్వం ఆర్టీసీకి రూ.11 వేల కోట్లు చెల్లించిందన్నారు. మహిళ సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేస్తూ సోలార్ విద్యుత్ ప్లాంట్లు, పెట్రోల్ బంకులు, శిల్పారామం సమీపంలో సమీపంలో రూ. 1000 కోట్ల విలువైన స్థలాన్ని మహిళా సంఘాలకు కేటాయించి ఇందిరా మహిళా శక్తి పేరిట స్టాళ్లు ఏర్పాటు చేసి అంతర్జాతీయ స్థాయిలో వారి ఉత్పత్తులను విక్రయించేందుకు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. 2034 నాటికి కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ లక్ష్యమని చెప్పారు.
Also read: సుమలత క్షమాపణలు చెప్పాలి.. ఫెడరేషన్ కు శేఖర్ మాస్టర్ ఫిర్యాదు!
తెలంగాణ ఉద్యమంలో నిరుద్యోగ యువత కీలక పాత్ర పోషించిందని సీఎం అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రశ్నాపత్రాల లీకేజీలతో నిరుద్యోగ యువత జీవితాలతో చెలగాటమాడారని ఆరోపించారు. తమ ప్రభుత్వం రెండేళ్లలో 72 వేల ఉద్యోగాలు కల్పించిందని తెలిపారు.కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు తన కుటుంబ సభ్యులకు, బంధువులకు పదవులు ఇస్తే తాను సీఎంగా ఉండి సీతక్క, అట్లూరి లక్ష్మణ్, నల్గొండ జిల్లాకే ఎమ్మెల్సీ శంకర్ నాయక్, అద్దంకి దయాకర్, నెల్లి కంటి సత్యం పదవులు ఇచ్చినట్లు చెప్పారు. అదేవిధంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా మహేష్ కుమార్ గౌడ్ కు అవకాశం ఇచ్చినట్లు చెప్పారు.
వచ్చే ఎన్నికల్లో సిరిసిల్ల, గజ్వేల్, సిద్ధిపేటలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని సీఎం ధీమా వ్యక్తం చేశారు. ఈ నెలాఖరులో సిరిసిల్లకు వస్తానని, అక్కడ కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని చెప్పారు. అనంతరం సిద్ధిపేటకు వస్తానని ప్రకటించారు. కేసీఆర్ సిద్ధంగా ఉండు.. అసెంబ్లీకి రా.. లేకుంటే గౌరవంగా రాజీనామా చేయి.. గజ్వేల్‌లో తేల్చుకుందాం” అంటూ సీఎం సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి వస్తుందని, సీట్లు పెరిగితే 117, ప్రస్తుత సీట్లే ఉంటే 90 స్థానాలతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మద్దతుతో రానున్న రోజుల్లో సంక్షేమ అభివృద్ధి పథకాలను మరిన్ని అమలు చేస్తామని చెప్పారు.
నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశం అధ్యక్షతన సాగిన ఈ బహిరంగ సభలో రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఆర్ అండ్ బి మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, కుందూరు రఘువీర్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బీర్ల ఐలయ్య, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, బాలు నాయక్, కుందూరు జైవీర్ రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, మందుల సామెల్, ఎమ్మెల్సీలు శంకర్ నాయక్, సత్యం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పున్న కైలాష్, స్థానిక నాయకులు ఉన్నారు.
Also read: ఓలా, ఊబర్, ర్యాపిడో బైక్‌లు సీజ్.. రవాణా శాఖకు ఆటో జేఏసీ డెడ్‌లైన్!