
BRS B-forms : తెలంగాణలో ఎన్నికల నగారా మోగి ధాన పార్టీలన్నీ.. ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఇక అభ్యర్థుల ప్రకటనలో, బీ ఫామ్‌ల అందజేతలో ముందున్న బీఆర్ఎస్.. ఇప్పటి వరకు 110 మంది అభ్యర్థులకు బీ ఫామ్‌లు అందజేసింది. మరో తొమ్మిది మందికి మాత్రం ఇంకా బీఫామ్‌లు అందించలేదు. అయితే MIM పోటీ చేసే స్థానాల్లో మద్దతు ఇచ్చేందుకు బీఆర్‌ఎస్ రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. మలక్ పేట్, కార్వాన్, గోషా మహల్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, బహుదూర్‌పురా అసెంబ్లీ స్థానాలకు బీఆర్‌ఎస్ అభ్యర్థులను ప్రకటించలేదు. ఇక నాంపల్లిలో బీఆర్‌ఎస్ పోటీకి దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు అలంపూర్ స్థానాలపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు.
బీఆర్ఎస్ అభ్యర్థులు వీళ్లే ఫైనల్ కాదు.. బీఫామ్‌లు ఇచ్చేలోపు మార్పులు, చేర్పులు కచ్చితంగా ఉంటాయని అభ్యర్థుల ప్రకటన రోజే గులాబీ బాస్ అనౌన్స్ చేశారు. మరి ఈ తొమ్మిది సీట్లలో మార్పులు, చేర్పుల కోరకే వీటిని పెండింగ్‌లో పెట్టారా? అన్న అనుమానాలు మొదలయ్యాయి. ఇప్పటికే బీఫామ్‌లు అందుకున్నవారు ప్రచారంలో బిజీగా మారారు. ఇక పిలుపురాని అభ్యర్థుల పరిస్థితి మాటల్లో చెప్పలేనిదనే చెప్పాలి. కొందరేమో పిలుపు వస్తుందని అనుకుంటున్నప్పటికీ.. మరికొందరేమో ఇక అంతా అయిపోయినట్టేలే అని ఆశలు వదిలేసుకుంటున్నారు.
బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ తొలి విడతలో ప్రకటించిన ఎమ్మెల్యే జాబితాలో.. అలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహం కూడా ఉన్నారు. అయితే అబ్రహాంకు మినహా.. మిగిలిన వారందరికీ ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ బీ ఫాంలు అందజేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి వ్యతిరేకిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక్కడ మరొకరికి బీ ఫామ్ ఇవ్వాలని అధిష్ఠానంపై చల్లా ఒత్తిడి తెస్తున్నట్లుగా సమాచారం. మరోవైపు తనకే బీ ఫాం ఇవ్వాలని అబ్రహం మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌ను కలిసి రిక్వెస్ట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. నర్సాపూర్ అభ్యర్థి ఎంపిక విషయంలోనూ సందిగ్ధత తొలగకపోవడంతో.. ఇక్కడ కూడా బీ ఫాంను ఇవ్వలేదు. ఒకట్రెండు రోజుల్లో ఈ రెండు నియోజకవర్గ అభ్యర్థుల విషయంలోనూ ముఖ్యమంత్రి కేసీఆర్ తుది నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.