BRS Delhi Protest:తెలంగాణ రాజకీయాలు రోజు రోజుకు హీటెక్కిపోతున్నాయి. గత మూడు రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలకి నిరసనగా BRS నాయకులు ఢిల్లీ బాట పట్టారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నేతలు ఇప్పటికే డిల్లీ చేరుకున్నారు.
BRS ప్రతినిధుల బృందం ప్రధానంగా జాతీయ మహిళా కమిషన్ (NCW), జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC)లను కలవనుంది. అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేల పట్ల అధికార పక్ష సభ్యులు, పోలీసులు అసభ్యంగా ప్రవర్తించారని BRS ఆరోపిస్తోంది. ఈ అంశంపై ఆధారాలతో సహా జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైంది.
అలాగే తమ ప్రజాప్రతినిధుల హక్కులకు భంగం కలిగించడం, అకారణంగా అరెస్టులు చేయడం, కేసులతో భయపెట్టడంపై NHRC కి ఫిర్యాదు చేయనున్నారు. ముఖ్యమంత్రి, స్పీకర్, పోలీసు అధికారుల తీరుపై కూడా ఈ కమిషన్లకు పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వనున్నారని తెలుస్తుంది.
జగదీష్‌రెడ్డి ఢిల్లీలో మాట్లాడుతూ
ఈ సందర్భంగా మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి ఢిల్లీలో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు. తెలంగాణలో ప్రస్తుతం ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని, రాష్ట్రంలో ఎమర్జెన్సీ రోజులను తలపించే పరిస్థితులు ఉన్నాయని ఆరోపించారు. అసెంబ్లీకి ప్రజల ఓట్లతో గెలిచి వచ్చిన ఎమ్మెల్యేలను సభలోకి రాకుండా పోలీసులు అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధమని ఫైర్ అయ్యారు. నియోజకవర్గ సమస్యలపై మాట్లాడేందుకు వచ్చిన ప్రజాప్రతినిధుల గొంతు నొక్కుతున్నారని విమర్శించారు.
మార్ఫింగ్ చేసిన AI వీడియోలను ఆసరాగా
ఈ క్రమంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నమార్ఫింగ్ చేసిన AI వీడియోలను ఆసరాగా చేసుకుని పోలీసులు తమ పార్టీ నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారని తెలిపారు. వీడియోల నిజానిజాలు, వాస్తవాలను పరిశీలించకుండానే కేసులు పెడుతూ ప్రతిపక్షాన్ని ఇబ్బంది పెడుతున్నారని వాపోయారు.ప్రస్తుతం ఉన్న మోడ్రన్ టెక్నాలజీని రాజకీయ కక్షసాధింపులకు ఒక టూల్ గా మార్చుకుంటున్నారని అన్నారు.
ఎలాంటి చర్యలు తీసుకుంటాయో
మొత్తంగా చూస్తుంటే తెలంగాణలో జరుగుతున్న ఈ పంచాయితీని కేవలం రాష్ట్రానికే పరిమితం చేయకుండా, జాతీయ స్థాయికి తీసుకపోవాలని BRS భావిస్తోందని అర్థం అవుతుంది.మరి BRS ఇచ్చే నివేదిక ఆధారంగా జాతీయ మహిళా కమిషన్, మానవ హక్కుల కమిషన్లు ఎలా స్పందిస్తాయి? BRS ఇచ్చిన ఫిర్యాదులపై కేంద్ర సంస్థలు ఎలాంటి చర్యలు తీసుకుంటాయనేది ఇపుడు హాట్ టాపిక్ గా మారింది.
ALSO READ:హైదరాబాద్ వాసులకు అలర్ట్.. దుర్గం చెరువు 2 రోజులు క్లోజ్!
ఇక BRS చేపట్టిన ఈ ఢిల్లీ పర్యటన విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అంతే ఘాటుగా స్పందించే అవకాశం ఉంది.చూడాలి మరి ఎవరి నుండి ఎలాంటి మాటల తూటాలు దూసుకొస్తాయో !