Sai Krishna Death Case:రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం స్ప్రుష్టించిన సాయికృష్ణ మృతి కేసు లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ2గా ఉన్న అశోక్, ఏ7గా ఉన్న వెంకటరాజును కస్టడీలోకి తీసుకుని విచారించాలంటూ పోలీసులు పిటిషన్ వేసిన సంగతి తెల్సిందే.అయితే రెండు వైపులా వాదనలు విన్న కోర్టు.. కస్టడీ పిటిషన్‌పై నిర్ణయాన్ని తెలుపకుండా విచారణను వాయిదా వేసింది.
ఈ కేసు మొదలైనప్పటి నుంచి ఒక్కో విషయం బయటకు వస్తుండటంతో సాయికృష్ణ కేసు ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే కేసు దర్యాప్తులో పోలీసులు వేగం పెంచారు. ఇందులో భాగంగానే అశోక్, వెంకటరాజును కస్టడీలోకి తీసుకుని మరింత లోతుగా విచారించాలని పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. కేసుకు సంబంధించి తమకు కావాల్సిన కొన్ని వివరాలను నిందితుల నుంచి తెలుసుకోవాల్సి ఉందని దర్యాప్తు అధికారులు కోర్టు దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.
లోతుగా ప్రశ్నించే అవకాశం
ముఖ్యంగా ఘటనకు ముందు, తర్వాత ఏం జరిగింది? నిందితుల మధ్య ఎలాంటి పరిచయాలు ఉన్నాయి? కేసులో ఎవరి పాత్ర ఎంతవరకు ఉంది? ఇప్పటివరకు బయటకు రాని విషయాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. కస్టడీకి అనుమతి వస్తే ఈ విషయాలపై లోతుగా ప్రశ్నించే అవకాశం ఉంటుంది.
నిర్ణయం తీసుకోవడానికి విచారణను వాయిదా
అయితే నిందితుల తరఫు లాయర్లు మాత్రం పోలీసుల కస్టడీ అభ్యర్థనను వ్యతిరేకించినట్లు సమాచారం. ఇప్పటికే దర్యాప్తు జరుగుతోందని, అవసరమైన వివరాలు సేకరించిన తర్వాత కూడా కస్టడీ కోరడం ఎందుకన్న అంశాన్ని కోర్టు ముందు పెట్టినట్టు తెలుస్తోంది. మొత్తంగా రెండు వైపులా వాదనలు విన్న న్యాయస్థానం.. ఈ విషయంలో నిర్ణయం తీసుకోవడానికి విచారణను వాయిదా వేసింది.
ఇక ఇదే కేసులో ఏ7 వెంకటరాజు పెట్టుకున్నబెయిల్ పిటిషన్‌పైనా కోర్టులో విచారణ జరిగింది. అయితే దీనిపై కూడా నిర్ణయం రాలేదు. వెంకటరాజు బెయిల్ పిటిషన్‌పై కూడా మరుసటి విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది కోర్టు.
కోర్టు అనుమతి ఇస్తుందా?
దీంతో అశోక్, వెంకటరాజు కస్టడీకి కోర్టు అనుమతి ఇస్తుందా? రెండోది.. ఈ నెల 16న వెంకటరాజుకు బెయిల్ వస్తుందా? అనేది ఆసక్తిగా మారింది. ఈ రెండు విషయాల్లో కోర్టు నిర్ణయం కేసు దర్యాప్తుపై ప్రభావం చూపే అవకాశం ఉందని వినిపిస్తుంది.
కేసు ముందుకు వెళ్తుందా?
మొత్తానికి సాయికృష్ణ కేసులో ప్రస్తుతం కస్టడీ, బెయిల్ అంశాలు హాట్ టాపిక్‌గా మారాయి. అశోక్, వెంకటరాజును కస్టడీలోకి తీసుకుంటే దర్యాప్తులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందా? లేక ప్రస్తుత ఆధారాలతోనే కేసు ముందుకు వెళ్తుందా? అనేది రాబోయే విచారణల్లోనే తేలాలి.