Elections: స్వేచ్ఛ బ్యూరో: ఆర్టీసీలో కార్మికసంఘాల ఎన్నికలను గత ప్రభుత్వం రద్దు చేసిందని, త్వరలోనే ఎన్నికల తేదీపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఎన్నికలు పూర్తయిన తర్వాత గెలిచిన సంఘం ప్రతినిధులను అధికారుల కమిటీలో చేర్చి విలీన ప్రక్రియను ముందుకు తీసుకెళ్తామని చెప్పారు.ఇతర రాష్ట్రాల్లో ఆర్టీసీ విలీనం తర్వాత ఎదురైన ఇబ్బందులు తెలంగాణలో పునరావృతం కాకుండా జాగ్రత్తగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతిరోజూ ఆర్టీసీ బస్సులు సుమారు 30 లక్షల కిలోమీటర్లు ప్రయాణిస్తూ 65 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నాయని తెలిపారు. శాసనసభలో ఆర్టీసీపై గురువారం మాట్లాడారు. ప్రజా రవాణా వ్యవస్థలో డ్రైవర్లు, కండక్టర్లు అందిస్తున్న సేవలు అభినందనీయమని, వారి సేవలను ఈ సభ అభినందించాలని కోరారు.
గత ప్రభుత్వం పదేళ్లపాటు ఆర్టీసీని నిర్లక్ష్యం చేసి సంస్థను నిర్వీర్యం చేసిందని విమర్శించారు. రిటైర్డ్ ఈడీని ఎండీగా నియమించి సంస్థ నిర్వహణను బలహీనపరిచారని, కొత్త బస్సులు కొనుగోలు చేయకుండా ఆర్టీసీని నష్టాల బాటలోకి నెట్టారని అన్నారు. కార్మికుల సమస్యలను సైతం పట్టించుకోలేదని పేర్కొన్నారు. 2023 డిసెంబర్ 7న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం, డిసెంబర్ 9న మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామని మంత్రి తెలిపారు. మహాలక్ష్మి పథకం వల్ల మహిళల ఆర్థిక భారం తగ్గడంతో పాటు ఆర్టీసీకి కూడా కొత్త ఊపు వచ్చిందన్నారు. పథకం అమల్లోకి వచ్చిన తర్వాత బస్సుల్లో ఆక్యుపెన్సీ, బస్ స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ గణనీయంగా పెరిగిందని తెలిపారు.
Also read: బడికి పంపితే బానిస పనులా.. పిఠాపురం స్కూల్లో విద్యార్థులతో వెట్టిచాకిరీ కలకలం
మహాలక్ష్మి పథకం..
ఇప్పటివరకు 347.47 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించి రూ.12,171 కోట్లు ఆదా చేసుకున్నారని మంత్రి వెల్లడించారు. ఆసుపత్రులు, దేవాలయాలు, బంధువుల ఇళ్లు, పిల్లల చదువులు తదితర అవసరాల కోసం మహిళలకు మహాలక్ష్మి పథకం ఎంతో ఉపయోగపడుతోందన్నారు. ప్రజల డిమాండ్‌కు అనుగుణంగా కొత్త సర్వీసులు, అదనపు ట్రిప్పులు ప్రారంభిస్తున్నామని చెప్పారు. కరోనా సమయంలో రద్దైన బస్సు సర్వీసులను కూడా ప్రజల అవసరాల మేరకు పునరుద్ధరిస్తున్నామని మంత్రి తెలిపారు. పాత బస్సుల స్థానంలో కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకొస్తున్నామని మంత్రి తెలిపారు. ఇప్పటివరకు 2,932 కొత్త బస్సులను కొనుగోలు చేశామని, 15ఏళ్లు దాటిన బస్సులను కొనసాగించకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
ఇప్పటికే 340 డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా రెట్రోఫిట్ చేశామని వెల్లడించారు. హైదరాబాద్ నగరంలో పీఏం ఈ డ్రైవ్ కింద 2,200 ఎలక్ట్రిక్ బస్సులు తీసుకురానున్నట్లు తెలిపారు. ప్రయాణికుల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రీమియం కేటగిరీ బస్సులతో పాటు ఆర్టీసీ పరిధిలో నడుస్తున్న ఎలక్ట్రిక్ బస్సుల్లో ఇప్పటికే క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. భవిష్యత్‌లో అవసరమైన అన్ని బస్సుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. హైదరాబాద్‌లో లాస్ట్ మైల్ కనెక్టివిటీని మరింత మెరుగుపరుస్తున్నామని తెలిపారు. మెట్రో, ఎంఎంటీఎస్ స్టేషన్ల నుంచి ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకునేలా అదనపు బస్సు రూట్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో 370 కొత్త రూట్లలో బస్సులు నడుపుతున్నామని, అన్ని గ్రామాలకు ఆర్టీసీ బస్సులు చేరేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని మంత్రి వెల్లడించారు. ఆర్టీసీ స్థలాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే విధానం తమ ప్రభుత్వానికి లేదనిస్పష్టం చేశారు. గాజులరామారం, శంషాబాద్, ఫ్యూచర్ సిటీ ప్రాంతాల్లో బస్ టెర్మినల్స్ అభివృద్ధికి అవసరమైన స్థలాలను తీసుకున్నామని చెప్పారు.
Also read: సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు.. ఆ అంశాలపై స్పెషల్ ఫోకస్?