BRS Party: స్వేచ్ఛ బ్యూరో: గులాబీ తీరుతో కేడర్ అయోమయానికి గురవుతున్నారు. పార్టీలో కొనసాగాలా? వద్దా? అనే డోలాయమానంలో పడ్డారు. ప్రతి ఎన్నికల్లో పార్టీకి ప్రతికూల ఫలితాలు వస్తున్నప్పటికీ సమీక్ష చేయకపోవడం, పార్టీపై అధిష్టానం దృష్టిసారించిన దాఖలాలు లేవు. కేవలం ఎన్నికలప్పుడు హడావుడి చేస్తూ ఆ తర్వాత సైలెంట్ అవుతున్నారు. దీంతో మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ పార్టీ ఆశించిన స్థాయిలో చైర్మన్ పీఠాలను గెలుచుకోలేకపోయింది. అంతేకాదు నేతలకు భరోసా కల్పించడంలోనూ వెనుకబాటు ఉండటంతో సైలెంట్ అయ్యారు.
తెలంగాణలో పదేళ్ల పాటు అధికారంలో కొనసాగింది. పార్టీకి బలమైన కేడర్ ఉందని, 60లక్షల సభ్యత్వాలు ఉన్నాయని పార్టీనే ప్రకటించింది. కానీ 2023 అసెంబ్లీ ఎన్నికల నుంచి గులాబీకి గడ్డు పరిస్థితి నెలకొంది. కేవలం 39 నియోజకవర్గాలకే పరిమితం అయ్యే ప్రధానప్రతిపక్షంగా మారింది. అయితే ఆఓటమిపై పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా తెలంగాణ భవన్ లో సమీక్షించారు. నేతల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. కానీ ప్రక్షాళన చేయలేదు. నేతలపై యాక్షన్ సైతం తీసుకోలేదు. కేవలం నామ్ కే వాస్తేగా అభిప్రాయాలు తీసుకున్నారనే ప్రచారం ఇప్పటికి జరుగుతుంది. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూసింది. పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నప్పటికీ ఒక్కదాంట్లోనూ విజయం సాధించలేదు. అయినప్పటికీ ఓటమిపై సమీక్షించలేదు. పార్టీ ఎందుకు బలహీన పడింది.. ఏయే అంశాలు ఓటమికి కారణమయ్యాయి.. అనే అంశాలపై సైతం ఆరా తీసిన దాఖలాలు లేవు. ఇప్పటికీ పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్ చార్జులు ఎవరో కూడా అర్థంకాని పరిస్థితి నెలకొంది. పార్టీ సమీక్షా సమావేశాలు సైతం నిర్వహించలేదు.
గతేడాది డిసెంబర్ లో గ్రామపంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలు కొంత పార్టీకి ఊరట నిచ్చాయి. పార్టీ మద్దతు దారులు 4వేల గ్రామపంచాయతీల్లో విజయం సాధించారని పార్టీ ప్రకటించింది. ఈ ఫిబ్రవరిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ 30కి పైగా మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేసింది. కానీ 18 మున్సిపాలిటీలకే పరిమితం అయింది. 7 కార్పొరేషన్లలో ఒక్కదానిని కూడా సైతం కైవసం చేసుకోలేదు. అంతేకాదు ఉమ్మడి ఖమ్మం, నిజామాబాద్ జిల్లాలో ఒక్క మున్సిపాలిటీని సైతం చేసుకోలేదు. కనీసం దారిదాపుల్లోనూ లేకపోవడం గమనార్హం. జీరో మున్సిపాలిటీలు సాధించిన జిల్లాలపై గులాబీ అధిష్టానం దృష్టిసారించలేదు. అంతేకాదు వరంగల్, నల్లగొండ, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల్లోనూ ఒక మున్సిపాలిటీని మాత్రమే గులాబీకి దక్కింది. అయినప్పటికీ కనీసం పార్టీ ఓటమిపై సమీక్షించిన దాఖలాలు లేవు. ఫలితాలు వచ్చి వారం రోజులు గడిచినా మున్సిపాలిటీల ఇన్ చార్జులు, జిల్లా, నియోజకవర్గ ఇన్ చార్జులతో ఫీడ్ బ్యాక్ తీసుకున్న సందర్భాలు లేవు. కనీసం మున్సిపాలిటీల వారీగానైనా నేతలు సమీక్షించ లేదు.
కేవలం గత వారం రోజులుగా మున్సిపాలిటీ పీఠాల్లో అధికారపార్టీ దౌర్జన్యాలకు పాల్పడుతుందని, కొనుగోలు చేస్తుందని ఆరోపణలు చేస్తుంది. మరోవైపు ఎన్నికల కమిషన్ కు వినతిపత్రాలు అందజేస్తుంది. కానీ అసలు క్షేత్రస్థాయిలో మున్సిపాలిటీల్లో ఫలితాలు రాకపోవడానికి కారణం ఏంటనేదానిపై సమీక్షమాత్రం చేయడం లేదని పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు. పార్టీకి అర్బన్ ప్రాంతాల ప్రజల్లో ఆధరణ ఉన్నప్పటికీ మున్సిపాలిటీల్లో పార్టీ కమిటీలు లేవు. వార్డులేదా డివిజన్ కమిటీలు లేవు. దీంతో అక్కడి నేతలు సమిష్టిగా పనిచేయలేదని స్పష్టమవుతోంది.
నేతలకు భరోసా కల్పించడంలో గులాబీ అధిష్టానం ఫెయిల్ అయిందనే విమర్శలు వస్తున్నాయి. వరుస ఓటముల పాలవుతున్న వారిలో భరోసా కల్పించే సమావేశాలు నిర్వహించకపోవడం, పార్టీ బలోపేతంపై దృష్టిసారించకపోవడం, అధికార కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలపై కార్యక్రమాలు చేపట్టకపోవడతో నైరాశ్యానికి గురవుతున్నారు. కేవలం ఎన్నికలప్పుడే హడావుడి చేస్తూ ఆ తర్వాత సైలెంట్ అవుతుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శలు చేయాలంటేనే జంకుతున్నామని నేతలు పేర్కొంటున్నారు. ఈ తరుణంలో పార్టీ అధిష్టానం కేడర్ లో భరోసా నింపేందుకు ప్రజల పక్షాన ఏదైనా ప్రోగ్రాం తీసుకుంటుందా? ఎన్నికలు ఇంకా రెండేళ్లు ఉందని భావించి ఇప్పుడు అనుసరిస్తున్న విధానాన్నే అనుసరిస్తుందా? అనేది చూడాలి.
Also Read: Rajendranagar: ఘోరం.. యువకుడిని చంపి, పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన దుండగులు.. ఎక్కడంటే?