Kodandaram Comments on BRS Govt. Over Medigadda Project: గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు కట్టొద్దని సూచించినా బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు రీ ఇంజినీరింగ్ కు ముందు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సుజల స్రవంతి పేరుతో ప్రారంభించారని, మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు సరికాదంటూ చెప్పినా గత ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్మాణానికి సిద్ధమైందన్నారు.
ఆర్థికపరమైన అంశాల్లో కూడా నిర్లక్ష్యం వహించిందని క్యాట్ చెప్పిందన్నారు. మేడిగడ్డ డిజైన్ ఒక విధంగా ఉంటే.. నిర్మాణం మరో రకంగా చేయడంతో అది కుంగిపోయిందన్నారు. ప్రాజెక్టు నిర్మాణ మెటీరియల్ సక్రమంగా లేదని.. నిర్వహణ కూడా సరిగా లేదంటూ డ్యాం సేఫ్టీ అధికారులు చెప్పారని కోదండరాం అన్నారు.
తుమ్మిడిహట్టి నుంచి కాలువల ద్వారా నీరు తీసుకురాగలిగితే గతంలో ఖర్చు చేసిన నిధులకు సార్థకత దక్కుతుందన్నారు. తుమ్మిడిహట్టిని పరిశీలించాలని ప్రస్తుత ప్రభుత్వాన్ని, కమిషన్ ను కోరినట్లు కోదండరాం చెప్పారు. ఇంజినీర్ల సూచనలను గత ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. మేడిగడ్డ ప్రాజెక్టులో అవినీతికి పాల్పడినవారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
Also Read: గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్.. నిధులు విడుదల చేస్తూ జీఓ
ఇందుకు సంబంధించి విచారణ కమిషన్ వేయాలంటూ బీఆర్ఎస్ పార్టీనే కోరిందని,కమిషన్ వేస్తే వాస్తవాలు బయటకు వస్తాయంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో డిమాండ్ చేశారంటూ కోదండరాం గుర్తుచేశారు. ఏ ప్రభుత్వమైనా సరే ప్రజల సొమ్మును బాధ్యతాయుతంగా ఖర్చు చేయాలన్నారు. విచారణ కమిటీని రద్దు చేయించి, వాస్తవాలను బయటకు రాకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. దీనిని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు కోదండరాం పేర్కొన్నారు.
పదేళ్లపాటు అధికారంలో ఉన్న కేసీఆర్ తమపైన నమోదైన కేసులను ఎత్తివేయాలని కోరడం బాధ్యతారాహిత్యమన్నారు. బీఆర్ఎస్ పాలనలో తమపై నమోదైన కేసులను ఎత్తివేయాలంటూ ఆయన ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేశారు. బొగ్గు గనుల వేలంకు సంబంధించి కూడా కోదండరాం మాట్లాడారు. బొగ్గు గనులను వేలం వేయడమంటే అది ప్రైవేటీకరణకు దారి తీస్తుందన్నారు. బొగ్గు గనులను సింగరేణికే అప్పగించాలంటూ ఆయన కేంద్రప్రభుత్వానికి సూచించారు.