Kia Carens Clavis CNG: భారత్ లో CNG కార్లకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో కియా ఇండియా ఈ సెగ్మెంట్ మీద గట్టిగా ఫోకస్ చేసింది. కంపెనీ ఇటీవల ప్రకటించిన కేరెన్స్ CNG, కేరెన్స్ క్లావిస్ CNG మోడళ్ల ధరలను తాజాగా ప్రకటించింది. ఫ్యాక్టరీలోనే CNG కిట్‌తో తయారయ్యే ఈ రెండు MPVల ప్రారంభ ధరలు వరుసగా రూ.12.11 లక్షలు, రూ.12.39 లక్షలు (ఎక్స్ షోరూమ్)గా నిర్ణయించింది. ఇప్పటికే ఈ మోడళ్లను కియా ఆవిష్కరించగా, అనంతరం బుకింగ్స్ కూడా ప్రారంభించింది. ఇప్పుడు ధరలు వెల్లడించడంతో కస్టమర్లకు ఈ కొత్త CNG MPVలపై మరింత క్లారిటీ వచ్చింది.
కియా కేరెన్స్ CNGను ప్రీమియం (O) వేరియంట్ లో అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ధర రూ.12.11 లక్షలు. మరోవైపు కేరెన్స్ క్లావిస్ CNGలో HTE, HTE (O) వేరియంట్లు ఉన్నాయి. వీటి ధరలు వరుసగా రూ.12.39 లక్షలు, రూ.13.35 లక్షలుగా నిర్ణయించారు. పెట్రోల్ వేరియంట్లతో పోలిస్తే CNG మోడళ్లకు ధర సుమారు రూ.99,000 ఎక్కువగా ఉంటుంది.
రెండు మోడళ్లలోనూ కియా 1.5 లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌ను తీసుకొచ్చింది. దీనికి 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ను యాడ్ చేశారు. CNGపై నడిచేటప్పుడు ఇంజిన్ 95bhp పవర్, 123Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. పెట్రోల్ తో పాటు CNGని ఉపయోగించుకునేలా డ్యూయల్ ఫ్యూయల్ సెటప్ ను ఏర్పాటు చేశారు. CNG వ్యవస్థలో భాగంగా 60 లీటర్ల ట్యాంక్ ను ఏర్పాటు చేశారు. ఫ్యాక్టరీలోనే CNG కిట్‌ను అమర్చడం వల్ల బయట మార్కెట్ లో ప్రత్యేకంగా కిట్ వేయించుకోవాల్సిన అవసరం ఉండదు. అంతేకాదు, CNG వినియోగానికి అనుగుణంగా కియా ఇంజిన్ క్యాలిబ్రేషన్, సస్పెన్షన్ లో కీలక మార్పులు చేసింది. ముందు భాగంలో 16 అంగుళాల డిస్క్ బ్రేక్‌లను కూడా అందించింది.
CNG టెక్నాలజీని తీసుకొచ్చినప్పటికీ, మూడు వరుసల సీటింగ్, MPV ప్రాక్టికాలిటీని కొనసాగించేందుకు కియా చర్యలు తీసుకుంది. మూడో వరుస సీటు వెనుక ఫ్రేమ్ లో మార్పులు చేసి రిక్లైన్ యాంగిల్ ను మరింత మెరుగుపరిచింది. దీంతో వెనుక వరుసలో కూర్చునే ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన పొజిషన్ లభించేలా డిజైన్ చేశారు.
కేరెన్స్ CNG, క్లావిస్ CNGలో CNGకి సంబంధించిన వివరాలను డ్రైవర్ ఈజీగా తెలుసుకునేలా ప్రత్యేక ఫీచర్లు తీసుకొచ్చారు. ఇందులో CNG ఫ్యూయల్ ఛేంజ్ స్విచ్, CNGతో ఇంకా ఎంత దూరం ప్రయాణించవచ్చో చూపించే డిస్టెన్స్ టు ఎంప్టీ డీటైల్స్ ఉన్నాయి. ఈ వివరాలను 4.2 అంగుళాల కలర్ TFT MIDలో చూసే అవకాశం ఉంటుంది.
Read Also: మైలేజీకి మారుతి కొత్త ప్లాన్.. బాలెనో CNG-AMT వచ్చేసింది!