MLA Harishrao: పథకాల లబ్దిదారుల ఎంపిక కోసం రాష్ట్రవ్యాప్తంగా గ్రామసభలు నిర్వహిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. అయితే అక్కడక్కడ చిన్నపాటి సమస్యలు తలెత్తుతున్నాయి. వీటిని తమకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేస్తోంది విపక్ష బీఆర్ఎస్. ఈ క్రమంలో లైమ్ లైట్‌లోకి వచ్చేశారు ఆ పార్టీ ఎమ్మెల్యే హరీష్‌రావు.
క్షేత్ర స్థాయిలో పరిస్థితి తెలుసుకునేందుకు గ్రామ సభలకు వెళ్దామా అంటూ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. తాను గ్రామ సభకు వస్తానని, ముఖ్యమంత్రి కూడా రావాలని మెలిక పెట్టారు. సీఎం రేవంత్‌రెడ్డి సిద్ధిపేటకు రావాలని, లేదంటే కొండారెడ్డి పల్లికి ఇద్దరు కలిసి వెళ్దామన్నారు.
ప్రజా పాలన కార్యక్రమంలో ప్రజలు దరఖాస్తులు పెట్టుకున్నారని, ఇప్పటికీ పరిష్కారం కాలేదన్నారు. దరఖాస్తు పెట్టినప్పుడల్లా 40 రూపాయల వరకు ఖర్చవుతోందన్నారు. దరఖాస్తుల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తోందన్నారు. పోలీసులను అడ్డు పెట్టుకుని గ్రామ సభలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు.
రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత ఒక్క ఇల్లు కట్టలేదన్నారు. అసలైన అర్హులకు పథకాలు కచ్చితంగా అందజేయాలన్నారు. పనిలోపనిగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోటోకాల్ పాటించ లేదని మనసులోని మాట బయటపెట్టారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలున్నచోట ఫ్లెక్సీలో ఫోటోలు పెడుతున్నారని, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలున్న చోట అదీ లేదన్నారు. ప్రోటోకాల్‌ని తుంగలో తొక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ALSO READ: గ్రామ సభల సమస్యలు.. పరిష్కారం కోసం రాత్రికి
హరీష్‌రావు మాటలపై కాంగ్రెస్ నేతలు కౌంటరిచ్చారు. సీఎం రేవంత్‌రెడ్డి దావోస్‌కి వెళ్లారని, ఈ విషయం తెలిసి గ్రామానికి రావాలంటూ హరీష్‌రావు సవాల్ విసరడంపై ఎద్దేవా చేస్తున్నారు. గడిచిన పదేళ్లు బీఆర్ఎస్ పాలన వల్లే ఇవాళ ప్రజలు అనేక కష్టాలు అనుభవిస్తున్నారని గుర్తు చేస్తున్నారు.
గ్రామ సభ పెట్టి ఒక్కరోజు మాత్రమే అయ్యిందని గుర్తు చేస్తున్నారు నేతలు. తలెత్తుతున్న సమస్యలకు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం మంత్రి ఉత్తమ్ చేస్తున్నారని అంటున్నారు. అధికారం పోయిన తర్వాత ప్రజల్లోకి వెళ్లలేక ఈ విధంగానైనా వెళ్లాలని బీఆర్ఎస్ నేతలు సవాళ్లు విసురుతున్నారని అంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలాసార్లు ఛాలెంజ్ చేసినా, కారు పార్టీ నేతలు స్పందించకపోవడాన్ని గుర్తు చేస్తున్నారు.