Uttam Kumar Reddy: గ్రామ సభల్లో తలెత్తుతున్న సమస్యలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు ప్రభుత్వం దృష్టి సారించింది. రేషన్ కార్డుల వ్యవహారం చాలామందికి జఠిలమైంది. దరఖాస్తు చేసుకున్న వారికి తిరస్కరణ గురైన సందర్భాలు కనిపిస్తున్నాయి. గ్రామ సభల్లో ప్రాక్టీకల్‌గా ఎదురవుతున్న సమస్యలను తెలుసుకునేందుకు రంగంలోకి దిగారు మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి.
పదేళ్ల తర్వాత రేషన్ కార్డులు ఇస్తుండడంతో ప్రజలు పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారు. జనవరి 26 నుంచి నాలుగు స్కీములను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది రేవంత్ సర్కార్. ఈ నేపథ్యంలో జనవరి 21 నుంచి 24 వరకు గ్రామాలు, వార్డుల్లో సభలు నిర్వహిస్తున్నారు.
రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరిట గ్రామాల్లో సభలు పెట్టి లబ్దిదారులను ఎంపిక చేయనున్నారు అధికారులు. ఎంపీడీఓ, ఎమ్మార్వో ఆధ్వరంలో జరుగుతున్న సభలకు కలెక్టర్ స్థాయి అధికారులు సైతం హాజరవుతున్నారు.
తెలంగాణ వ్యాప్తంగా 12, 789 గ్రామాలకు గాను తొలిరోజు 3,400 గ్రామ సభలు నిర్వహించారు. అయితే సభల్లో తమ పేర్లు లేవంటూ అక్కడక్కన నిరసనలు మొదలయ్యాయి. జాబితాలో పేర్లు లేనివారు మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నప్పటికీ, లబ్దిదారుల్లో మాత్రం ఆందోళన నెలకొంది.
ALSO READ: ఈటెలకు కష్టాలు.. దాడిపై కేసు నమోదు, ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే
కొంతమందికి కొత్త రేషన్ కార్డులకు సంబంధించి తమ పేర్లు లేవని అంటున్నారు. ఇంకొందరికి ఇందిరమ్మ ఇళ్లలో తమ పేర్లు కనిపించలేదని వాపోతున్నారు. ఈ క్రమంలో తలెత్తిన సమస్యలపై గతరాత్రి ప్రభుత్వానికి నివేదిక వచ్చినట్టు సమాచారం. ఈ క్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రంగంలోకి దిగేశారు.
ప్రస్తుతం ఎదురవుతున్న సమస్యలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆన్ లైన్‌లో సమావేశం రాత్రి 8 గంటలకు నిర్వహించనున్నారు. ఆయా సమస్యలకు ఫుల్‌స్టాప్ పెట్టాలని భావిస్తున్నారు.